బాధితులకు పింఛన్లు అందించండి

ప్రధానాంశాలు

బాధితులకు పింఛన్లు అందించండి

‘ఈనాడు’ చిత్ర కథనాలు సుమోటోగా తీసుకున్న హెచ్చార్సీ

ఈనాడు డిజిటల్‌, కర్నూలు: కృష్ణా జిల్లా కంకిపాడు మండలం వేల్పూరుకు చెందిన భరత్‌, భవిష్‌లకు.. అదే జిల్లా కొత్తూరు తాడేపల్లికి చెందిన వెంకట కార్తీక్‌కు పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ అధికారులను ఆదేశించింది. ‘ప్రభుత్వ ఉద్యోగిని కాదు.. కూలీగా బతుకీడుస్తున్నా’, ‘ఆధార్‌ లేక కష్టాలు’ శీర్షికలతో ‘ఈనాడు’ ప్రధాన పత్రికలో మంగళవారం చిత్ర కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై హెచ్చార్సీ స్పందించింది. కమిషన్‌ ఛైర్మన్‌ సీతారామమూర్తి, జ్యుడీషియల్‌ సభ్యులు సుబ్రహ్మణ్యం, నాన్‌ జ్యుడీషియల్‌ సభ్యులు శ్రీనివాసరావు సుమోటో(స్వచ్ఛందంగా)గా ఈ కేసులను స్వీకరించారు. బాధితులు ముగ్గురికీ సదరం పోర్టల్‌లో దరఖాస్తు చేయించి పింఛన్లు మంజూరు చేయాలని ఆదేశాలిచ్చారు. ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్‌, జేసీ, తహసీల్దార్‌, ఆయా గ్రామాల వీఆర్వోలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రక్రియ నెలలోగా పూర్తి చేసి నవంబరు 30న నివేదిక అందజేయాలని హెచ్చార్సీ ఆదేశించిందని కమిషన్‌ విభాగాధికారి బి.తారక నరసింహ కుమార్‌ ‘ఈనాడు’కు తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని