close

తాజా వార్తలు

బెంగాల్‌లో భాజపాకు ఎన్‌ఆర్‌సీ దెబ్బ?

కోల్‌కతా: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తగిలిన దెబ్బ నుంచి కోలుకోక ముందే భారతీయ జనతా పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమబెంగాల్‌లో మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ పరాజయం పాలైంది. ఇదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 42 స్థానాలకు 18 స్థానాల్లో గెలుచుకుని మమత ప్రభుత్వానికి చెమటలు పట్టించిన ఆ పార్టీ.. నెలలు తిరగకముందే మూడుస్థానాల్లోనూ ఓటమి పాలవ్వడం గమనార్హం. ఈ ఓటమి వెనుక జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) విషయంలో నెలకొన్న అపోహలు కారణమనడంలో సందేహం లేదు. ఈ విషయాన్ని అటు అధికార తృణమూల్‌తో పాటు ఇటు భాజపా రాష్ట్ర నేతలు సైతం అంగీకరించడం గమనార్హం.

అసోం తరహాలో దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ చేపడతామని భాజపా సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బంగ్లాదేశ్‌ నుంచి అక్రమ వలసదారులను పంపించడమమే లక్ష్యంగా పశ్చిమ బెంగాల్‌లోనూ ఎన్‌ఆర్‌సీ చేపడతామని ఆ పార్టీ ప్రకటించింది. దీన్ని ముందు నుంచీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ వ్యతిరేకిస్తూ వచ్చారు. ఎన్‌ఆర్‌సీ చేపట్టకుండా ఉండేందుకు అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. దీనికి కాంగ్రెస్‌, సీపీఎం కూడా మద్దతు పలికాయి. ఈ విషయంలో భాజపాను దీదీ ఒంటరి చేశారు. ఎన్‌ఆర్‌సీ పేరిట ఒక వర్గం ప్రజలను దేశం నుంచి పంపేయాలని భాజపా చూస్తోందని ఆరోపణలు చేశారు.

ప్రజల్లో భయాందోళన..
ఎన్‌ఆర్‌సీ విషయంలో పొరుగు రాష్ట్రం అనుభవాలు బెంగాలీ ప్రజల్లో భయాందోళన రేకెత్తించాయనడంలో సందేహం లేదు. అసోంలో ఆగస్టు 31న ప్రకటించిన ఎన్‌ఆర్‌సీ జాబితాలో 19 లక్షల మందిని అనర్హులుగా ప్రకటించారు. వీరిలో చాలా మంది తమ పౌరసత్వం నిరూపించుకోవడానికి తగిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించలేకపోవడం ఒక కారణం. ఇందులో హిందువులు, ముస్లింలు సైతం ఉన్నారు. మరోవైపు బెంగాల్‌లో హిందూ, ముస్లింలు సైతం తమ పౌరసత్వానిన్ని నిరూపించుకునేందుకు ఉద్దేశించిన ఆధారాలేవీ లేకపోవడం భయాందోళనకు కారణం. ఈ విషయంలో మొదటి నుంచి తృణమూల్‌తో పాటే ఉన్న ముస్లింలకు.. ఎన్‌ఆర్‌సీ భయాందోళనల నేపథ్యంలో హిందూ ఓటర్లు సైతం తోడయ్యారు.

అవును.. ఎన్‌ఆర్‌సీనే
మూడు స్థానాలకు వెలువడిన ఉప ఎన్నికల ఫలితాల అనంతరం మమత బెనర్జీ మాట్లాడుతూ.. అధికార అహంకారం, ఎన్‌ఆర్‌సీనే భాజపా ఓటమికి కారణమని పేర్కొన్నారు. దాదాపు ఇదే అభిప్రాయాన్ని భాజపా రాష్ట్ర నాయకత్వం వ్యక్తంచేయడం గమనార్హం. బెంగాల్‌లో ఎన్‌ఆర్సీ అమలు విషయంలో ప్రజల్లో నెలకొన్న గందరగోళమే తమ ఓటమికి కారణమని కాలియాగంజ్‌ భాజపా అభ్యర్థి కమల్‌చంద్ర సర్కార్‌ పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రజలను చేరుకోవడంలో విఫలమయ్యామని, దీనిపై ఆత్మ పరిశీలన అవసరం అని అభిప్రాయపడ్డారు. ‘‘2019 ఎన్నికల సమయంలోనూ ఈ ప్రతిపాదన ఉంది కదా. అప్పుడు గెలిచాం కదా’’ అంటూ ఆ పార్టీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ మాత్రం ఓటమికి ఎన్‌ఆర్‌సీనే కారణం అనడాన్ని తోసిపుచ్చారు. అయితే, ఆగస్టు 31న వెలువడిన ఎన్‌ఆర్‌సీ తుది జాబితా తర్వాతనే ప్రజల్లో భయాందోళనలు నెలకొనడం ఇక్కడ ప్రస్తావనార్హం.

ఇదీ చదవండి..
భాజపాకు షాక్‌.. తృణమూల్‌ క్లీన్‌ స్వీప్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.