గల్వాన్‌‌ ఘటన: అఖిలపక్షం కీలక భేటీ

తాజా వార్తలు

Updated : 19/06/2020 17:30 IST

గల్వాన్‌‌ ఘటన: అఖిలపక్షం కీలక భేటీ

దిల్లీ: భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితిపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. చైనా ఆగడాలు హద్దు మీరుతున్న నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరుగుతున్న ఈ సమావేశంలో 20 రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. గల్వాన్‌ లోయ వద్ద సోమవారం రాత్రి చైనా దమనకాండలో 20మంది భారత సైనికులు వీరమరణం పొందిన నేపథ్యంలో మోదీ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశంలో చైనాతో సంబంధాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై దేశ ప్రజలంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. గల్వాన్‌ ఘటన అనంతరం సరిహద్దులో ఏం జరుగుతోందో దేశ ప్రజలకు చెప్పాలంటూ పలు రాజకీయ పార్టీలు కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సరిహద్దు వద్ద పరిస్థితులను కేంద్రం వివరించే అవకాశం ఉంది.

ఈ సమావేశానికి హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలు రాజకీయ పార్టీల అగ్రనేతలు హాజరయ్యారు. ప్రధాని తరఫున రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్ని ప్రధాన పార్టీలకు స్వయంగా ఫోన్‌ చేసి ఆహ్వానించిన విషయం తెలిసిందే. 

మరోవైపు, ఈ కీలక సమావేశానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌), ఆర్జేడీ వంటి పార్టీలను ఆహ్వానించకపోవడంపై వచ్చిన విమర్శలకు కేంద్రం వివరణ ఇచ్చింది. గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, లోక్‌సభలో ఐదుగురు ఎంపీల కంటే ఎక్కువ ఉన్న పార్టీలు, ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు, కేంద్ర కేబినెట్‌లో చోటుదక్కిన పార్టీలను మాత్రమే సమావేశానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. 

దీనిపై ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. తమ పార్టీ దేశం, సైనిక బలగాల తరఫున నిలబడుతుందన్నారు. చైనాపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. మరోవైపు, చైనాతో సైనిక ఒప్పందాలను సమీక్షించాలని ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ వేద్‌ ప్రకాశ్‌ మాలిక్‌ కేంద్రాన్ని కోరారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని