పార్టీకి నష్టం కలిగిస్తే చర్యలు తప్పవు

ప్రధానాంశాలు

పార్టీకి నష్టం కలిగిస్తే చర్యలు తప్పవు

హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ ఎన్నికల సన్నాహక సమావేశంలో రేవంత్‌రెడ్డి హెచ్చరిక
దళిత దండోరాకు రాహుల్‌గాంధీ వస్తారు

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌లో ఉంటూ పార్టీకి నష్టం కలిగించేవారిపై చర్యలు తప్పవని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. తనతోపాటు ఎవరు అలా చేసినా చర్యలు ఉండాల్సిందే అని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీలోని కొందరిని కోవర్టులుగా మార్చుకుని సీఎం కేసీఆర్‌ రాజకీయ లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు.  హుజూరాబాద్‌ ఎన్నికలపై బుధవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ డిప్యూటీ సీఎం దామోదర్‌ రాజనర్సింహా, ముఖ్యనేతలు గీతారెడ్డి, జగ్గారెడ్డి, కరీంనగర్‌ జిల్లా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఆగస్టు 11 నుంచి 21 వరకూ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ప్రతిరోజూ రెండు నుంచి మూడు వేల మంది పాల్గొనేలా చూడాలన్నారు. అభ్యర్థి ఎంపికలో సామాజిక వర్గాలతో పాటు పార్టీ పట్ల అంకితభావం వంటి అంశాలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. అభ్యర్థి ఎంపికపై పార్టీ ముఖ్యనేతలు దామోదర్‌ రాజనర్సింహా, పొన్నం ప్రభాకర్‌లు దృష్టిసారిస్తారని తెలిపారు.

లక్ష మందితో ఇంద్రవెల్లి దళిత, గిరిజన దండోరా

ఆగస్టు 9న ఇంద్రవెల్లిలో లక్షమందితో దళిత గిరిజన దండోరా కార్యక్రమం చేపట్టనున్నట్లు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కుమురం భీం స్పూర్తితో మరో ఉద్యమానికి సిద్ధం కావాలన్నారు. ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీతో కూడా దళిత దండోరాపై చర్చించినట్లు తెలిపారు. ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 17 వరకు జరిగే దళిత దండోరా కార్యక్రమంలో ఒక రోజు రాహుల్‌గాంధీ పాల్గొంటారని తెలిపారు.

ప్రభుత్వానికి బుద్ధిచెప్పేందుకే..

సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ తెరాస ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకే దళిత గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఇంద్రవెల్లి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ఉద్యమం ప్రారంభమవుతుందన్నారు. హుజూరాబాద్‌ ఎన్నికలు ఉన్నందునే సీఎం కేసీఆర్‌కు దళితులు గుర్తుకు వచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా ఇంద్రవెల్లి దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా గోడపత్రికను విడుదల చేశారు. కుమురం భీం మనుమడు వెడ్మా బొజ్జాతో పాటు కొందరు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవల మరణించిన గాంధీభవన్‌ సీనియర్‌ ఉద్యోగి షబ్బీర్‌ కుటుంబాన్ని రేవంత్‌రెడ్డి పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని