close
కేంద్ర బడ్జెట్‌ తప్పుల తడక 

ఆర్థిక సర్వేకు, బడ్జెట్‌ లెక్కలకు పొంతనే లేదు 
కేరళ ఆర్థిక మంత్రి థామస్‌ ఐజాక్‌ 
ఏఐబీకేఎస్‌ మహాసభలు ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే, బడ్జెట్‌ లెక్కలకు పొంతన లేదు. ఈ రెండింటిని పోల్చి చూస్తే గతేడాది రూ.లక్ష కోట్ల ఆదాయం తగ్గింది. ఈ తగ్గుదల నిజమే అయితే బడ్జెట్‌ లెక్కలన్నీ తప్పులతడకలే. ఇది నిజమా, కాదా అనేది కేంద్ర ఆర్థిక మంత్రి తక్షణం స్పష్టత ఇవ్వాలి’’ అని కేరళ ఆర్థిక మంత్రి థామస్‌ ఐజాక్‌ డిమాండ్‌ చేశారు. అఖిల భారత కిసాన్‌సభ(ఏఐబీకేఎస్‌) జాతీయ మహాసభలు గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. తొలిరోజు ‘వ్యవసాయ సంక్షోభంలో రైతు సహకార సంఘాల పటిష్ఠత’ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కిసాన్‌సభ ప్రధాన కార్యదర్శి హన్నన్‌మొల్లా, ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, ఏఐఏడబ్ల్యుయూ అధ్యక్ష, కార్యదర్శులు తిరునవక్కరసు, విజయరాఘవన్‌, ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ వెంకటేశ్‌ ఆత్రేయ, విజుకృష్ణన్‌ తదితరులు పాల్గొన్నారు. థామస్‌ ఐజాక్‌ మాట్లాడుతూ ‘‘ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో వాణిజ్యపరమైన షరతులు వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తున్నాయి. యూపీఏ-2, ఎన్డీఏ ప్రభుత్వాలు పంటల మద్దతు ధరలను స్వల్పంగా పెంచాయి. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల ప్రకారం పంట సాగువ్యయానికి అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధర కేంద్రం ఇవ్వడం లేదు. ద్రవ్యోల్బణాన్ని, ఆహారోత్పత్తుల ధరలను అదుపులో ఉంచడానికి మద్దతు ధరలను పెంచడం లేదు. పంటల ధరలు, ఉత్పాదకత పెరగకుండా రైతులకు ఆదాయం ఎలా పెరుగుతుంది ? వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. సమాజంలో కొన్ని మార్పులు రావాలన్నా, రైతులకు సౌకర్యాలు కల్పించాలన్నా సహకార సంఘాలు అవసరం’’ అని అన్నారు. కిసాన్‌సభ జాతీయ అధ్యక్షుడు అశోక్‌ దావలే మాట్లాడుతూ.. మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక రైతులకు సమస్యలు ఎక్కువయ్యాయని, వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. 
సీబీఐ దాడులను ఖండిస్తూ తీర్మానం 
సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు ఇందిరా జైసింగ్‌, ఆనంద్‌ గ్రోవర్‌ కార్యాలయాలపై గురువారం సీబీఐ అధికారులు చేసిన దాడులను కిసాన్‌సభ తీవ్రంగా ఖండించింది. ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే ఏకైక లక్ష్యంతో భాజపా చేస్తున్న అప్రజాస్వామిక విధానాల్లో భాగంగా ఈ దాడులు జరిగాయని అభిప్రాయపడింది. ఈ దాడులను ఖండిస్తూ అశోక్‌దావలే ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.