భయంతోనే భాజపాలోకి ఈటల
close

ప్రధానాంశాలు

భయంతోనే భాజపాలోకి ఈటల

హుజూరాబాద్‌ ప్రజలకు ద్రోహం చేశారు
వారంతా కేసీఆర్‌ వెంటే ఉన్నారు
మంత్రి జగదీశ్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: భాజపాలో చేరడంతో ఈటల రాజేందర్‌కు ముందు నుంచే ప్రత్యేక ఎజెండా ఉందని రుజువైందని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. దేశంలో మునిగిపోయే నావలాంటి భాజపాలో చేరారని, ఆయనతోపాటు చేరే వారూ మునిగి పోతారన్నారు. ఇన్ని రోజులు హిట్లర్‌ వారసుల పార్టీ అని భాజపాను విమర్శించిన ఈటల..అదే పార్టీలో చేరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ‘‘ఆయన నిజాయితీపరుడైతే తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకూ తెరాసలో ఉండాల్సింది. తప్పు చేశారు కాబట్టే భయంతో ఆ పార్టీ పంచన చేరారు. గుంపును వదిలి అడవిలోకి పోతే... మృగాల పాలవడం ఖాయమనే విషయాన్ని ఈటల త్వరలోనే గ్రహిస్తారు’ అని వ్యాఖ్యానించారు. ఈటల రాజేందర్‌ తమకు సేవ చేస్తారని ప్రజలు గెలిపిస్తే, వారికి ద్రోహం చేసి పార్టీ మారారన్నారు. సోమవారం మంత్రి తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యేలు గాదరికిశోర్‌, మల్లయ్యయాదవ్‌, పైలాశేఖర్‌రెడ్డి, భాస్కర్‌రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘ఈటల చెబుతున్న దానికి.. చేస్తున్న దానికి పొంతన లేదు. తెరాసలో సముచిత స్థానంలో ఉన్నారు. ప్రతి పార్టీలో అభిప్రాయ భేదాలు సహజం.. కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారమయ్యేవి. ప్రజలంతా వ్యతిరేకిస్తున్న పార్టీ భాజపా. అన్నింటా విఫలమైంది. ఒక్క సంక్షేమ పథకం కూడా తేలేదు. బీసీలకు భాజపా చేసిందేమిటని ఈటల పలుమార్లు ప్రశ్నించారు. తనస్వార్థంతో భాజపాలో చేరిన ఆయన అందులో ఉండి ప్రజలకు ఏం న్యాయం చేస్తారో సమాధానం చెప్పాలి?’ అని నిలదీశారు. హుజూరాబాద్‌ ప్రజలు కేసీఆర్‌ వెంటే ఉన్నారన్నారు. భూముల అమ్మకం తెలంగాణ అభివృద్ధి కోసమేనన్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని