వాళ్లు చెప్పేదొకటి.. చేసేది ఇంకొకటి: నడ్డా

తాజా వార్తలు

Published : 25/01/2020 00:29 IST

వాళ్లు చెప్పేదొకటి.. చేసేది ఇంకొకటి: నడ్డా

దిల్లీ: ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ హస్తిన రాజకీయాలు వేడెక్కాయి. దిల్లీలోని కేజ్రీవాల్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదంటూ కేంద్రహోంమంత్రి  అమిత్‌ షా నిన్న ధ్వజమెత్తగా.. తాజాగా భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తనదైన శైలిలో ఆప్‌ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. దిల్లీలో పాఠశాలలు, ఆస్పత్రులు నిర్మిస్తామనీ.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చి నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు. శుక్రవారం ఆయన లక్ష్మీనగర్‌ నియోజకవర్గంలోని పాండవ్‌నగర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. ‘‘500 పాఠశాలలు, కొత్తగా 30 ఆస్పత్రులు నిర్మిస్తామన్నారు. 5 వేల బస్సులు, దిల్లీ నగరంలో లక్షలాది సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజల కోసం ఉచిత వైఫై సెంటర్‌లు, లోక్‌పాల్‌ ఏర్పాటు వంటి హామీలు ఇచ్చారు. కానీ అవేమీ చేయలేదు. ఆప్‌ ఎన్నికల హామీలతో జాగ్రత్త’’ అంటూ ప్రజలను హెచ్చరించారు.

‘‘2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్‌ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్టికల్‌ 370 రద్దు, ట్రిపుల్‌ తలాక్‌ నిషేధం, పౌరసత్వ సవరణ చట్టం.. వంటివి తీసుకొచ్చింది. గత ఐదేళ్లలో మోదీ మిమ్మల్ని పనిచేయనివ్వడంలేదని అన్నారు. కానీ ఐదేళ్లలో చాలా బాగా పనిచేశామని చెబుతున్నారు. అంటే ఆప్‌ నేతలు చెప్పినవన్నీ అవాస్తవాలే? వాళ్లు ఏదో చెప్పారు.. ఇంకేదో చేస్తున్నారు. భాజపా మాత్రం ఏం చెబుతుందో అదే చేస్తుంది’’ అని అన్నారు. అయోధ్య భూవివాదంపై కాంగ్రెస్‌ వ్యవహరించిన తీరునూ ఆయన తప్పుబట్టారు. కాంగ్రెస్‌, ఆప్‌లు పౌరసత్వ సవరణ చట్టంపై ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ విదేశాల్లో హింసకు గురవుతున్న మైనార్టీలను భారత్‌కు తీసుకురావాలనుకున్నారని చెప్పారు. గతంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్న సమయంలోనూ బంగ్లాదేశ్‌లో హింసకు గురవుతున్న మైనార్టీల విషయంలో ఇలాంటి అభిప్రాయమే వ్యక్తంచేశారని తెలిపారు. దీనిపై ఆప్‌, కాంగ్రెస్‌ మాత్రం అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని నడ్డా మండిపడ్డారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని