close

ప్రధానాంశాలు

Published : 05/05/2021 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బీసీసీఐకి రూ.2200 కోట్లు నష్టం!

దిల్లీ

ఐపీఎల్‌ నిరవధిక వాయిదాతో బీసీసీఐ భారీగా నష్టపోనుంది. సుమారు రూ.2200 కోట్లు నష్టం వాటిల్లనున్నట్లు అంచనా. ‘‘ఐపీఎల్‌ను అర్ధంతరంగా వాయిదా వేయడంతో మేం రూ.2000 కోట్ల నుంచి రూ.2500 కోట్ల వరకు నష్టపోవచ్చు. సుమారు రూ.2200 కోట్లు నష్టపోతామని అనుకుంటున్నాం’’ అని బీసీసీఐ అధికారి తెలిపాడు. 52 రోజుల పాటు 60 మ్యాచ్‌లు జరగాల్సిన ఐపీఎల్‌ కరోనా మహమ్మారి కారణంగా మంగళవారం నిరవధికంగా వాయిదా పడింది. ఇప్పటి వరకు 24 రోజుల్లో 29 మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. ఐపీఎల్‌లో బోర్డుకు అత్యధికంగా ఆదాయం వచ్చేది ప్రసారదారు స్టార్‌ నుంచే. ఐదేళ్ల కాలానికి రూ.16,347 కోట్లకు బీసీసీఐతో స్టార్‌ ఒప్పందం కుదుర్చుకుంది. అంటే ఏడాదికి రూ.3269.40 కోట్లు. ఒక సీజన్‌లో 60 మ్యాచ్‌లు అనుకుంటే ఒక్కో పోరుకు సుమారు రూ.54.50 కోట్లు. మ్యాచ్‌ల ప్రకారం చెల్లించాలని స్టార్‌ భావిస్తే.. 29కి గాను రూ.1580 కోట్లు బోర్డుకు లభిస్తాయి. అంటే దాదాపుగా రూ.1690 కోట్లు నష్టమన్న మాట. టైటిల్‌ స్పాన్సర్‌ వివో నుంచి సీజన్‌కు రూ.440 కోట్లు బోర్డుకు రావాలి. ఈ ఆదాయం సగానికి సగం తగ్గే ప్రమాదముంది. మిగతా స్పాన్సర్లు అన్‌అకాడమీ, డ్రీమ్‌11, సీరెడ్‌, అప్‌స్టాక్స్‌, టాటా మోటార్స్‌ తలా రూ.120 కోట్లు చెల్లించాలి. ఈ ఆదాయంలో కూడా కోత పడనుంది. ‘‘బోర్డుకు వచ్చే ఆదాయం సగం లేదా అంతకంటే ఎక్కువే తగ్గినా రూ.2200 నష్టం తప్పదు. నష్టం ఇంకా ఎక్కువే ఉండొచ్చు’’ అని బోర్డు అధికారి వ్యాఖ్యానించాడు. ఆదాయం భారీగా తగ్గడంతో ఫ్రాంచైజీలు ఆటగాళ్లకు పూర్తి వేతనాలు ఇస్తాయా? అన్నది అనుమానమే. మ్యాచ్‌ల ప్రకారం ఇస్తారా? సగం సీజన్‌కు డబ్బులు చెల్లిస్తారా? అన్నది తేలలేదు. ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు కాబట్టి సగం సీజన్‌కు డబ్బులు ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఇక ఐపీఎల్‌ వాయిదా నిర్ణయానికి స్పాన్సర్లు కూడా మద్దతు తెలుపుతున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన