
తాజా వార్తలు
నటీనటులు: సూర్య, సాయిపల్లవి, రకుల్‌ప్రీత్ సింగ్, దేవరాజ్, బాలా సింగ్ తదితరులు
సంగీతం: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: శివకుమార్ విజయన్
కూర్పు: ప్రవీణ్
నిర్మాణ సంస్థ: డ్రీమ్ వారియర్ పిక్చర్స్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సెల్వ రాఘవన్
విడుదల: 31-05-2019
కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్ ఏర్పరచుకున్న తమిళ స్టార్ సూర్య. గత కొన్నేళ్లుగా ఆయన సినిమాలు తెలుగులోనూ విడుదల అవుతున్నాయి. ప్రేక్షకులు కూడా సూర్యను ఆదరిస్తున్నారు. తొలి తెలుగు సినిమా ‘ఫిదా’తోనే అందరి దృష్టిని ఆకర్షించారు సాయిపల్లవి. ఆమె, సూర్య జంటగా నటించిన సినిమా ‘ఎన్జీకే’ శుక్రవారం విడుదలైంది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్ర పోషించారు. మరి ముగ్గురు స్టార్స్ నటించిన ఈ సినిమా ఆకట్టుకుందా? సూర్య తన ఖాతాలో మరో హిట్ వేసుకున్నారా?
కథేంటంటే: నంద గోపాల్ కృష్ణ అలియాస్ ఎన్జీకే (సూర్య) ఇంజినీరింగ్‌లో పీహెచ్డీ చేసిన యువకుడు. కార్పొరేట్ సంస్థలో ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఊళ్లోనే ఆర్గానిక్ వ్యవసాయాన్ని మొదలుపెడతాడు. తనతో పాటుగా మరికొద్దిమంది యువకులు కూడా ఆ బాటలోనే నడుస్తుంటారు. గోపాలంగా అందరికీ చేదోడువాదోడుగా ఉంటూ ఊళ్లోవాళ్ల సమస్యల్ని కూడా తీరుస్తుంటాడు. దాంతో ఎన్జీకేకి మంచి పేరొస్తుంది. అతని ఆర్గానిక్ వ్యవసాయం వల్ల స్థానిక ఎమ్మెల్యే ఆదాయానికి గండి పడుతుంది. దాంతో ఆర్గానిక్ వ్యవసాయాన్ని దెబ్బకొడతాడు. క్రమంగా ఎన్జీకేని కూడా స్థానిక ఎమ్మెల్యే తన పార్టీలోకి చేర్చుకుని, అతన్ని తన సహాయకుడిగా చేర్చుకుంటాడు. తన వ్యక్తిగత పనులు చేయించుకుంటూ కక్ష తీర్చుకోవడం మొదలుపెడతాడు. బాగా చదువుకున్న ఎన్జీకే ఎమ్మెల్యేకి సహాయకుడిగా పనిచేస్తూనే, రాజకీయం ఎలా నేర్చుకున్నాడు? అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎన్జీకేని, అతని కుటుంబాన్ని ఎందుకు అంతం చేయాలనుకున్నారు? రాజకీయాల్లో ఎన్జీకే లక్ష్యం నెరవేరిందా, లేదా? అతని ప్రయాణంలో గీత కుమారి (సాయిపల్లవి), వనిత (రకుల్ ప్రీత్ సింగ్) పాత్ర ఏమిటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే: ఒక సామాన్య యువకుడు రాజకీయ రణరంగంలో ఎత్తులు, పైఎత్తుల్ని దీటుగా ఎదుర్కొంటూ ఎదిగిన వైనమే ఈ చిత్ర కథ. దక్షిణాదిలో ఈ తరహా కథలు చాలానే తెరపైకొచ్చాయి. సెల్వ రాఘవన్ తన మార్క్ స్క్రీన్‌ప్లేతో కొత్తగా ఆ కథని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆయన కథ పరంగా కానీ, కథనం పరంగా కానీ ప్రేక్షకులపై ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ఆరంభం నుంచి చివరి వరకు సూర్య హుషారైన నటన, ఆయన ఇమేజే సినిమాకి దిక్కైంది. కిందిస్థాయి రాజకీయాల నుంచి ఈ కథ మొదలవుతుంది. క్రమంగా పైస్థాయి రాజకీయాల్ని ప్రతిబింబిస్తూ సాగుతుంది. పాత్రల పరిచయానికి, కథ కుదురుకోవడానికి చాలా సమయం పడుతుంది. దాంతో సన్నివేశాలు సాగదీతగా