close
కళ్లన్నీ కుర్రాళ్లపై

దక్షిణాఫ్రికాతో భారత్‌ రెండో టీ20 నేడే
రాత్రి 7 గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో

ఒక్క బంతి పడకుండానే తొలి మ్యాచ్‌ తుడిచిపెట్టుకుపోగా.. పొట్టి సమరంలో మరో పోరాటానికి సిద్ధమయ్యాయి టీమ్‌ ఇండియా, దక్షిణాఫ్రికా. మొహాలీలో నేడే రెండో టీ20. దృష్టంతా భారత కుర్రాళ్లపైనే. ముఖ్యంగా నిలకడ లోపించిన రిషబ్‌ పంత్‌కు ఈ సిరీస్‌ పరీక్షే.

మొహాలి

ర్షం కారణంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ కాస్తా రెండు మ్యాచ్‌ల సిరీస్‌గా మారిపోయింది. సొంతగడ్డపై సత్తా చాటాలని తహతహలాడుతున్న భారత జట్టు బుధవారం జరిగే రెండో టీ20లో దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది. అందరి దృష్టీ అవకాశాలను అంతగా సద్వినియోగం చేసుకోలేకపోతున్న పంత్‌పైనే. టీ20 ప్రపంచకప్‌కప్‌కు ఇంకా ఏడాదిపైనే ఉన్నా.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇప్పటికే తన ప్రణాళికలను, కుర్రాళ్ల నుంచి ఏం ఆశిస్తున్నది వివరించాడు. తాను అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టినప్పుడు చాలా అవకాశాలను వస్తాయని అనుకోలేదని అన్నాడు. ఈతరం కుర్రాళ్లు కూడా తమకు లభించిన పరిమిత అవకాశాల్లో సత్తా చాటుకోవాలని చెప్పాడు. ఆ కుర్రాళ్లలో ఒకడు పంత్‌. నిర్లక్ష్యంగా ఆడుతున్నాడన్న విమర్శలు నేపథ్యంలో అతడికీ ఈ మ్యాచ్‌ పరీక్షే. సిరీస్‌లో ఒక్క బంతీ పడకున్నా చాలా పరిణామాలు అందరి కళ్లూ పంత్‌పైనే పడేలా చేశాయి. పదే పదే వికెట్‌ పారేసుకుంటే సహించమని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అతడికి స్పష్టం చేసింది.

ధావన్‌ చెలరేగుతాడా..: శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండేలకు కూడా ఈ సిరీస్‌ చాలా ముఖ్యమైందే. మిడిల్‌ ఆర్డర్‌లో వాళ్లు సత్తా చాటాలని జట్టు కోరుకుంటోంది. మరోవైపు వెస్టిండీస్‌లో విఫలమైన ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌కు తిరిగి ఫామ్‌ను అందుకోవడానికి ఈ సిరీస్‌ చక్కని అవకాశం. వెస్టిండీస్‌లో ఆడని ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఈ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు. ఇక ప్రధాన పేసర్లు బుమ్రా, షమి, భువనేశ్వర్‌ల గైర్హాజరీలో సైని, దీపక్‌ చాహర్‌, ఖలీల్‌ అహ్మద్‌ ఎలా రాణిస్తారన్నది ఆసక్తికరం.

వాన ముప్పు లేదు: మొహాలిలో బుధవారం వాతావరణం పొడిగా ఉంటుంది. వాన ముప్పు లేదు. ఇక్కడి పిచ్‌పై టీ20 మ్యాచ్‌లు సాధారణంగా పోటాపోటీగా జరుగుతాయి. 2019 ఐపీఎల్‌లో ఇక్కడ తొలి ఇన్నింగ్స్‌లో సగటున 171 పరుగులు నమోదయ్యాయి.

సఫారీలకు సవాల్‌

జోరుమీదున్న టీమ్‌ ఇండియాను అడ్డుకోవడం డికాక్‌ నేతృత్వంలోని దక్షిణాఫ్రికాకు కష్టమే. భారత బ్యాట్స్‌మెన్‌ను, ముఖ్యంగా విరాట్‌ కోహ్లీని కట్టడి చేయాలంటే కాగిసో రబాడ నేతృత్వంలోని బౌలింగ్‌ దళం గొప్పగా బౌలింగ్‌ చేయాల్సిందే. కోహ్లీకి, రబాడకు మధ్య మంచి పోటీ ఉంటుందని డికాక్‌ అన్నాడు. వాళ్లిద్దరూ మంచి ఆటగాళ్లని చెప్పాడు.

భయపడకుండా ఆడటమంటే 

‘‘భయపడకుండా ఆడటమంటే నిర్లక్ష్యంగా షాట్‌లు ఆడటం కాదు. ఈ రెండింటి మధ్య తేడాను కుర్రాళ్లు అర్థం చేసుకోవాలి. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ వారి నుంచి భయం లేని ఆటను కోరుకుంటోంది. ఆటగాళ్లు స్పష్టమైన ప్రణాళికతో, పట్టుదలగా పోరాడాలి. అదే సమయంలో నిర్లక్ష్యాన్ని వీడాలి’’ 

- టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌

28.83

టీ20 క్రికెట్లో దక్షిణాఫ్రికాపై కోహ్లి సగటు. ఒక్క ఐర్లాండ్‌ (రెండు ఇన్నింగ్స్‌ల్లో 4.50)పై మాత్రమే అతడికి ఇంతకన్నా తక్కువ సగటు ఉంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.