close

ప్రధానాంశాలు

Published : 04/03/2021 02:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రభుత్వ హామీ తీసుకున్నాకే..

దిల్లీ: ఈ ఏడాది ఐపీఎల్‌ ఆతిథ్య వేదికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని  బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఐపీఎల్‌ సమర్థ నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వాల నుంచి హామీ తీసుకున్న తర్వాతే వేదికల్ని నిర్ణయిస్తామని పేర్కొన్నాయి. ముంబయిలో కరోనా మహమ్మారి తీవ్రతను ఐపీఎల్‌ పాలక మండలి సునిశితంగా పర్యవేక్షిస్తుందని చెప్పాయి. ‘‘ఐపీఎల్‌ వేదికల్లో హైదరాబాద్‌, పంజాబ్‌ లేదంటూ వస్తున్న కథనాలన్నీ ఊహాగానాలే. ఈ ఏడాది ఐపీఎల్‌ కోసం ఏం చేయాలనే దానిపై త్వరలోనే ఐపీఎల్‌ పాలక మండలి సమావేశం అవుతుంది. ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి హామీ తీసుకున్న తర్వాతే మ్యాచ్‌ల  వేదికల్ని ఎంపిక చేస్తాం. ఎన్నికలున్నప్పుడు ఐపీఎల్‌ మ్యాచ్‌లకు రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వగలదా అని తెలుసుకుంటాం. పంజాబ్‌లో మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు అవాంఛనీయ సంఘటనలు జరగవని అధికారుల నుంచి బీసీసీఐకి గట్టి హామీ అవసరం’’ అని బీసీసీఐ అధికారి పేర్కొన్నాడు. ఈసారి ఐపీఎల్‌ను ఆరు వేదికల్లోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్లుగా కథనాలు వచ్చాయి. అందులో హైదరాబాద్‌ లేకపోవడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌, మొహాలీని మరిచిపోవడంపై పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ అభ్యంతరం తెలిపారు. మరోవైపు ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఉప్పల్‌ స్టేడియంలో నిర్వహించాలంటూ హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) విజ్ఞప్తి చేసింది. ఈమేరకు బీసీసీఐ కార్యవర్గానికి, ఐపీఎల్‌ ఛైర్మన్‌కు లేఖ రాయాలని హెచ్‌సీఏ నిర్ణయించింది. బుధవారం అజహరుద్దీన్‌ అధ్యక్షతన జరిగిన హెచ్‌సీఏ ఎపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన