‘రెగ్యులర్‌, ఒప్పంద వైద్యులందరికీ 30 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలి’
close

ప్రధానాంశాలు

‘రెగ్యులర్‌, ఒప్పంద వైద్యులందరికీ 30 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలి’

సుల్తాన్‌బజార్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర వైద్యారోగ్య శాఖలోని ఆయా విభాగాల్లో రెగ్యులర్‌, ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న వైద్యులందరికీ ప్రభుత్వం ప్రకటించిన 30 శాతం ఫిట్‌మెంట్‌ను వర్తింపజేయాలని తెలంగాణ ప్రజారోగ్య వైద్యుల సంఘం(టీపీహెచ్‌డీఏ), కాంట్రాక్టు వైద్యుల సంఘాలు డిమాండ్‌ చేశాయి. మంగళవారమిక్కడ రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ వాకాటి కరుణ, వైద్యారోగ్య సంచాలకులు డా.జి.శ్రీనివాసరావులను ఆయా సంఘాల ప్రతినిధులు కలిసి ఈ మేరకు వినతిపత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా టీపీహెచ్‌డీఏ అధ్యక్షుడు డా.కత్తి జనార్దన్‌తోపాటు ఆయా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. వైద్యారోగ్య శాఖలో 2018 తర్వాత నియమితులై.. డీహెచ్‌, వీవీపీ, ఈఎస్‌ఐ, ఎన్‌హెచ్‌ఎం తదితర విభాగాల్లో పని చేస్తున్న రెగ్యులర్‌, ఒప్పంద వైద్యులకు ప్రభుత్వం ప్రకటించిన పీఆర్‌సీ అమలుచేయకపోవడం విచారకరమని, ఇది తమను అవమానించడమే అవుతుందని పేర్కొన్నారు. ప్రాణాలు పణంగా పెట్టి గత 16 నెలలుగా కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు సేవలందిస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్‌పై నమ్మకం ఉందని, వెంటనే తమ సేవలను గుర్తించి అందరికీ 30 శాతం ఫిట్‌మెంట్‌ వర్తింపజేసే విధంగా జీవో విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కరోనా బారిన పడి మృతి చెందిన వైద్యుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. ప్రత్యేక పారితోషికంతోపాటు రిస్క్‌ అలవెన్స్‌ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి డా.ఎ.పూర్ణచందర్‌, ఉపాధ్యక్షులు డా.రాంబాబు, డా.సుజాత, కార్యదర్శి డా.ఆర్‌.ప్రవీణ్‌, డా.కిరణ్‌, డా.అభిరాం తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని