అశోక్‌గజపతిరాజు జైలుకెళ్లే అవకాశం: విజయసాయి
close

తాజా వార్తలు

Updated : 18/06/2021 17:08 IST

అశోక్‌గజపతిరాజు జైలుకెళ్లే అవకాశం: విజయసాయి

విశాఖపట్నం: సింహాచలం కేసులో సింగిల్‌ జడ్జి తీర్పుపై మళ్లీ కోర్టుకు వెళ్తామని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ‘‘అశోక్‌గజపతిరాజు మాన్సాస్‌ ట్రస్టుకు మాత్రమే ఛైర్మన్‌.. విజయనగరం మొత్తానికి రాజు కాదు. వందల ఎకరాలు దోచుకున్న వ్యక్తి అశోక్‌ గజపతిరాజు. ఆయన అక్రమాలపై విచారణ జరుపుతున్నాం. అశోక్‌ గజపతిరాజుపై ఫోర్జరీ కేసు కూడా ఉంది. ఏదో ఒక రోజు జైలుకెళ్లే  అవకాశం ఉంది. సుప్రీం తీర్పు ప్రకారం స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం లేదు. మాన్సాస్‌ ట్రస్టులో మాత్రం పురుషులే ఛైర్మన్లు కావాలని నిబంధన పెట్టారు. మహిళల పట్ల అశోక్‌గజపతిరాజు వివక్ష చూపించారు. స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా నియమాలు పెట్టుకున్నారు. ప్రభుత్వం దేవాదాయశాఖ నియమాల మేరకే నడుచుకుంది’’ అని విజయసాయిరెడ్డి  మీడియాతో అన్నారు. 

మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌గా సంచైత గజపతిరాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు రద్దు చేసింది. ఆమె నియామకం చెల్లదని స్పష్టం చేసింది. ట్రస్టు వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా సంచైత గజపతిరాజు, ఊర్మిళ గజపతిరాజు, ఆర్‌వీ సునీత ప్రసాద్‌లను గుర్తిస్తూ ప్రభుత్వం ఇచ్చిన మరో జీవోనూ రద్దు చేసింది. సింహాచలం దేవస్థానం ఛైర్మన్‌గా సంచైత గజపతిరాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన జీవోనూ హైకోర్టు కొట్టేసింది. మొత్తం నాలుగు జీవోలను (71, 72, 73, 74) రద్దు చేసింది. కేంద్ర మాజీ మంత్రి, ట్రస్టు పూర్వ ఛైర్మన్‌ అశోక్‌గజపతిరాజును మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌గా, సింహాచలం దేవస్థానం వంశపారంపర్య ట్రస్టీ/ ఛైర్మన్‌గా పునరుద్ధరించింది. ఆయన నియామకాలకు సంబంధించి గతంలో జారీ చేసిన జీవోలను సమర్ధించింది. మాన్సాస్‌ ట్రస్టు.. ట్రస్టు డీడ్‌, ప్రాపర్టీ రిజిస్టర్‌ ప్రకారం ‘కుటుంబంలో పెద్దవారయిన పురుషులు’ వంశపారంపర్య ఛైర్మన్‌/అధ్యక్షులుగా వ్యవహరించాలని స్పష్టంగా ఉందని, అందువల్ల అశోక్‌గజపతిరాజే ట్రస్టు ఛైర్మన్‌గా ఉండాలని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. దీంతో ఏకీభవించిన హైకోర్టు సంచైత నియామకాన్ని రద్దు చేస్తూ అశోక్‌గజపతిరాజు నియామకాన్ని పునరుద్ధరించిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని