కోహ్లీసేనను రక్షించాలంటే ద్రవిడ్ వెళ్లాల్సిందే!

తాజా వార్తలు

Published : 21/12/2020 01:31 IST

కోహ్లీసేనను రక్షించాలంటే ద్రవిడ్ వెళ్లాల్సిందే!

ఇంటర్నెట్‌డెస్క్‌: విరాట్ కోహ్లీ, చెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె వంటి మేటి బ్యాట్స్‌మెన్ జట్టులో ఉన్నా టీమిండియా 36 పరుగులకే కుప్పకూలి కోరుకోని రికార్డు నమోదుచేసింది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్లు వేగంగా విసిరిన ఇన్‌స్వింగర్‌, ఔట్ స్వింగర్స్‌కు భారత ఆటగాళ్ల వద్ద సమాధానం దొరకని పరిస్థితి ఏర్పడింది. అంతేగాక, కోహ్లీ పితృత్వ సెలవులపై స్వదేశానికి తిరిగిరానుండటంతో.. ఆసీస్‌తో ఆడాల్సిన మూడు టెస్టుల్లో టీమిండియా ఏ స్థాయిలో ప్రదర్శన చేస్తుందని సందేహాలు మొదలయ్యాయి.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా తిరిగి సత్తాచాటాలంటే ఆస్ట్రేలియాకు దిగ్గజ బ్యాట్స్‌మన్‌ రాహుల్ ద్రవిడ్ వెళ్లాలని, దీనిపై బీసీసీఐ చొరవ తీసుకోవాలని మాజీ క్రికెటర్ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ పేర్కొన్నాడు. బౌలర్లు ఆధిపత్యం చెలాయిస్తున్న ఎన్నో సందర్భాల్లో... ద్రవిడ్‌ క్రీజులోకి వచ్చి గోడకట్టినట్లుగా డిఫెన్స్‌ చేస్తూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్న సంగతి తెలిసిందే. అలాంటి అనుభవజ్ఞుడు ద్రవిడ్‌ నెట్స్‌లో ఉంటే టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని వెంగ్‌సర్కార్‌ అన్నాడు.

‘‘రాహుల్‌ ద్రవిడ్‌ను ఆస్ట్రేలియాకు పంపించి భారత జట్టుకు సాయంచేసేలా బీసీసీఐ చొరవ తీసుకోవాలి. అక్కడి పరిస్థితుల్లో స్వింగ్ అయ్యే బంతిని ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని ద్రవిడ్ కంటే గొప్పగా మరెవరు చెప్పలేరు. అంతేగాక, అతడు నెట్స్‌లో ఉంటే జట్టులో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. కొవిడ్‌ కారణంగా గత కొన్ని నెలలు ఎన్‌సీఏను మూసివేసి ఉంచారు. ద్రవిడ్‌ ఆసీస్‌కు వెళ్తే ఎన్‌సీఏలో అంతగా ఇబ్బందులు తలెత్తవని భావిస్తున్నా. కోహ్లీ చివరి మూడు టెస్టులకు దూరమవుతున్న ఈ సమయంలో టీమిండియాకు ద్రవిడ్‌ సేవలు ఉపయోగపడేలా బీసీసీఐ ప్రయత్నించాలి. అతడు ఆసీస్‌కు బయలుదేరితే అక్కడి క్వారంటైన్‌ నిబంధనలు పూర్తిచేసి.. జనవరి 7న ప్రారంభమయ్యే మూడో టెస్టుకు ముందు జట్టుతో కలుస్తాడు’’ అని వెంగ్‌సర్కార్‌ తెలిపాడు. ఎన్‌సీఏ డైరెక్టర్‌గా ద్రవిడ్ బాధ్యతలు వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి

పృథ్వీ షా వద్దు..రాహుల్‌ రావాల్సిందే

స్మిత్‌ ఆధిక్యాన్ని తగ్గించిన కోహ్లీ


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని