close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 5 PM

1. హైకోర్టు ఆదేశాలపై కేసీఆర్‌ సమీక్ష

ఆర్టీసీ సమ్మె, హైకోర్టు ఆదేశాలపై సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రగతిభవన్‌లో నిర్వహిస్తున్న ఈ సమీక్షకు మంత్రి పువ్వాడ అజయ్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సలహాదారు అనురాగ్‌ శర్మ, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సోమేశ్‌కుమార్‌, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ రామచంద్రరావు తదితరులు హాజరయ్యారు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ఒడ్డుకు చేరిన వశిష్ఠ.. బోటులోనే మృతదేహాలు

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ఠ బోటు 38 రోజుల తర్వాత ఎట్టకేలకు ఒడ్డుకు చేరింది. ధర్మాడి సత్యం బృందం, స్కూబా డైవర్లు తీవ్రంగా శ్రమించి నదిలో నుంచి బోటును వెలికితీశారు. దుర్వాసన వస్తుండటంతో ఎవరూ బోటు వద్దకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. బోటులో గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న ఐదు మృతదేహాలను గుర్తించారు. పూర్తిగా కుళ్లిపోయి ఎముకలు బయటపడుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ఇకపై ఐపీఎల్‌ రెండు నెలలు!

ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) సీజన్‌ రెండు నెలల పాటు జరిగేలా బీసీసీఐ ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం.  సీజన్‌లో రోజుకు ఒక మ్యాచ్ మాత్రమే నిర్వహించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌ను రాత్రి వేళల్లో నిర్వహిస్తారు. ఈ ప్రతిపాదనలను వచ్చే ఐపీఎల్‌ పాలక మండలి సమావేశంలో బీసీసీఐ ప్రవేశపెట్టనుంది. అంతకుముందు వారాంతాల్లో రెండు మ్యాచ్‌లను నిర్వహించేవారు. కానీ, వచ్చే సీజన్‌లో ఒకే మ్యాచ్‌ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. స్వతంత్ర దర్యాప్తు జరిపిస్తాం: నిలేకని

ఇన్ఫోసిస్‌ సీఈఓ సలీల్‌ పరేఖ్‌, సీఎఫ్‌ఓ నీలాంజన్ రాయ్‌లపై వచ్చిన ఆరోపణలపై సంస్థ నాన్‌ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ నందన్‌ నిలేకని మంగళవారం స్పందించారు. గుర్తుతెలియని ఉద్యోగుల బృందం చేసిన ఆరోపణలపై ఆడిట్‌ కమిటీ స్వతంత్ర దర్యాప్తు చేపడుతుందన్నారు. దీనిపై ఇప్పటికే కంపెనీకి చెందిన అంతర్గత ఆడిటర్లను సంప్రదించినట్లు తెలిపారు. అలాగే స్వతంత్ర దర్యాప్తు జరిపేందుకు శార్దూల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ అండ్‌ కంపెనీని కూడా ఆశ్రయించామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. జూబ్లీ బస్టాండ్‌ వద్ద వంటావార్పు

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకూ తీవ్రమవుతోంది. రెండు రోజుల క్రితం కార్యాచరణ ప్రకటించిన ఆర్టీసీ ఐకాస.. దానికనుగుణంగా ముందుకు పోతోంది. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు ఇవాళ జూబ్లీబస్టాండ్‌ వద్ద ‘వంటావార్పు’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డితోపాటు భారీ సంఖ్యలో కార్మికులు హాజరయ్యారు.

6. షైన్‌ ఆస్పత్రి ఘటనపై హెచ్‌ఆర్‌సీలో పిటిషన్

ఎల్బీనగర్‌లోని షైన్‌ పిల్లల ఆస్పత్రిలో అగ్నిప్రమాద ఘటనపై హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్ ‌(హెచ్‌ఆర్‌సీ)లో బాలల హక్కుల సంఘం పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక శాఖను బాధ్యుల్ని చేయాలని అందులో పేర్కొంది. ఎల్‌బీనగర్‌లోని షైన్‌ ఆసుపత్రి పై అంతస్తులో సోమవారం తెల్లవారుజామున  2.40 గంటలకు అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఘటన జరిగిన సమయంలో అయిదుగురు చిన్నారులు అదే అంతస్తులో ఇంక్యుబేటర్లపై చికిత్సపొందుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఏషియన్‌ సినిమాస్‌ అధినేతలపై ఐటీ దాడులు

ప్రముఖ సినీ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ‘ఏషియన్‌ సినిమాస్‌’ అధినేతల ఇళ్లపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. ఏషియన్‌ సినిమా అధినేతలు నారాయణదాస్‌ నారంగ్‌, సునీల్‌ నారంగ్‌ ఇళ్లతో పాటు వారి సన్నిహితుల నివాసాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. వారి ఇళ్లల్లో కీలకమైన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సంస్థకు ఏషియన్‌ సినిమాస్‌ పేరిట థియేటర్లు ఉన్నాయి. ఐటీ సోదాల్లో భాగంగా కొండాపూర్‌లోని ఏఎంబీ సినిమాస్‌లోనూ అధికారులు రికార్డులను తనిఖీ చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ప్రగతిభవన్‌ ముట్టడికి మరోసారి యత్నం

కానిస్టేబుళ్ల ఎంపిక ఫలితాలపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ప్రగతిభవన్‌ ముట్టడికి కానిస్టేబుల్‌ అభ్యర్థులు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కాసేపటి తర్వాత  అభ్యర్థులు మరోసారి ప్రగతిభవన్‌ ముట్టడికి యత్నించడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ అభ్యర్థులు నినదించారు. దీంతో ప్రగతిభవన్‌ వద్ద స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. విడుదలకు ముందురోజు ‘చింతమనేని’పై కేసు

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్యెల్యే చింతమనేని ప్రభాకర్‌పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా ఆయన ఏలూరు జిల్లా కారాగారంలో రిమాండ్‌లో ఉన్నారు. చింతమనేనిపై ఈ నెలన్నర వ్యవధిలో దాదాపు తొమ్మిది కేసులు నమోదయ్యాయి. బెయిల్‌పై రేపు చింతమనేని విడుదల కావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా పోలీసులు ముందు రోజే కేసు నమోదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. మార్కెట్లను కుదిపేసిన ‘ఇన్ఫీ’

దేశీయ మార్కెట్లు మంగళవారం భారీగా పతనమయ్యాయి. సీఈఓపై ఆరోపణలతో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ షేర్లు కుప్పకూలడం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. అటు అంతర్జాతీయ మార్కెట్లు కూడా బలహీనంగానే ఉండటంతో నేటి ట్రేడింగ్‌లో సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 334 పాయింట్లు దిగజారి 38,964 వద్ద, నిఫ్టీ 71 పాయింట్ల నష్టంతో 11,590 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.96గా కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.