
తాజా వార్తలు
నిలవాలంటే భారత్ గెలవాల్సిందే!
రేపటి వన్డేలో కోహ్లీసేన పుంజుకుంటుందా?
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా ఓటమితో ఆరంభించింది. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ ఘోరంగా విఫలమై పరాజయాన్ని చవిచూసింది. అయితే సిరీస్ రేసులో నిలవాలంటే రేపటి మ్యాచ్‌లో కోహ్లీసేన తప్పక విజయం సాధించాలి. కాగా, హార్దిక్ పాండ్య బౌలింగ్‌కు దూరమవ్వడంతో భారత్‌కు బౌలింగ్ వనరులు పరిమితంగా మారాయి. ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగాల్సి వస్తుంది. దీంతో ‘ప్లాన్-బి’కీ ఎటువంటి అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో పటిష్ట బ్యాటింగ్ లైనప్ కలిగిన ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు అనుకూలించే సిడ్నీ పిచ్‌పై భారత బౌలర్లు ఎలా కట్టడి చేస్తారనేది ఆసక్తికరం.
తొలి వన్డేలో భారత్ 66 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. హార్దిక్ 76 బంతుల్లో 90 పరుగులతో గొప్పగా పోరాడాడు. కానీ 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో హార్దిక్ ఇన్నింగ్స్ మాదిరిగానే ఇదీ జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయింది. అయితే హార్దిక్ బౌలింగ్‌కు దూరంకావడంతో జట్టులో ఆరో బౌలర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. కాగా, టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని దానికి తగ్గట్లుగా సన్నద్ధమవుతున్నట్టు అతడు తెలిపినా బ్యాకప్ ఆల్‌రౌండర్ లేకపోవడం టీమిండియాకి ఇబ్బందిగా మారింది. దీంతో ‘ప్లాన్-బి’కీ అవకాశం లేకపోవడంతో ఐదుగురు బౌలర్లతో ‘ప్లాన్-ఎ’ను విజయవంతం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జట్టులో శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్. ఇక ఆరో బౌలర్‌గా కెప్టెన్ కోహ్లీ మాత్రమే ఉన్నాడు. అతడు నుంచి ఒకటి లేదా రెండు ఓవర్లు ఆశించొచ్చు. కానీ ఈ మధ్య కాలంలో విరాట్ బౌలింగ్ చేసిన పరిస్థితులు చాలా అరుదు. మరోవైపు తొలి మ్యాచ్‌లో సైని, చాహల్ కలిసి 20 ఓవర్లలో 172 పరుగులు ఇచ్చారు. అయితే చాహల్ తన స్పెల్ ముగిసిన తర్వాత గాయంతో మైదానాన్ని వీడాడు. సైని వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. వారిద్దరు రెండో మ్యాచ్‌కు ఫిట్నెస్ సాధించకపోతే శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ జట్టులోకి వస్తారు. మరో పేసర్ నటరాజన్ జట్టులో ఉన్నప్పటికీ బ్యాటింగ్ కూడా చేయగలిగే శార్దూల్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
బుమ్రాపై ఒత్తిడి
ఆరో బౌలర్ లేకపోవడం బుమ్రాపై ఒత్తిడిని పెంచుతుంది. గాయం నుంచి కోలుకొని న్యూజిలాండ్ సిరీస్‌తో జట్టులో చేరిన అతడు వన్డేలో తన ఫామ్‌ను కొనసాగించట్లేదు. ఐపీఎల్లో మెరిసినప్పటికీ 50 ఓవర్ల ఫార్మాట్లో సత్తా చాటలేకపోతున్నాడు. కాగా, షమి కట్టుదిట్టంగా బంతులు వేస్తుండటం భారత్‌కు ఊరట. అతడితో పాటు బుమ్రా కూడా మెరిస్తే ఆస్ట్రేలియా స్కోరును పరిమితం చేయవచ్చు. అయితే సూపర్ ఫామ్‌లో ఉన్న ఆసీస్ టాప్ఆర్డర్ ఫించ్, వార్నర్, స్మిత్‌ను భారత బౌలింగ్ దళం ఎలా కట్టడిచేస్తుందో చూడాలి.
సమయోచిత ఇన్నింగ్స్‌లు ఆడితేనే..
ఇక ఛేదనలో 300పరుగులు దాటినప్పటికీ ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోవడం టీమిండియాకి హెచ్చరిక లాంటిదే. హేజిల్‌వుడ్ వేసిన బౌన్సర్‌ను పేలవమైన షాట్‌తో శ్రేయస్ అయ్యర్ ఔటవ్వడం నిరాశకు గురిచేసింది. మయాంక్ బాగానే ఆడుతున్నా నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నాడు. కాగా, రెండో వన్డేలో పైచేయి సాధించాలంటే భారత ఆటగాళ్లు సమయోచిత ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంది. ధావన్, హార్దిక్‌తో పాటు కేఎల్ రాహుల్ రాణించాలి. కెప్టెన్ విరాట్ కోహ్లీ గొప్ప ఇన్నింగ్స్‌తో జట్టును నడిపించాలి. అంతేగాక మైదానంలోనూ చురుకుగా కదిలితేనే ఫించ్ సేనపై టీమిండియా విజయం సాధించి రేసులో నిలుస్తుంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో పక్కటెముకల గాయంతో ఇబ్బంది పడిన స్టాయినిస్ స్థానంలో కామెరన్ గ్రీన్ ఆసీస్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా రెండో వన్డే ఆదివారం జరగనుంది.
జట్ల వివరాలు
భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్య, మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, నవదీప్ సైని, శార్దూల్ ఠాకూర్, టీ నటరాజన్
ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, లబుషేన్, మాక్స్వెల్, స్టాయినిస్, అలెక్స్ కేరీ, కమిన్స్, మిచెల్ స్టార్క్, జంపా, హేజిల్‌వుడ్, సీన్ అబాట్, ఆస్టన్ అగర్, కామెరన్ గ్రీన్, హెన్రిక్స్, ఆండ్రూ టై, డేనియల్ సామ్స్, మాథ్యూ వేడ్