రైజర్స్‌ ఢమాల్‌
Array ( ) 1

ప్రధానాంశాలు

Updated : 25/10/2020 08:02 IST

రైజర్స్‌ ఢమాల్‌

గెలవాల్సిన మ్యాచ్‌లో బోల్తా
పంజాబ్‌కు అనూహ్య విజయం
దుబాయ్‌

లక్ష్యం 127 మాత్రమే. ఐపీఎల్‌లో ఈ మధ్య ఎక్కువగా రెండోసారి బ్యాటింగ్‌ చేస్తున్న జట్లే గెలుస్తున్న నేపథ్యంలో సన్‌రైజర్స్‌ కూడా పెద్ద కష్టం లేకుండానే గెలిచేస్తుందని, నెట్‌రన్‌రేట్‌ను కూడా పెంచుకుంటుందని అనుకున్నారు అభిమానులు. పైగా జట్టుకు మెరుపు ఆరంభం లభించింది. మధ్యలో కొంచెం తడబడ్డా మళ్లీ కుదురుకుని విజయం దిశగా సాగింది.   7 వికెట్లు చేతిలో ఉండగా 4 ఓవర్లలో 27 పరుగులు చేస్తే చాలు. కానీ ఇలాంటి స్థితి నుంచి కుప్పకూలిపోయింది సన్‌రైజర్స్‌. 3.5 ఓవర్లలో ఏడు వికెట్లూ చేజార్చుకుని 12 పరుగుల తేడాతో పరాభవాన్ని మూటగట్టుకున్న హైదరాబాద్‌.. ప్లేఆఫ్‌ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది. పంజాబ్‌ వరుసగా నాలుగో విజయంతో ప్లేఆఫ్‌ రేసులో మరింత ముందంజ వేసింది.
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు షాక్‌. మిడిలార్డర్‌ ఘోర వైఫల్యంతో ఆ జట్టు పంజాబ్‌తో మ్యాచ్‌లో అనూహ్య పరాజయం చవిచూసింది. 127 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 19.5 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (35; 20 బంతుల్లో 3×4, 2×6) మెరుపు ఆరంభాన్నివ్వడంతో ఛేదనలో 6 ఓవర్లకు 52/0తో నిలిచిన జట్టు.. ఇంకో 62 పరుగులకే 10 వికెట్లూ చేజార్చుకుని పరాజయం పాలవడం గమనార్హం. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జోర్డాన్‌ (3/17), అర్ష్‌దీప్‌ సింగ్‌ (3/23) సహా పంజాబ్‌ బౌలర్లందరూ చక్కటి ప్రదర్శన చేశారు. ఘోర పరాజయం తప్పదనుకున్న మ్యాచ్‌లో ఆశలు కోల్పోకుండా పోరాడి, పంజాబ్‌ మ్యాచ్‌ను చేజిక్కించుకున్న తీరు అద్భుతమే. మొదట పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 126 పరుగులే చేసింది. పూరన్‌ (32 నాటౌట్‌) టాప్‌స్కోరర్‌. రషీద్‌ ఖాన్‌ (2/14), సందీప్‌ శర్మ (2/29), హోల్డర్‌ (2/27) ఆ జట్టును కట్టడి చేశారు. రెండు జట్లూ తలో 11 మ్యాచ్‌లాడగా.. పంజాబ్‌కిది అయిదో విజయం, సన్‌రైజర్స్‌కు ఆరో ఓటమి.

మొదట వార్నర్‌.. తర్వాత పాండే: లక్ష్యం చిన్నది కావడంతో త్వరగా పని పూర్తి చేసి, నెట్‌రన్‌రేట్‌ పెంచుకోవాలనుకున్నాడో ఏమో.. ఛేదనలో వార్నర్‌ ధాటిగా ఆడి సన్‌రైజర్స్‌కు మెరుపు ఆరంభాన్నిచ్చాడు. పవర్‌ ప్లే లోపే స్కోరు 50 దాటిపోయింది. వికెట్‌ పడలేదు. కానీ ఏడో ఓవర్లో వార్నర్‌ను ఔట్‌ చేసిన బిష్ణోయ్‌ సన్‌రైజర్స్‌ జోరుకు బ్రేక్‌ వేశాడు. కాసేపటికే బెయిర్‌స్టో (19), సమద్‌ (7) వెనుదిరిగారు. దీంతో సన్‌రైజర్స్‌ 56/0 నుంచి 67/3కు చేరుకుంది. ఈ దశలో గత మ్యాచ్‌ హీరోలు మనీష్‌ పాండే (15), విజయ్‌ శంకర్‌ (26) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఓపిగ్గా ఆడుతూ పరుగులు జోడించారు. 16 ఓవర్లకు 100 పరుగుల మార్కును చేరుకున్న సన్‌రైజర్స్‌ సులువుగానే గెలిచేలా కనిపించింది. అయితే జోర్డాన్‌ వేసిన తర్వాతి ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించిన పాండే సబ్‌స్టిట్యూట్‌ సుచిత్‌ బౌండరీ లైన్‌ వద్ద పట్టిన మెరుపు క్యాచ్‌కు వెనుదిరగడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. తర్వాతి ఓవర్లో శంకర్‌ సైతం వెనుదిరిగాడు. లోయరార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ వచ్చిన వాళ్లు వచ్చినట్లే ఔటైపోవడంతో సన్‌రైజర్స్‌కు దారులు మూసుకుపోయాయి.

పంజాబ్‌ అతి కష్టంగా..: విధ్వంసక బ్యాట్స్‌మెన్‌కు నెలవైన పంజాబ్‌ మొదట పరుగులు చేయడానికి బాగా ఇబ్బంది పడింది. పది ఓవర్లు క్రీజులో ఉన్న రాహుల్‌ 27 బంతులే ఆడి 27 పరుగులే చేశాడు. పదో ఓవర్లో క్రీజులోకి వచ్చి చివరి దాకా నాటౌట్‌గా ఉన్న పూరన్‌ 28 బంతులాడి 32 పరుగులే చేయగలిగాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌ ఆ మాత్రం కూడా ఆడలేకపోయారు. సన్‌రైజర్స్‌ బౌలర్లు సమష్టిగా సత్తా చాటి ఆ జట్టుకు బ్రేకులేశారు.

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (బి) రషీద్‌ 27; మన్‌దీప్‌ (సి) రషీద్‌ (బి) సందీప్‌ 17; గేల్‌ (సి) వార్నర్‌ (బి) హోల్డర్‌ 20; పూరన్‌ నాటౌట్‌ 32; మ్యాక్స్‌వెల్‌ (సి) వార్నర్‌ (బి) సందీప్‌ 12; హుడా (స్టంప్డ్‌) బెయిర్‌స్టో (బి) రషీద్‌ 0; జోర్డాన్‌ (సి) ఖలీల్‌ (బి) హోల్డర్‌ 7; మురుగన్‌ అశ్విన్‌ రనౌట్‌ 4; రవి బిష్ణోయ్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 126; వికెట్ల పతనం: 1-37, 2-66, 3-66, 4-85, 5-88, 6-105, 7-110; బౌలింగ్‌: సందీప్‌ శర్మ 4-0-29-2; ఖలీల్‌ అహ్మద్‌ 4-0-31-0; హోల్డర్‌ 4-0-27-2; రషీద్‌ ఖాన్‌ 4-0-14-2; నటరాజన్‌ 4-0-23-0
సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) రాహుల్‌ (బి) బిష్ణోయ్‌ 35; బెయిర్‌స్టో (బి) మురుగన్‌ 19; పాండే (సి) సుచిత్‌ (బి) జోర్డాన్‌ 15; సమద్‌ (సి) జోర్డాన్‌ (బి) షమి 7; శంకర్‌ (సి) రాహుల్‌ (బి) అర్ష్‌దీప్‌ 26; హోల్డర్‌ (సి) మన్‌దీప్‌ (బి) జోర్డాన్‌ 5; గార్గ్‌ (సి) జోర్డాన్‌ (బి) అర్ష్‌దీప్‌ 3; రషీద్‌ (సి) పూరన్‌ (బి) జోర్డాన్‌ 0; సందీప్‌ (సి) మురుగన్‌ (బి) అర్ష్‌దీప్‌ 0; నటరాజన్‌ నాటౌట్‌ 0; ఖలీల్‌ రనౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం: (19.5 ఓవర్లలో ఆలౌట్‌) 114; వికెట్ల పతనం: 1-56, 2-58, 3-67, 4-100, 5-110, 6-112, 7-112, 8-114, 9-114; బౌలింగ్‌: షమి 4-0-34-1; ఆర్ష్‌దీప్‌ 3.5-0-23-3; మురుగన్‌ 4-0-27-1; బిష్ణోయ్‌ 4-0-13-1; జోర్డాన్‌ 4-0-17-3Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన