భాజపా రాజకీయాలు కేరళలో చెల్లవ్‌‌: శశి థరూర్‌

తాజా వార్తలు

Published : 28/03/2021 18:00 IST

భాజపా రాజకీయాలు కేరళలో చెల్లవ్‌‌: శశి థరూర్‌

దిల్లీ: ‘లవ్‌ జిహాద్‌’ వంటి లేనిపోని భయాలతో భారతీయ జనతా పార్టీ చేసే మతతత్వ, విద్వేష పూరిత రాజకీయాలు కేరళలో చెల్లుబాటు కావని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశి థరూర్‌ అన్నారు. అలాగే ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ ఘన విజయం సాధించి తీరుతుందని ధీమా వ్యక్తంచేశారు. ఈ మేరకు పీటీఐ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

కేరళలో మెట్రో మ్యాన్‌ శ్రీధరన్‌ను సీఎం అభ్యర్థిగా భాజపా ప్రకటించిందని, రాష్ట్రంలో ఆ పార్టీ భవిష్యత్‌కు ఆయనెంత మాత్రం సమాధానం కాదని శశిథరూర్‌ అన్నారు. భాజపా కేవలం మతతత్వ, విద్వేషపూరిత రాజకీయాలు మాత్రమే చేయగలదని, ఆధునిక భావాలు కలిగిన కేరళలో అవి ఎంతమాత్రం సాగవని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలతో కాంగ్రెస్‌ కలిసి పోటీ చేస్తుండడంపై భాజపా చేసిన విమర్శలనూ ఈ సందర్భంగా ఖండించారు. రాష్ట్రం వరకు ఎల్డీఎఫ్‌, యూడీఎఫ్‌ తలపడినప్పటికీ జాతీయ స్థాయిలో లౌకిక, ప్రజావ్యతిరేక విషయాల్లో ఒక్కటిగా పోరాడతామని చెప్పారు. గతంలో లోక్‌సభలో తాను లేవనెత్తిన అనేక విషయాల్లో సీపీఎం ఎంపీలు తనకు మద్దతుగా నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. దేశంలో విలక్షణతకు ఇది నిదర్శమన్నారు. అయినా వైవిధ్యాన్ని ఎప్పటికీ స్వాగతించని భాజపా ఇలాంటి ఆరోపణలు చేయడం ఆశ్చర్యమనిపించలేదని థరూర్‌ అన్నారు.

యూడీఎఫ్‌లో సీఎం అభ్యర్థి ప్రకటించకుండా ఎన్నికలకు వెళుతుండడం నష్టం చేయడం గురించి థరూర్‌ను ప్రశ్నించగా.. అదేమీ అంత పెద్ద విషయం కాదన్నారు. అయినా పార్టీలో చాలా మంది అనుభవజ్ఞులైన నేతలు ఉన్నారని చెప్పారు. ఎల్డీఎఫ్‌ కూటమి వైఫ్యలాలు, అవినీతి, హింస తమకు కలిసొచ్చే అంశమన్నారు. ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిందని విమర్శించారు. కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏప్రిల్‌ 6న ఎన్నికలు జరగనున్నాయి. మే2న ఫలితాలు వెలువడనున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని