ఆ రెండు యుద్ధాల్ని మేం గెలుస్తాం: అమిత్‌ షా

తాజా వార్తలు

Published : 29/06/2020 01:39 IST

ఆ రెండు యుద్ధాల్ని మేం గెలుస్తాం: అమిత్‌ షా

పాక్‌, చైనా అనుకూల వ్యాఖ్యలు బాధాకరం

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా విమర్శల వర్షం కురిపించారు. ఆ పార్టీ భారత వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతోందని ఘాటుగా విమర్శించారు. సంక్షోభ సమయంలో కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చిల్లర రాజకీయాలు చేయడం శోచనీయమని పేర్కొన్నారు.

గల్వాన్‌, కరోనా అంశాలపై వారం రోజులుగా కాంగ్రెస్‌, భాజపా పరస్పరం విమర్శించుకుంటున్న సంగతి తెలిసిందే. గల్వాన్‌ అంశంపై ప్రధాని నరేంద్రమోదీని రాహుల్‌, సోనియా, మన్మోహన్‌ నిందించారు. దీంతో రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌కు చైనా విరాళం, చైనా కమ్యూనిస్టు పార్టీతో దానికి అనుబంధం వంటి అంశాలను భాజపా తెరపైకి తీసుకొచ్చింది.

‘కరోనా వైరస్‌ మహమ్మారి, లద్దాఖ్‌ సరిహద్దుల్లో చైనా దుందుడుకుతనం వల్ల భారత్‌ సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం ఈ రెండు యుద్ధాలపై గెలిచి తీరుతుంది’ అని అమిత్‌ షా స్పష్టం చేశారు. జులై చివరికల్లా దిల్లీలో 5.5 లక్షల కరోనా కేసులు నమోదవుతాయన్న దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాజధానిలో సామాజిక వ్యాప్తి లేదన్నారు.

‘ఆ వెంటనే మేం సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేశాం. కట్టడి కేంద్రాల్లో ప్రతి ఒక్కరికి టెస్టులు చేయడం సహా అనేక నిర్ణయాలు తీసుకున్నాం. ప్రధాని, కేంద్ర ప్రభుత్వానికి దేశం మొత్తం బాధ్యత ఉంది. దిల్లీ ప్రభుత్వం సైతం కఠినంగా శ్రమిస్తోంది. కేంద్రం వారికి సహకరిస్తోంది. జులై లోపు కరోనా ఐదు లక్షలకు చేరవు ’అని షా అన్నారు.

భారత వ్యతిరేక ప్రచారాన్ని తాము తిప్పికొడుతున్నామని షా అన్నారు. పెద్ద రాజకీయ పార్టీ మాజీ అధ్యక్షుడు (రాహుల్‌ గాంధీ) సంక్షోభ సమయంలో చిల్లర రాజకీయాలు చేయడం బాధిస్తోందన్నారు. ఈ విషయంపై ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ఆ పార్టీ నినాదాలను పాకిస్థాన్‌, చైనా ముందుకు తీసుకెళ్తున్నాయని ఆరోపించారు.

గల్వాన్‌ లోయలో సైనికుల వీరమరణం, చైనా ఆక్రమణల గురించి రాహుల్‌ పదేపదే ప్రశ్నిస్తుండటంతో పార్లమెంటులో తాము చర్చకు సిద్ధమేనన్నారు. ‘త్వరలో పార్లమెంటు సమావేశమవుతుంది. మీరు చర్చించాలనుకుంటే మేం సిద్ధం. 1962 నుంచి ఈ రోజు వరకు ప్రతిదీ చర్చిద్దాం. చర్చకు ఎవరూ భయపడటం లేదు. సైనికులు పోరాడుతున్నప్పుడు, ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటున్న సమయంలో పాకిస్థాన్‌, చైనాను సంతోషపెట్టే వ్యాఖ్యలు చేయకూడదు’ అని షా ఘాటుగా చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని