తెలంగాణ విశ్వవిద్యాలయంలో అక్రమ నియామకాల రద్దు

ప్రధానాంశాలు

తెలంగాణ విశ్వవిద్యాలయంలో అక్రమ నియామకాల రద్దు

ఈనాడు కథనాలకు స్పందన

ఈనాడు, నిజామాబాద్‌: తెలంగాణ విశ్వవిద్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నియామకాలను రద్దు చేయాలని కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ ఆదేశించారు. ఎవరైనా విధులు నిర్వర్తించి ఉంటే అధికారులు సొంతంగా వేతనాలు చెల్లించాలన్నారు. వర్సిటీలో గత నెలలో పొరుగు సేవల కింద ఉద్యోగాలు భర్తీ చేశారు. రాష్ట్రప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ వందల సంఖ్యలో నియామకాలు జరిగినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ అంశంపై నిజామాబాద్‌ సంచికలో ‘ఈనాడు’ ఆధారాలతో వరుస కథనాలు ప్రచురించింది. దీంతో విద్యాశాఖ స్పందించి విచారణ నిమిత్తం ఈ నెల 9న ఓ కమిటీని విశ్వవిద్యాలయానికి పంపించింది. వివాదాలపై చర్చించేందుకు నవీన్‌మిత్తల్‌ అధ్యక్షతన హైదరాబాద్‌లోని రూసా భవనంలో శుక్రవారం ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. నియామకాలపై పత్రికలో వచ్చిన కథనాల నకళ్లను కమిటీ సభ్యులు నవీన్‌ మిత్తల్‌కు అందించారు. ఓ ఆచార్యుడితో కలిసి సభ్యులు కుట్ర చేస్తున్నారంటూ వీసీ విలేకరుల సమావేశంలో ప్రస్తావించిన వీడియోలను చూపించారు. వీసీ బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు పట్టుపట్టారు. దీంతో మిత్తల్‌ స్పందిస్తూ.. వర్సిటీలో ఎలాంటి నియామకాలకు అవకాశం లేదని, ఉద్యోగాలు రద్దు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఆర్థికశాఖ తరఫున హాజరైన అధికారిణి చంద్రకళ మాట్లాడుతూ.. అక్రమంగా నియమితులైన వారికి వర్సిటీ నిధుల నుంచి వేతనాలు చెల్లించడానికి వీల్లేదన్నారు. మరోవైపు వర్సిటీ అధికారులు ఎజెండా పత్రాలను సభ్యులకు ఆలస్యంగా అందించడంపై నవీన్‌మిత్తల్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంశాలను క్షుణ్నంగా చదివి అవగాహన చేసుకొనేందుకు వీలుగా సమావేశాన్ని ఈ నెల 30కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని