close

తాజా వార్తలు

సువర్ణ శోభితం... సత్యదేవుని ఆలయ

సువర్ణ శోభితం... సత్యదేవుని ఆలయం

కోరిన కోర్కెలు తీర్చే భక్త వరదుడు అన్నవరం- శ్రీ వీరవెంకట సత్యనారాయణస్వామి. ‘అన్న’వరాలు ఇచ్చే స్వామిగా, భక్తుల కొంగు బంగారంగా తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానం ప్రసిద్ధికెక్కింది. సత్యనారాయణస్వామికి కుడిపక్కన ఈశ్వరుడు, ఎడమ పక్కన అనంతలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారిని రెండు అంతస్తుల్లో దర్శించుకోవాల్సి ఉంటుంది. మొదటి అంతస్తులో స్వామివారి మూలస్తంభం. పాదాలు దర్శించుకొని.. మెట్లపైగా పైఅంతస్తుకు వెళితే శ్రీసత్యనారాయణస్వామి మహేశ్వరుడు.. అనంతలక్ష్మి అమ్మవారు ఒకే పీఠంపై కనువిందు చేస్తారు. ఇలా ఒకే పీఠంపై శివ-కేశవులు, అమ్మవారు కనిపించే ఆలయం మరెక్కడా లేదు!

ఇక్కడ రోజూ సుప్రభాత సేవ మొదలు పలు ప్రత్యేక కార్యక్రమాలు, ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ప్రధానంగా వివాహాది శుభకార్యాలకు ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. కొత్తగా పెళ్లైన దంపతులు తప్పనిసరిగా సత్యదేవ వ్రతం చేయడం తెలుగు ప్రజల సంప్రదాయ. ఈ వ్రత విశిష్టతను పురాణాల్లో సైతం వివరించారు. ఆ మేరకు ఇక్కడ రోజూ సత్యదేవ వ్రతాలు, తిరుమల తరహాలో.. నిత్య కల్యాణాలు జరుగుతుంటాయి.

క్షేత్ర చరిత్ర/ స్థల పురాణం

తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణానికి సుమారు 15 కి.మీ.ల దూరంలోని రత్నగిరి పర్వతంపై 1891-ఖర నామ సంవత్సరంలో శ్రావణ శుద్ధ విదియ రోజున ఒక అంకుడు చెట్టు కింద తాను వెలుస్తానని సమీపంలోని గోర్స దివాణం జమీందార్‌ రాజా ఇనుగంటి వెంకట రామరాయలకు శ్రీసత్యనారాయణస్వామి స్వయంగా కలలో కనిపించి చెప్పారని ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ రాజా తమ గ్రామపెద్దలకు వివరించగా.. అంతా కలిసి స్వామి విగ్రహాల కోసం వెతికారు. కలలో చెప్పినట్లుగా అంకుడు చెట్టు వద్ద శ్రీసత్యదేవుడు అనంతలక్ష్మి అమ్మవార్ల విగ్రహాలు దొరికాయి. తాత్కాలికంగా అక్కడ పందిరి వేసి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఆ తర్వాత ప్రధానాలయం నిర్మించారు. మరోసారి జీర్ణోద్ధరణ చేసి ఇప్పుడున్న ఆలయాన్ని, రాజగోపురాన్ని నిర్మించారు.

దర్శన వేళలు: ఉదయం 6గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సర్వదర్శనాలు ఉంటాయి. ఈ సమయంలో భక్తులు స్వామిని దర్శించుకోవచ్చు. ఇక్కడ స్వామివారి దర్శనం అందరికీ ఉచితమే.

దర్శన సమయంలో విరామం: రోజూ స్వామివారికి మహానివేదన కోసం... మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 30 నిమిషాల పాటు దర్శనాలు ఆపేస్తారు. నివేదన అనంతరం మళ్లీ కొనసాగిస్తారు.

ప్రత్యేక పూజలు, టికెట్ల వివరాలు

ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహిస్తారు.

 సాధారణ వ్రతమైతే రూ. 150, ప్రత్యేక వ్రతమైతే రూ.300, ధ్వజస్తంభం వద్ద చేసేందుకు రూ. 700, విశిష్ట వ్రతమైతే.. రూ. 1500 చొప్పున రుసుం చెల్లించాలి

 వ్రతం చేయించుకునే భక్తులు కొబ్బరికాయలు, అరటిపళ్లు తీసుకొస్తే సరిపోతుంది. మిగతా పూజా సామగ్రి ప్రసాదం, స్వామివారి రూపు, పసుపు, కుంకుమ, తమలపాకులు తదితర పూజా సామగ్రిని దేవస్థానమే సమకూర్చుతుంది. వ్రతకర్తలైన భార్యాభర్తలతో పాటు వారి పిల్లల్ని అనుమతిస్తారు.

విశేషాంశాలు.. పరిసరాల్లోని ఉపాలయాలు: కొండదిగువున ఘాట్‌రోడ్డు ప్రారంభంలో గ్రామ దేవత శ్రీ నేరేళ్లమ్మ తల్లి ఆలయం, తొలిమెట్టు వద్ద శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం, కొండపైకి వచ్చే మెట్ల మార్గం మధ్యలో వనదుర్గ అమ్మవారి ఆలయం, రత్నగిరి కొండపై క్షేత్రపాలకుడు శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయం ఉన్నాయి. అన్నింటిలో దర్శనం ఉచితం. అలాగే ఇక్కడున్న పంపా జలాశయంలో నౌకా విహారం... ఫలభా యంత్ర(సన్‌ డయల్‌) సందర్శన పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. అన్నవరం సత్యదేవుని ప్రసాదానికి విశేష ప్రాధాన్యం ఉంది. దూరప్రాంత భక్తులు ప్రత్యేకంగా ఈ ప్రసాదాన్ని భక్తిశ్రద్ధలతో తమ బంధువులు... సన్నిహితుల కోసమని తీసుకెళ్తుంటారు.

అన్నవరం శ్రీ సత్యదేవునికి నిర్వహించే నిత్యపూజల సమయాలు

 రోజూ తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాత సేవ

 5 గంటలకు ధూపసేవ

 ఉదయం 7 గంటలకు బాలభోగం

7.30 గంటలకు బలిహరణ

ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకూ చతుర్వేద పారాయణలు

మధ్యాహ్నం 12 గంటలకు మహానివేదన

సాయంత్రం 6 గంటలకు ధూపసేవ

రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకూ దర్బారు సేవ

రాత్రి 8.30 గంటల నుంచి 9 గంటల వరకూ ఏకాంత సేవ

పూజల్లో పాల్గొనేందుకు రుసుముల వివరాలు..

పౌర్ణమికి నిర్వహించే ప్రత్యంగిర హోమంలో పాల్గొనేందుకు రూ.558

స్వామి, అమ్మవార్ల దర్శనానంతరం ఘనాపాఠీల ఆశీర్వచనానికి రూ. 558

పవళింపుసేవలో పాల్గొనేందుకు.. రూ. 50

స్వామివారి శాశ్వత కల్యాణం(పదేళ్లు మాత్రమే) ఏటా భక్తులు కోరిన రోజున నిర్వహించేందుకు రూ. 10వేలు

శ్రీ స్వామివారి వ్రతం(పదేళ్లు) ఏటా భక్తులు కోరిన రోజున నిర్వహించేందుకు రూ. 7 వేలు

స్వామివారి శాశ్వత నిత్యపూజ(పదేళ్లకు) ఏటా భక్తులు కోరిన రోజున నిర్వహించేందుకు రూ. 500

ఆలయ మూర్తులకు నిర్వహించే ఇతర సేవలు

రోజూ ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకూ శ్రీ స్వామివారికి నిత్యకల్యాణం జరుగుతుంది. ఇందులో పాల్గొనదల్చిన భక్తులు రూ. 1,000 రుసుం చెల్లించాలి. ఆ మేరకు దేవస్థానమే పూజాసామగ్రి సమకూరుస్తుంది. అనంతరం కల్యాణంలో పాల్గొన్న భక్తులందరికీ స్వామివారి కండువా, జాకెట్టు ముక్క, ప్రసాదం, బంగీ ప్రసాదం అందజేస్తారు.

శ్రీ స్వామివారి మూలవరులకు అభిషేకం(ప్రతి నెలా ముఖ నక్షత్రం రోజున)రూ. 3,000 టిక్కెట్‌పై అనుమతిస్తారు.

రత్నగిరిపై సప్త గోపూజ నిత్యం జరుగుతుంది. రూ. 116 రుసుం చెల్లించాలి.

శ్రీ సత్యనారాయణస్వామివారి మూలవరులకు స్వర్ణపుష్పార్చన. 108 బంగారు పుష్పాలతో పూజచేసి ప్రసాదం అందిస్తారు. దీనికి రూ. 3 వేలు రుసుముగా చెల్లించాలి.

ఉపాలయాల్లో నిర్వహించే పూజలు

 ప్రతి శుక్రవారం రత్నగిరిపై ఉన్న వనదుర్గ అమ్మవారి ఆలయంలో చండీహోమం జరుగుతుంది. ఇందులో పాల్గొనేందుకు భక్తులు ఒక్కొక్కరికి రూ. 558 చెల్లించాలి.

ప్రత్యేక రోజుల్లో విశిష్ట పూజలు: చైత్రశుద్ధ పాడ్యమి పంచాంగ శ్రవణం, చైత్రశుద్ధ అష్టమి నుంచి బహుళ పాడ్యమి వరకూ శ్రీరామనవమి కల్యాణ ఉత్సవాలు జరుగుతాయి.

చైత్ర బహుళ షష్టి నుంచి అమావాస్య వరకూ కనకదుర్గ అమ్మవారి బ్రహ్మోత్సవాలు, వైశాఖ శుద్ధ దశమి నుంచి బహుళ పాడ్యమి వరకూ శ్రీ సత్యదేవుని బ్రహ్మోత్సవాలు, శ్రీ నేరేళ్లమ్మ ఉత్సవాలు, శ్రీ స్వామివారి జయంతి వేడుకలు, శ్రీకృష్ణజయంతి, వినాయక చవితి నవరాత్రులు, శ్రీదేవి నవరాత్రులు, కార్తీకమాసంలో ప్రతి సోమవారం శ్రీ స్వామివారికి లక్షపత్రి పూజ చేస్తారు.

ప్రతి సోమవారం అమ్మవారికి లక్ష కుంకుమ పూజ, గిరి ప్రదక్షిణ, జ్వాలా తోరణం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

వసతి, భోజన సౌకర్యం వివరాలు

రత్నగిరిపైన.. అన్నవరంలోనూ దేవస్థానం చౌల్ట్రీలు.. కాటేజ్‌లు... సత్రాల్లో భక్తులకు వసతి కల్పిస్తారు. మొత్తం మీద సుమారు 500 గదులకు పైగా అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో రోజుకు కనిష్టంగా రూ. 150 నుంచి గరిష్ఠంఆ రూ. 3వేల వరకూ రుసుం వసూలు చేస్తారు. వీటికి ఆన్‌లైన్‌ ద్వారా ముందస్తు బుకింగ్‌ సదుపాయం ఉంది. వీటితో పాటు పలు ప్రైవేటు.. ఆధ్యాత్మిక సంస్థల వసతిగృహాలూ భక్తులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నాయి. దేవస్థానం నిత్యాన్నదాన పథకం కింద భక్తులందరికీ ఉచిత అన్నప్రసాదం అందిస్తోంది.

రవాణా సౌకర్యం

సువర్ణ శోభితం... సత్యదేవుని ఆలయం

 కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిపై తుని పట్టణానికి 18 కి.మీ.ల దూరంలో.. కాకినాడ నగరానికి 45 కి.మీ.ల దూరంలో.. రాజమహేంద్రవరానికి 80 కి.మీ.ల దూరంలో.. విశాఖపట్నం నుంచి 120 కి.మీ.ల దూరంలో అన్నవరం ఉంది. అన్నవరం రైల్వేస్టేషన్‌ ద్వారా రైలు కనెక్టివిటీ ఉంది. విశాఖపట్నం.. రాజమండ్రి విమానాశ్రయాల ద్వారా కూడా అన్నవరం చేరవచ్చు.

 దేవస్థానంలో వసతిగదులు, వ్రత, కల్యాణ టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌చేసుకోవచ్చు. వసతి గదులకు మాత్రం సాధారణ ధరకన్నా 50శాతం ఎక్కువ చెల్లించాలి. ఈ సేవలన్నింటినీ మీ-సేవ కేంద్రాల్లో బుక్‌చేసుకునే అవకాశముంది. మరిన్ని వివరాలకు... ఫోన్‌ 08868-238163 నంబర్లలో దేవస్థానం అధికారులను సంప్రదించవచ్చు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.