
తాజా వార్తలు
పోషకాలమ్
వెలగపండు తెలుసుగా? వినాయకుడికి ఇష్టమైన పండు ఇది. పూజలో పాలవెల్లికి నాలుగువైపులా ఈపండ్లని కట్టే ఉంటారు. వాటిని అలాగే అట్టేపెట్టారా? అయితే వెలగపండుతో ఈ వంటకం వండేయండి. రుచితోపాటు బోలెడు పోషకాలని అందుకోండి...
వెలగపండుని ఆంగ్లంలో ఉడ్యాపిల్ అంటారు. పోషకాలకు ఈ పండు పెట్టింది పేరు. ప్రతి 100గ్రా పండు నుంచి 518 కెలొరీల శక్తి అందుతుంది. రైబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్ సిలను పుష్కలంగా అందించే పండు ఇది.
కడుపులోని నట్టలు, క్రిములని వెలగపండు గుజ్జు తొలగిస్తుంది. రక్తహీనతను తొలగిస్తుంది. నోటికి రుచిని పుట్టిస్తుంది. దీనిలోని జిగురు పేగులకు మంచిది. పేగుల్లో వాపుని, నోటిపూతను తగ్గిస్తుంది. సంవత్సరానికి ఒక్కసారైనా తినాల్సిన ఆహారం ఇది.
పచ్చడి:
కావాల్సినవి: వెలగపండు గుజ్జు- 100గ్రా, బెల్లం- 50గ్రా, చింతపండు- 20గ్రా, పచ్చిమిరపకాయలు- రెండు, కొత్తిమీర తురుము- కొద్దిగా పోపు దినుసులు: మినప్పప్పు- చెంచా, మెంతులు- చిటికెడు, ఆవాలు- పావుచెంచా, జీలకర్ర- పావుచెంచా, ఇంగువ- చిటికెడు, పసుపు- చిటికెడు, ఉప్పు- తగినంత, నువ్వులనూనె- రెండుమూడు చెంచాలు, ఎండు మిరపకాయలు- రెండు
తయారీ: ముందుగా వెలగపండుని సన్నమంటమీద కాల్చి... అందులోని గుజ్జుని తీసి పెట్టుకోవాలి. ఇందులో బెల్లం, చింతపండు, ఉప్పు, పసుపు, ఇంగువ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి మిక్సీపట్టాలి. కడాయిలో నూనె పోసి అందులో... ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో ఈ పోపు వేసి మరొక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. వేడివేడి నెయ్యితో కలుపుకొని తింటే రుచిగా ఉంటుంది. నోటికి రుచి తెలియకుండా ఉన్నప్పుడు ఈ పచ్చడి తింటే చాలా బాగుంటుంది.