IPL 2021: దిల్లీకి తలనొప్పి.. ముంబయి క్వారంటైన్‌ పూర్తి.. ఆగస్టు 31లోపు ఫ్రాంచైజీల ప్రయాణం

తాజా వార్తలు

Published : 19/08/2021 14:45 IST

IPL 2021: దిల్లీకి తలనొప్పి.. ముంబయి క్వారంటైన్‌ పూర్తి.. ఆగస్టు 31లోపు ఫ్రాంచైజీల ప్రయాణం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ రెండో దశ సమీపిస్తుండటంతో సందడి పెరుగుతోంది! ఫ్రాంచైజీలన్నీ తమ పనులను త్వరగా కానిచ్చేస్తున్నాయి. ఇప్పటికే ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ యూఏఈకి చేరుకున్నాయి. మిగిలిన జట్లు ఆగస్టు 31లోపు అక్కడికి వెళ్లేందుకు సన్నాహాల్లో మునిగాయి. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మాత్రమే ఇంకా తేదీ ఖరారు చేసుకోలేదు. కాగా దిల్లీ క్యాపిటల్స్‌ను కెప్టెన్సీ తలనొప్పి వేధిస్తోంది!

ముంబయి.. క్వారంటైన్‌ పూర్తి

ఐపీఎల్‌ కోసం అందరికన్నా ముందుగా దుబాయ్‌లో అడుగుపెట్టింది డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబయి ఇండియన్స్‌. ఆరు రోజుల క్వారంటైన్‌ పూర్తి చేసుకొని సాధన కూడా మొదలు పెట్టేసింది. యువ క్రికెటర్లైన రాహుల్‌ చాహర్‌, ఇషాన్‌ కిషన్‌, కొందరు విదేశీ క్రికెటర్లు మైదానంలో సందడి చేస్తున్నారు. ఈ చిత్రాలను ముంబయి సోషల్‌ మీడియాలో పంచుకొంది. రెండోదశలో తన తొలిమ్యాచులో రోహిత్‌సేన చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది. మూడు రోజుల క్రితమే యూఏఈ చేరుకున్న ధోనీసేన ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంది. ఆటగాళ్లు తమ గదుల్లో కసరత్తులు చేస్తున్న చిత్రాలను సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు.

అక్కడికి.. ఆగస్టు 31లోపే

మిగిలిన ఫ్రాంచైజీలు సైతం యూఏఈకి చేరుకొనేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నాయి. దిల్లీ క్యాపిటల్స్‌ 21న, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 31న అక్కడికి వెళ్తాయని తెలిసింది. గాయం నుంచి కోలుకున్న యువ పేసర్‌ టి.నటరాజన్‌ తమతోనే వస్తున్నాడని హైదరాబాద్‌ తెలిపింది. కోల్‌కతా 27, పంజాబ్‌ కింగ్స్‌ 29, రాజస్థాన్‌ రాయల్స్‌ సెప్టెంబర్‌ 2న బయల్దేరతాయి. నియమావళి ప్రకారం ఆరు రోజులు తప్పనిసరి క్వారంటైన్‌లో ఉంటాయి. బెంగళూరు మాత్రం ప్రయాణ తేదీని ప్రకటించలేదు. ఈ నెల 31లోపే వెళ్తుందని అంటున్నారు.

దిల్లీకి కెప్టెన్సీ తలనొప్పి

ఇక దిల్లీ క్యాపిటల్స్‌కు ‘కెప్టెన్సీ’ తలనొప్పి మొదలైంది. శ్రేయస్‌ అయ్యర్‌ గాయం నుంచి కోలుకోని తిరిగి రావడమే ఇందుకు కారణం. తొలి దశకు ముందు అతడు గాయంతో ఐపీఎల్‌కు దూరమయ్యాడు. దాంతో రిషభ్ పంత్‌ను యాజమాన్యం సారథిగా ప్రకటించింది. అతడు జట్టును విజయవంతంగా నడిపించాడు. ఇప్పుడు శ్రేయస్‌ రావడంతో ఏం చేయాలో ఫ్రాంచైజీకి పాలుపోవడం లేదు. ఏదేమైనా అతడు జట్టు మిడిలార్డర్‌లో కీలకంగా మారనున్నాడు. స్టీవ్‌స్మిత్‌ స్థానాన్ని భర్తీచేయనున్నాడు. జట్టు కన్నా పది రోజులు ముందుగానే తన చిన్ననాటి కోచ్‌, దిల్లీ కోచింగ్‌ బృంద సభ్యుడు ప్రవీణ్‌ ఆమ్రేతో అయ్యర్‌ దుబాయ్‌ చేరుకోవడం గమనార్హం. సాధన చేస్తున్న వీడియోను ఇప్పటికే అతడు పంచుకొన్నాడు. మున్ముందు ఏం జరుగుతుందన్నది ఆసక్తికరం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని