ముసుగు తొలగింది.. ప్రజలు నమ్మరు

ప్రధానాంశాలు

ముసుగు తొలగింది.. ప్రజలు నమ్మరు

విజయం కోసం డబ్బులనే నమ్ముకున్న కేసీఆర్‌
హుజూరాబాద్‌లో ఇప్పటికే  రూ.150 కోట్ల ఖర్చు: ఈటల

ఫిలింనగర్‌, హుజూరాబాద్‌, న్యూస్‌టుడే: ఓట్ల కోసం వందల కోట్లు ఖర్చు పెడుతూ.. ఉద్యమద్రోహులకు పదవులు కట్టబెడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిజస్వరూపం ప్రజలకు తెలిసిపోయిందని, ఇక ఆయన్ను నమ్మేస్థితిలో లేరని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ అన్నారు. విజయం కోసం రూ.వేల కోట్లను నమ్ముకున్న కేసీఆర్‌ ఇప్పటికే నియోజకవర్గంలో రూ.150 కోట్లను ఖర్చు చేశారని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో కొద్దిరోజులుగా చికిత్స పొందిన ఈటల గురువారం డిశ్ఛార్జయ్యారు. అనంతరం, హుజూరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో ఒక్కో నాయకుడికి ఖరీదు కట్టి కొనుగోళ్ల పర్వానికి తెరాస నాయకులు తెర లేపారన్నారు. అధికారపార్టీ చేస్తున్న అన్ని సర్వేల్లో 70 శాతం తనకే అనుకూలంగా ఉన్నట్లు తేలిందని, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అధికారపార్టీకి ఓటమి తప్పదని ఈటల స్పష్టం చేశారు. దళితబంధు పథకాన్ని స్వాగతిస్తున్నానంటూ రాష్ట్రంలోని అన్ని దళిత కుటుంబాలకు ఆ పథకాన్ని వర్తింపజేయాలన్నారు. సంచార జాతులు, ఇతర బీసీ కులాలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన అన్ని వర్గాలనూ ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. నేను నాటకాలు ఆడుతున్నానంటూ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఈటల బదులిచ్చారు. ఓదార్పు యాత్ర సందర్భంగా మానుకోటలో ఉద్యమకారులపై రాళ్ల దాడి చేసిన కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా నియమించారని.. దీనిపై ఉద్యమకారులంతా ఆలోచించాలని ఈటల కోరారు. వైద్యుల సూచన మేరకు జాగ్రత్తలు తీసుకుని మూడునాలుగు రోజుల్లోనే పాదయాత్ర ప్రారంభిస్తానని చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని