Covid: కరోనా వ్యాప్తికి తాళం
close

ప్రధానాంశాలు

Covid: కరోనా వ్యాప్తికి తాళం

వైరస్‌కు ఉచ్చుపన్నే నానో డికాయ్‌లు
అమెరికా శాస్త్రవేత్తల పరిశోధన

వాషింగ్టన్‌: మానవ శరీరంలోని వ్యవస్థలను తెలివిగా ఉపయోగించుకుంటూ ఇన్‌ఫెక్షన్‌ను వ్యాప్తిచేస్తున్న కరోనా వైరస్‌కు అంతే యుక్తిగా చెక్‌ పెట్టేందుకు శాస్త్రవేత్తలు అద్భుత విధానాన్ని అభివృద్ధి చేశారు. ఈ వైరస్‌ను బోల్తా కొట్టించే నానో డికాయ్‌లను సిద్ధం చేశారు. కరోనాలో కొత్తగా వస్తున్న రకాలపైనా ఇవి సమర్థంగా పనిచేస్తాయని వారు చెప్పారు. మానవ కణాలపై యాంజియోటెన్సిన్‌-కన్వర్టింగ్‌ ఎంజైమ్‌-2 (ఏసీఈ-2) అనే గ్రాహకం ఉంటుంది. దీనితో.. కరోనా వైరస్‌లోని ముల్లులాంటి స్పైక్‌ ప్రొటీన్‌ అనుసంధానమైనప్పుడు మానవ కణంలోకి వైరస్‌ ప్రవేశిస్తుంది. ఈ ప్రక్రియను ఏమార్చి వైరస్‌ను బోల్తా కొట్టించడానికి అమెరికాలోని ఉత్తర కరోలైనా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మానవ ఊపిరితిత్తుల స్పెరాయిడ్‌ కణాల (ఎల్‌ఎస్‌సీ)ను ఉపయోగించుకున్నారు. ఊపిరితిత్తుల్లోని ఎపిథీలియల్‌ మూలకణాలు, మెసెంకైమల్‌ కణాల మిశ్రమంతో ఇవి తయారయ్యాయి. ఈ కణాల సాయంతో నానో డికాయ్‌లను అభివృద్ధి చేశారు. వీటిలోనూ ఏసీఈ-2 గ్రాహకాలు ఉంటాయి. ఒక్క ఎల్‌ఎస్‌సీ కణం ద్వారా 11వేల నానోడికాయ్‌లను ఉత్పత్తి చేయవచ్చు. వీటిని పెద్ద సంఖ్యలో ప్రయోగించడం ద్వారా వైరస్‌ను శాస్త్రవేత్తలు దారి మళ్లించారు. ‘‘ఏసీఈ-2 గ్రాహకాన్ని తాళం కప్పగా, స్పైక్‌ ప్రొటీన్‌ను తాళం చెవిగా భావిస్తే.. ఈ నానో డికాయ్‌లు నకిలీ తాళం కప్ప పాత్రను పోషిస్తాయి. అవి పెద్ద సంఖ్యలో వైరస్‌లను ముంచెత్తడం ద్వారా ఊపిరితిత్తుల కణాల్లోకి ప్రవేశించడానికి అనువైన, అసలుసిసలైన ఏసీఈ-2 గ్రాహకాలను గుర్తించలేని స్థాయికి వైరస్‌ను చేరుస్తాయి. అనంతరం ఈ నకిలీ ‘తాళం కప్ప’లు.. ఉచ్చుల్లా పనిచేస్తూ వైరస్‌ను ఒడిసిపడతాయి. తద్వారా వైరస్‌ మన కణాల్లో ప్రవేశించకుండా నివారిస్తాయి. ఈలోగా మన రోగ నిరోధక వ్యవస్థ క్రియాశీలమై, వైరస్‌ భరతం పడుతుంది’’ అని శాస్త్రవేత్తలు తెలిపారు. కోతులు, ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో ఈ నానో డికాయ్‌లు వేగంగా వైరస్‌ను నిర్మూలించాయని, ఫలితంగా ఊపిరితిత్తులకు పెద్దగా గాయం కాలేదని, ఆ అవయవంలో ఇన్‌ఫ్లమేషన్‌, ఫైబ్రోసిస్‌ తగ్గిందని తేలింది. ఎలుకల ఊపిరితిత్తుల్లో ఈ డికాయ్‌లు 72 గంటల వరకూ మనుగడ సాగించాయని వెల్లడైంది. ముక్కు ద్వారా కూడా వీటిని ఇవ్వవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. మానవుల్లో వీటిని ప్రయోగించడానికి ముందు కొన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని