
తాజా వార్తలు
పిల్లలు-పెంపకం
‘ నా మాట వినలేదనుకో... నిన్ను చీకటి గదిలో వేస్తా. అక్కడ దెయ్యాలుంటాయి...’ ‘ఇప్పుడు తింటావా... తినవా... ఒక వేళ నువ్వు తినలేదనుకో నిన్ను బూచోడికి పట్టిస్తా...’ - ఇలా పిల్లలు మాట వినాలని ఎన్నో భయాలు పెడతాం. పిల్లలు చెప్పు చేతల్లో ఉండటానికి ఉపయోగించే ఇలాంటి మాటలు అప్పటివరకు బాగానే ఉన్నా... తరువాత అవి వారి జీవితంపై ఎంతో ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు. మరెలా అంటారా... భయపెట్టడానికీ ఓ పద్ధతుంటుంది. దాన్ని తెలుసుకుంటే చాలు.
ఏదయినా సరే... పిల్లలు క్రమంగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. చూడటం, వినడం ద్వారానే కాదు.. ఇతరుల చేతల మూలంగా కూడా వారికి ఒక అంశంపై అవగాహన వస్తుంది. ఇలా నిదానంగా నేర్చుకోవడం వల్ల వారిలో క్రమంగా ఆత్మవిశ్వాసం, సంతృప్తి, మళ్లీ ప్రయత్నించాలనే తపన పెరుగుతాయి. అయితే ఎదిగే క్రమంలోనే అల్లరి చేస్తారు. మొండిగానూ తయారవుతారు. పేచీలు పెడతారు. అలాంటప్పుడు పెద్దవాళ్లు పెట్టే భయాలు పిల్లల మానసిక స్థితిపై ప్రభావాన్ని చూపిస్తాయి. ‘మాట వినకపోతే పోలీసులకు పట్టిస్తా...’, ‘బాగా చదవకపోతే హాస్టల్లో పడేస్తా...’, ‘తిన్నావా సరే లేదంటే బూచోడిని పిలుస్తా...’ ఇలా అన్నీ భయాలే పెడతాం. మాట వినాలనే ఉద్దేశంతో వారు చేసే ప్రతి పనికి ఏదో ఒక భయాన్ని నూరిపోస్తాం. ఇవన్నీ మనకు చిన్న విషయాలే కానీ... ఆ చిన్ని మనసులకు కాదు. పిల్లలు క్రమశిక్షణగా మెలగాలంటే ఇదొక్కటే మార్గం అని పెద్దవాళ్లు భావిస్తారు. కానీ పిల్లలు మాత్రం వీటి కారణంగా ఆలోచన మీద ఆధారపడకుండా వారి మనుసును, ప్రవర్తనను నియంత్రించుకుంటారు. వారిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. అభద్రతా భావం పెరుగుతుంది. ఏ పని ముందుండి చేయడానికి, సృజనాత్మకంగా ఆలోచించడానికి ప్రయత్నించరు. పని మొదలుపెట్టకుండానే అందులో ఎదురయ్యే సమస్యలు తలుచుకొని ఆందోళన చెందుతారు. పెద్దయ్యేకొద్దీ ఈ సమస్యలు పెరుగుతాయే తప్ప తగ్గవు. మరేం చేయాలి...
లాభాలు వివరించాలి కొందరు తల్లిదండ్రులు వారి పిల్లలకు ఏదైనా పని వల్ల జరిగే నష్టాలు వివరిస్తారు. ‘నడిచేటప్పుడు నువ్వు సరిగ్గా నడవకపోతే నీ కాలు విరుగుతుంది. దెబ్బ తగులుతుంది. అలా జరిగితే నువ్వు మళ్లీ నడవలేవు’ వంటి విషయాలు చెబుతారు. ఇలా చేస్తే పిల్లలు మళ్లీ ప్రయత్నం కూడా చేయరు. దేనికైనా మీ నుంచి అనుమతి కోసం వేచి చూస్తారు. అలా కాకుండా నడిచేప్పుడు ‘నువ్వు సరిగ్గా నడిస్తే సమయానికి అక్కడికి చేరుకోగలవు. ఇంకా బాగా నడవగలవు’ అని ప్రోత్సహిస్తే వాళ్లల్లో మరింత ఉత్సాహం కలుగుతుంది. మళ్లీ మళ్లీ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇదే మిగిలినవాటికీ అన్వయించుకుంటారు. |
శాస్త్రీయంగా చెప్పాలి పసిపిల్లల్లో భయాలు నూరిపోసే బదులు వారికి ఏ విషయాన్నైనా శాస్త్రీయంగా చెప్పడం మంచిది. నిప్పు కాలుతుంది అని చెప్పడానికి కొన్ని పేపర్లను, కర్రముక్కల్ని చూపించి వివరించొచ్చు. ఒకవేళ వాళ్లు అది ఎలా ఉంటుందో ఇంకా ఉత్సుకతతో ఉంటే నిప్పునకు కొంచెం దగ్గరగా వెళ్లగానే వారి చేతికి దాని ప్రభావం తెలుస్తుంది. దీంతో వెంటనే చేతిని వెనక్కి తీసుకుంటారు. మళ్లీ ముట్టడానికి ప్రయత్నించరు. ఇలా ఏ విషయాన్నైనా సరే విడమరిచి చెబితే వారు తెలుసుకుంటారు. అర్థం చేసుకుంటారు. |
ప్రశంసించాలి పిల్లలు ఒక్క పట్టాన ఏ పని చేయరు. అలా చేయనప్పుడు వారికి బూచోడు వచ్చి ఎత్తుకుపోతాడనే భయాలు మాత్రం చెప్పొద్దు. బదులుగా ఈ పని నీకోసమే. ఇది చేయడం వల్ల నీకు ఫలానా మేలు జరుగుతుందని వివరంగా చెప్పొచ్చు. పిల్లలు సరిగ్గా అన్నం తిననని మారం చేసినప్పుడు వారికి ఏదో ఒకవిధంగా మభ్యపెట్టి తినిపించాలనే తప్ప భయం కాదు. ఒకవేళ చెప్పినమాట వింటే ప్రశంసిస్తే చాలు. దీనినే కండీషనింగ్ అంటారు. తల్లిదండ్రులు చెప్పింది వినడం వల్ల తనకు నచ్చింది వారు చేస్తారనే భావన వారిలో కలుగుతుంది. |
కథలు చెప్పాలి...
పిల్లలకు బాల్యం నుంచే కథలు చెప్పాలి. ఇలా చేయడం వల్ల కథలోని పాత్రలు, వారి వ్యక్తిత్వాల మూలంగా ఎలా ప్రవర్తించాలో, కొన్ని పరిస్థితుల్లో ఎలా మెలగాలో నేర్చుకుంటారు. నీతి కథలు చెప్పడం వల్ల ఇతరులకు హాని తలపెట్టడం, మూర్ఖంగా ప్రవర్తించడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుంటారు. అంతేకాకుండా కథలోని ప్రధాన పాత్ర ఆధారంగా వారిలో ధైర్యం అలవడుతుంది..
సూచనా ప్రాయంగా...
మన మాటతీరు వాళ్లంతట వాళ్లను ఆలోచించుకునేలా చేస్తుంది. నిర్ణయం తీసుకునేందుకు తోడ్పడుతుంది. వాళ్లు ఏదయినా పొరపాటు చేసినప్పుడు వెంటనే భయపెట్టడమో, కొట్టడమో కాకుండా... ‘ఫలానా విధంగా చేసి ఉంటే బాగుండేది’ అని పరోక్షంగానే సలహా ఇవ్వండి. ఒకసారి వినకపోవచ్చు కానీ... మరోసారి కచ్చితంగా అర్థం చేసుకుంటారు
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- శరణార్థులకు పౌరసత్వం
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