అనిపించినప్పటికీ.. ఎన్జీకే కుటుంబ నేపథ్యం, లోకల్ రాజకీయాలు ప్రేక్షకులకు కాస్త కాలక్షేపాన్నిచ్చాయి. కానీ ద్వితీయార్ధంలో చెప్పాల్సిందేమీ లేకపోవడం, కథనంలో సత్తా లేకపోవడంతో సన్నివేశాలన్నీ సాగదీతగా మారిపోయి శుభం కార్డు ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూసేలా చేస్తాయి. ఒక ఎమ్మెల్యే స్థానికంగా పలుకుబడి కలిగిన యువకుడిని ఎలా తన దారిలోకి తెచ్చుకుంటాడు? ఎమ్మెల్యే, అతని అనుచరుల జీవితాలు ఎలా ఉంటాయి? హైకమాండ్ దగ్గర ఎలా నడుచుకుంటుంటారనే విషయాలు కాస్త ఆసక్తికరంగా చెప్పారు. మినహా ఇందులో కొత్త విషయాలేమీ లేవు. కథానాయకుడి ఎదుగుదలని కూడా సరిగ్గా తెరపై ఆవిష్కరించలేకపోయారు దర్శకుడు. ఎమ్మెల్యేగా కూడా ఎన్నిక కాని ఓ యువకుడు... ఏకంగా రాజకీయ పార్టీ పెట్టి తమ స్థానాలకి ముప్పు తెస్తాడని ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు భయపడుతూ అతన్ని అంత మొందించే ప్రయత్నం కథకి ఏమాత్రం అతకలేదు. సేంద్రీయ వ్యవసాయం, దేశం భవిష్యత్తు అంటూ తన ప్రయాణం మొదలుపెట్టిన కథానాయకుడు చివరి వరకు రాజకీయ ఎత్తులతోనే కాలక్షేపం చేస్తాడు తప్ప... తన లక్ష్యంపైకి మాత్రం దృష్టిపెట్టడు. ఇలా సినిమాలో లాజిక్‌ని పట్టించుకోకుండా తెరకెక్కించిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి. కథానాయికల పాత్రలు కూడా బలంగా లేవు. సూర్య, సాయిపల్లవి మధ్య సన్నివేశాలు పండలేదు. బలమైన ప్రతినాయకుల పాత్రలు లేకపోవడంతో భావోద్వేగాలు కూడా పండలేదు. ఇందులోని పాత్రలు, కథా నేపథ్యం తెలుగులో విజయవంతమైన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాని గుర్తు చేస్తాయి.
ఎవరెలా చేశారంటే: సూర్య నటనే చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఆయన ఎన్జీకే పాత్రలో ఒదిగిపోయారు. నేర్చుకుంటాను సర్... అంటూ రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టిన ఓ యువకుడిగా చక్కటి అభినయం ప్రదర్శించారు. భార్య పాత్రలో సాయిపల్లవి నటించారు. ఆమె పాత్రలో సహజత్వం ఆకట్టుకున్నా... ఆ పాత్రని తీర్చిదిద్దిన విధానమే మెప్పించదు. రకుల్‌ప్రీత్ సింగ్ పాత్ర పరిధి తక్కువే. కానీ ఆమె ఉన్నంతలో చక్కటి అభినయం ప్రదర్శించారు. ఇక మిగిలిన పాత్రల గురించి చెప్పుకోవల్సిందేమీ లేదు. సాంకేతికంగా సినిమా బాగుంది. యువన్ శంకర్ రాజా సంగీతం, శివకుమార్ విజయన్ కెమెరా పనితనం సినిమాకి ప్రధాన బలాలుగా నిలిచాయి. మామూలు కథల్ని సైతం తనదైన కథనంతో కట్టిపడేసే సెల్వ రాఘవన్ పనితనం ఈ సారి తేలిపోయింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
బలాలు | బలహీనతలు |
+ సూర్య నటన + కథా నేపథ్యం |
- కథ, కథనాలు - సాగదీతగా సన్నివేశాలు |
చివరిగా:ఎన్జీకే... రక్తికట్టని రాజకీయ కథ.
గమనిక:ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- శరణార్థులకు పౌరసత్వం
- భాజపాకు తెరాస షాక్!
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- అమ్మ గురుమూర్తీ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
