Tai Tzu Ying on PV Sindhu: పీవీ సింధు ఓదార్చిన తీరుకు కన్నీళ్లు ఆగలేదు!

తాజా వార్తలు

Updated : 02/08/2021 15:01 IST

Tai Tzu Ying on PV Sindhu: పీవీ సింధు ఓదార్చిన తీరుకు కన్నీళ్లు ఆగలేదు!

కృతజ్ఞతలు తెలియజేసిన తైజు యింగ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: పీవీ సింధు ఓదార్చిన తీరుకు తనకు కన్నీళ్లు ఆగలేదని తైజు యింగ్‌ తెలిపింది. రజతం గెలిచినందుకు సంతోషించాలో.. స్వర్ణం చేజారినందుకు బాధపడాలో తెలియని స్థితిలో ఆమె ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిదని పేర్కొంది. ఒలింపిక్స్‌ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలియజేసింది.

టోక్యో ఒలింపిక్స్‌ మహిళల బ్యాడ్మింటన్‌ పోటీలు రసవత్తరంగా సాగిన సంగతి తెలిసిందే. ఆదివారం చెన్‌ యూఫీ (చైనా)తో ఫైనల్లో తైజు యింగ్‌ 19-21, 21-19, 19-21తో పోరాడి ఓడింది. శనివారం ఆమె చేతిలోనే సెమీస్‌లో ఓటమి పాలైన పీవీ సింధు.. హి బింగ్జియావోను ఓడించి కాంస్యం సొంతం చేసుకుంది. గత ఒలింపిక్స్‌లో మారిన్‌ చేతిలో ఓడిన సింధు.. సరిగ్గా అదే పరిస్థితుల్లో ఉన్న తైజు యింగ్‌ను అక్కున చేర్చుకుంది. ఆమెతో మాట్లాడి బాధను పోగొట్టింది.

‘‘ఫైనల్‌ మ్యాచ్‌ ముగిశాక నా ప్రదర్శన పట్ల సంతృప్తిగానే అనిపించింది. ఆ తర్వాత సింధు పరుగెత్తుకుంటూ వచ్చి నన్ను కౌగిలించుకుంది. నా ముఖం పట్టుకొని ఇలా చెప్పింది. ‘నీకు అసౌకర్యంగా ఉంటుందని తెలుసు. నువ్వు చాలా బాగా ఆడావు. కానీ ఈరోజు నీది కాదు’ అని తెలిపింది. ఆ తర్వాత తన భుజాలపైకి తీసుకొని ఇలాంటి అవస్థ తనకు అనుభవమేనని పేర్కొంది’ అని తైజు తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.

‘సింధు నిజాయతీగా ఓదార్చిన తీరు నాకు కన్నీరు తెప్పించింది. నిజానికి నేను బాధపడ్డాను. ఎందుకంటే నేనెంతో కష్టపడ్డాను. సింధూ.. నీ మద్దతు, ప్రోత్సాహానికి మరోసారి కృతజ్ఞతలు. ఇక నా ప్రయాణంలో తోడుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు’ అని తైజు తెలిపింది.

‘మూడోసారి నేను కొన్ని కలలతో ఒలింపిక్స్‌లో అడుగుపెట్టాను. ఎట్టకేలకు ఫైనల్‌కు చేరుకున్నాను. కానీ పోడియంపై అత్యున్నత ఎత్తులో నిలబడలేదు. కచ్చితంగా ఎంతో కొంత బాధ ఉంటుంది. ఎందుకంటే ఎవరూ పరిపూర్ణం కాదు. ఇకపై మరింత మెరుగైన ఫలితాల కోసం కృషి చేస్తాను. మరోసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటానో లేదో తెలియదు. కానీ పతకం సాధించాను. నేను గొప్ప క్రీడాకారిణిని అని చెప్పుకున్నాను. ఫలితాలు ఎప్పుడైనా కఠినంగానే ఉంటాయి. వాటిని అంగీకరించాల్సిందే. ఏదేమైనా నేనైతే శక్తికి మించి కష్టపడ్డాను’ అని తైజు వెల్లడించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని