close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అనగనగా ఓసలహా...

- బాడిశ హన్మంతరావు

పెళ్లి హడావుడి తగ్గింది. అందరూ వెళ్లిపోయారు. ముత్యాలరావుకి అల్లుడు రాంబాబు బాగా నచ్చాడు. ఏ దురలవాట్లూ లేకపోవడం కూడా ఓ కారణం.

మధ్యవర్తి ఈ సంబంధం గురించి చెప్పినప్పుడు ముత్యాలరావు, రాంబాబు వాళ్ల ఊరికి వచ్చాడు. అన్ని వివరాలూ సేకరించాడు. వ్యవసాయదారుల కుటుంబం. ముగ్గురు అన్నదమ్ములు. ముగ్గురిలో ఒకరు ఉద్యోగి. రాంబాబుతో పాటు ఇంకొకతను వ్యవసాయం చేస్తాడు. అలా అని చదువు అబ్బక వ్యవసాయంలోకి రాలేదు. ఆ ఇద్దరిదీ గ్రాడ్యుయేషన్‌ అయిపోయింది. ఇద్దరికీ వ్యవసాయం మీద మక్కువ. పైగా విద్యావంతులు వ్యవసాయం చేస్తే ఎలా లాభసాటిగా ఉంటుందో ఊరికి కూడా చూపించారు. ఈ వివరాలన్నీ ముత్యాలరావుకి నచ్చాయి. రాంబాబులో తననే చూసుకున్నట్టనిపించింది. ఎందుకంటే అచ్చం ముత్యాలరావు కుటుంబం కూడా అంతే!

ముత్యాలరావు తరువాత ఇద్దరు అన్నదమ్ములు. పెద్ద తమ్ముడికి గవర్నమెంట్‌ జాబ్‌. మిగిలిన ఇద్దరూ స్వగ్రామంలోనే ఉంటూ, వ్యవసాయం చేస్తున్నారు. పెద్దోడికి ఒక కొడుకూ, ఒక కూతురు. ఉద్యోగరీత్యా బెంగళూరులో స్థిరపడ్డాడు. చిన్నోడికి ఇద్దరు కొడుకులు. ముత్యాలరావుకి ఒక్కతే కూతురు పేరు రమణి. కనుముక్కు తీరు బాగానే ఉంటుంది. తనదీ గ్రాడ్యుయేషన్‌ అయిపోయింది. గవర్నమెంట్‌ జాబ్స్‌కి ప్రయత్నాలు చేస్తోంది. అన్నదమ్ములు ముగ్గురూ కలివిడిగా, బాగానే ఉంటారు.

తన ఆర్థిక స్థితిని కూడా సంబంధాల సమయంలో దృష్టిలో ఉంచుకున్న ముత్యాలరావుకి ఈ సంబంధం అన్ని విధాలా సరిపోతుందనిపించింది.

ముత్యాలరావుకీ, రాంబాబు కుటుంబానికీ ఆర్థికంగా పెద్దగా వ్యత్యాసం లేదు కానీ... ముత్యాలరావుతో పాటూ అతని అన్నదమ్ములూ విద్యావంతులు కావడం, రాంబాబు తల్లిదండ్రులు నిరక్షరాస్యులు కావడంతో వాళ్ల వేషభాషల్లో వ్యత్యాసం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. పైగా ముత్యాలరావు తన ఊరిలో పెద్దమనిషి తరహా పేరు ఉన్నవాడు కావడం, దుస్తుల కట్టు తీరుతో స్థితిమంతుడిగా కనిపిస్తాడు.

పెళ్లి తరువాత సరిగ్గా మార్గదర్శనం చేయగలిగితే అల్లుడిని వృద్దిలోకి తేవచ్చులే అనుకున్నాడు. ఉన్నంతలో పెళ్లి బాగానే జరిగింది.

*    *    *

పెళ్లయి పది రోజులయింది. దంపతులు ఈ పది రోజులూ చుట్టాలందరి ఇళ్ళకీ¨ వెళ్లి వచ్చారు. ఇక రమణిని రేపో, ఎల్లుండో అత్తగారింటికి పంపాలి. ముత్యాలరావు ఇంటికి ప్రతిరోజూ ఎవరో ఒకరు సలహా సంప్రదింపుల కోసం రావడం రాంబాబుకి మంచి విషయంలా అనిపించింది. తెలియకుండానే మామగారి పట్ల గౌరవ మర్యాదలు ఏర్పడ్డాయి.

మామా అల్లుళ్ల మధ్య కూడా మంచి చనువు ఏర్పడింది... ముత్యాలరావుకి రాంబాబుని చూస్తే కల్లాకపటం లేనివాడిలా కనిపించడంతో ఇంకా ప్రేమ కలిగింది. రాంబాబుతో ఏదో చెప్పాలని ఉంది ముత్యాలరావుకి.

తన కుటుంబం, రాంబాబు కుటుంబం దాదాపు ఒకే విధం. ముత్యాలరావు ఆలోచనలో పడ్డాడు. తనకు జరిగినట్లే ఇతనికీ జరిగితే??... ఆ ఆలోచనల నీడ అయిదేళ్ల వెనుకకు పాకింది.

*    *    *

ముత్యాలరావు తండ్రి కాస్తో కూస్తో చదువుకున్నవాడు కావడంతో తన ముగ్గురు కొడుకులనీ బాగానే చదివించాడు. ముగ్గురిలోకి నడిపోడికి కాస్త ఎక్కువ చదువు అబ్బి సెంట్రల్‌ గవర్నమెంట్‌ జాబ్‌ కూడా వచ్చింది. మిగిలిన ఇద్దరూ వ్యవసాయం మీదే ఆధారపడ్డారు. అన్నదమ్ముల మధ్య మంచి అనుబంధమే ఉంది.

పెద్దవాడు కావడంతో ఇద్దరు తమ్ముళ్లూ ప్రతీదానికీ ముత్యాలరావుని సంప్రదించేవారు. వయసులో తేడాకూడా ఎక్కువ. పైగా చిన్నతనం నుండే చదువుతో పాటూ పొలం పనులు చేస్తూ ఉండటం, చదువుకున్నవాడు కావడంతో చుట్టుపక్కల రైతులకు సమయానుకూలంగా సలహాలు ఇస్తూ ఉండటం, వాళ్లూ అవసరమైనప్పుడు సంప్రదించడం లాంటి వాటితో, కాస్త పెద్దరికం వచ్చింది.

చూస్తుండగానే ఒకరి వెంట ఒకరికి పెళ్లిళ్లూ అయిపోయాయి. ఉద్యోగరీత్యా నడిపోడు బెంగుళూరులో స్థిరపడిపోయాడు. మిగిలిన ఇద్దరు అన్నదమ్ములూ ఇదే ఊరులో ఉండిపోయారు.

వాళ్ల కుటుంబానికి ఆరెకరాల పొలం ఉంది. ‘తనకి ఉద్యోగం ఉంది కదా’ అనిచెప్పి నడిపోడు తనవాటా కూడా సోదరులకు ఉదారంగా ఇచ్చేశాడు. వాళ్ల వాటాకి వచ్చిన రెండు ఎకరాలకు తోడు సోదరుని రెండెకరాలను వీళ్లు చెరో ఎకరం చేసుకుంటున్నారు. రాతకోతలు లేవుగానీ... హక్కుభుక్తంలో ఉంది.

*    *    *

ఉన్నట్టుండి ఏమైందో ఏమో? పొలంలో తన వాటా తనకు ఇమ్మని నడిపోడు అన్నని అడిగాడు. ముత్యాలరావుకి అర్థం కాలేదు.

‘‘ఇన్నాళ్లూ లేనిది... ఇప్పుడే ఎందుకలా?’’ అడిగాడు తమ్ముడ్ని.

‘‘లేదులే అన్నా... నాది నాకు ఇవ్వండి. ఎలాగూ నీకూ కొడుకులు లేరు. నువ్వు మాత్రం ఏం చేసుకుంటావు?’’

‘‘కొడుకులు లేకపోవడానికీ దీనికీ ఏం సంబంధం? అప్పుడు కూడా మేం కావాలని అడగలేదు కదా? ఇప్పుడెలా కుదురుతుంది?’’ అంటున్నాడు కానీ...

తమ్ముడు అడిగిన తీరు ముత్యాలరావుని ఇబ్బందిపెడుతోంది.

‘ఇన్నాళ్లనుండీ తనది అనుకున్నది తనది కాకుండా పోతుంది?’ అనుకుంటే లోపల ఎక్కడో గుచ్చుకున్నట్టు అనిపిస్తోంది.

అక్కడే ఉన్న చిన్న తమ్ముడు కూడా మౌనంగా ఉండటం ఇంకా ఇదిగా ఉంది. పుట్టిన దగ్గర్నుండి ఒకటిగా ఉన్న అన్నదమ్ముల మధ్య ఈ సందర్భం కాస్త అలజడిని రేపింది. కొద్ది రోజులకే... ఊరి పెద్దల ముందుకు ఈ చర్చ వెళ్లింది.

ముత్యాలరావు ఆలోచించాడు. పెద్దలముందు తన మాట చెప్పాడు.

‘‘మాది ఆరెకరాల పొలం. మా ముగ్గురన్నదమ్ములకీ తలా రెండెకరాలు. కాబట్టి నడిపోడి వాటా వాడిదే. దీంట్లో పంచాయితీ ఏం ఉంది?’’

నిజమే అన్నట్లు పెద్దమనుషులు తలలూపారు.

ఇంతలో నడిపోడు మరో మాట అన్నాడు. అది ముత్యాలరావుకి మరీ లోతుగా దిగింది. ‘‘మరి ఇన్నేళ్లుగా చేసుకుంటున్నావుగా... దానికేమీ లేదా? కౌలుకిచ్చినా ఎంతో కొంత వచ్చేదిగా?’’

ప్రాణం చివుక్కుమంది ముత్యాలరావుకి. పాతికేళ్లకు కౌలు కడితే... చాలా అవుతుంది.

ఇంతలో పెద్దమనుషులు కలగచేసుకున్నారు.

‘‘మీరు అప్పట్లోనే రాతకోతలు చేసుకుంటే... ఏ గొడవా లేకపోయేది. అదిలేదు కాబట్టి ఇప్పుడు నడిపోడికి ఈ ఆలోచన పుట్టుకొచ్చింది. ఆలోచన అనే విత్తనం పడ్డాక చేసేది ఏంలేదు? ఇక కౌలు విషయం... ధాన్యం అప్పటి రేట్లకూ ఇప్పటి రేట్లకూ పొంతన లేదు. ముత్యాలు ఏమైనా ఇస్తే తీసుకో లేకపోతే లేదు...’’

ముత్యాలరావుకి అన్ను పట్టినయింది.

‘నిజమే! ఆలోచన విత్తనం పడితే శాఖోపశాఖలుగా విస్తరించి మనసును చుట్టుముడుతుంది. ఆ చెట్టును మొదలంటా తొలగించడం అసంభవం’ అనుకున్నాడు. అయినా ఆమాటతో పాటే మరో ఆలోచనా వచ్చింది.

‘‘నిజమే! వాడిదే వాటా కాబట్టి కౌలు ఇవ్వాలి. కానీ పొలం ఉదారంగా ఇచ్చాడు గదా అన్న ఆలోచనతో... తమ్ముడూ వాళ్ల కుటుంబంతో ఎప్పుడు వచ్చినా పెట్టుపోతలు బాగా చేశాడు. వాళ్లు ఉన్నన్ని రోజులూ తన దగ్గరే ఉండేవాళ్లు. వాళ్లకు ఇబ్బంది కలగకుండా... తన స్థాయికి మించినా... ఖర్చు పెట్టాడు. అదీ తక్కువేం కాలేదు. నడిపోడు కూడా ‘అన్నా... ఇబ్బంది పడకు... నేను ఇస్తా’ అన్నా తనే ‘వద్దనే’వాడు.’’

అదే మాట పైకి అన్నాడు. దీనికి ప్రతిస్పందనగా ‘‘పండగకి వచ్చి పోయినందుకు కూడా లెక్కలు గట్టావా?’’ అన్నాడు.

చివుక్కుమంది ముత్యాలరావుకి. ఛీ... అనుకున్నాడు.

‘‘సరేలే... రెండు ఎకరాలకి అప్పటి లెక్కప్రకారం... ఇప్పటి లెక్కప్రకారం... చూసుకొని లెక్క గట్టండి. చిన్నోడూ, నేనూ చెరో సగం ఇస్తాం’’ అన్నాడు.

‘‘వాడి సంగతి వదిలిపెట్టు... తర్వాత మేం మేం చూసుకుంటాం. నీ సాలుబడిలో ఉన్న ఎకరానికి లెక్క గట్టు చాలు’’ నడిపోడు అన్నాడు. చురుక్కు మంది ముత్యాలరావుకి.

చిన్నోడి వైపు చూశాడు. తల దించుకుని నేల చూపులు చూస్తున్నాడు.

చివరికి లెక్కలు తేలాయి. అక్కడా... ఇక్కడా తెచ్చి తమ్ముడి చేతిలో పెట్టాడు.

ఇచ్చిన సొమ్ములో నడిపోడు, కొంత రమణి చేతిలో పెట్టి, మిగిలినది తీసుకొని జేబులో వేసుకున్నాడు. తన వాటా మొత్తాన్ని చిన్నోడికి ఇచ్చి, ఈసారి రాతకోతలు పూర్తి చేయించి మరీ వెళ్లిపోయాడు.

తమ్ముళ్లిద్దరూ ఒకటైనట్టూ... తనొక్కడూ ఒకటైనట్టూ... తోచింది. ఈ తతంగం మొత్తంలో తల్లి ఎక్కడా ఒక్క మాటకూడా మాట్లాడకపోవడం మరీ బాధించింది ముత్యాలరావుని.

తన జీవితంలో జరిగిన విషయాలన్నీ అల్లుడికి చెప్పాలి. వీలయితే జాగ్రత్తగా ఉండమని చెప్పాలనుకున్నాడు. సమయం కోసం చూస్తున్నాడు.

అది... మరుసటి రోజే వచ్చింది...

*    *    *

రాత్రి ఎనిమిది కావస్తోంది. చల్లటి గాలి వీస్తోంది.

కింద వంటగదిలో రాత్రి భోజన ఏర్పాట్లు నడుస్తున్నట్లు చప్పుడు వినపడుతోంది.

మామా అల్లుళ్లు... డాబా మీద కూర్చున్నారు.

ప్లాట్ల పేరుతో తగ్గుతున్న వ్యవసాయ పొలాలు, పెరుగుతున్న వాటి రేట్లు...

తగ్గుతున్న దిగుబడులు... పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులు... అన్నింటి మీదుగా కబుర్లు నడుస్తున్నాయి. సందర్భం చూసుకొని ముత్యాలరావు అన్నాడు.

‘‘రాంబాబూ... వ్యవసాయం ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. బాగా చదువుకున్నావు. ఏదైనా ఉద్యోగం గురించి ఆలోచించరాదూ!’’

రాంబాబు చురుగ్గా చూశాడు. పెళ్లిమాటల సందర్భంలో కూడా తనకు వ్యవసాయం అంటే ఎంతిష్టమో చెప్పే ఉన్నాడు. మళ్లీ ఇప్పుడేంటిలా...

‘‘ఇప్పుడు ఉద్యోగాలు మాత్రం ఎక్కడున్నాయి మామయ్యా? ఒక్కో నోటిఫికేషన్‌ వచ్చి పూర్తయ్యేసరికి ఏళ్ళూ, పూళ్ళూ గడుస్తున్నాయి. పైగా ఎక్కడికో వెళ్ళి ఉద్యోగం చేసే ఉద్దేశం నాకులేదు’’ అన్నాడు.

‘‘మరి మా అమ్మాయి ఉద్యోగం చేయాలనే ఆలోచనతో ఉంది కదా?’’

‘‘ఆ మాట ముందే నాతో అనాల్సింది... అలా అని ఆడపిల్లలు ఉద్యోగాలు చేయకూడదనే గుణం నాలో లేదు. అయినా ఊరులో ఉంటూ చుట్టుపక్కల చేయగలిగే ఉద్యోగాలు వస్తే నాకూ అభ్యంతరం ఏమీ లేదు! కానీ ఇద్దరమూ ఉన్న ఊరు వదిలిపెట్టడమైతే నాకు ఇబ్బందే!’’

‘‘ఊరిలో ఏముంటుంది అల్లుడూ? ఇదే జీవితం ఎదుగూ బొదుగూ లేకుండా! నేనూ చేస్తున్నానుగా నలభై ఏళ్లనుండి... ఏం ఒరిగింది?’’ ఇటుక మీద ఇటుక పేర్చినట్టు మాట పేర్చాడు.

‘‘కొత్తగా ఏం సంపాదించాలి మామయ్యా? ఉన్నది పోగొట్టకుండా ఉంటే చాలు... మాకున్న ఎకరాన్ని అయిదు ఎకరాలు చేసుకున్నాం చాలదూ? మరీ ఖర్చులకు ఇబ్బంది అయితేకాదు. మా అమ్మానాన్నతో పాటు ఇలా హాయిగా ఉండటం కంటే ఏంకావాలి? మా తమ్ముడికీ ఇష్టం ఉండదు. ఉద్యోగాలకంటే ఇలాగే ఎక్కువ సంపాదించొచ్చు అంటాడు వాడినడిగితే?’’ నవ్వాడు రాంబాబు.

తమ్ముళ్ల గురించి చెప్పేటప్పుడు రాంబాబు ముఖంలో మెరుపు ముత్యాలరావు దృష్టిని దాటిపోలేదు. ‘అప్పట్లో తనూ అలాగే ఉండేవాడు.’

కొద్దిసేపు ఇద్దరి మధ్యనా నిశ్శబ్దం. ముత్యాలరావు నోరు తెరిచాడు.

‘‘అల్లుడూ... పెళ్లయిన తరువాత భర్తకు భార్యా... భార్యకు భర్తా మాత్రమే శాశ్వతం. మిగిలినవారందరు తాత్కాలికం. మేము కూడా ముగ్గురు అన్నదమ్ములం. పెళ్లిలో చూశావుకదా. చాలా బాగా ఉండేవాళ్లం’’ కొనసాగించాడు.

‘‘నేను ఊహ తెలిసినప్పటి నుండీ వ్యవసాయం చేస్తున్నా. నా చాకిరీ వల్లనే ఉన్న రెండెకరాలు కాస్తా ఆరెకరాలు అయింది. తమ్ముళ్లు కూడా చెయ్యేశారు కానీ... మొత్తం కష్టం నాదే!’’

రాంబాబుకి ముత్యాలరావు ఏం చెప్పబోతున్నాడో అర్థం కాలేదు. చెప్పమన్నట్లు అతని మొహంవైపు చూశాడు.

‘‘నా ఇంటర్‌ అయ్యేటప్పటికి మా నాన్న చనిపోయాడు. చదువు ఆపేశాను. ఆ తరువాత వాళ్లు చదువుతామన్నదాక చదివించాను... అందుకు అయ్యే ఖర్చు కూడా నా కష్టమే. మా నడిపోడికి గవర్నమెంట్‌ జాబు కూడా వచ్చింది...’’ అంటూ జరిగినదంతా చెప్పాడు.

‘‘ఒకే కడుపున పుట్టినా... తమ్ముడు కూడా పరాయివాడే అని అనుభవం తెలియచేసింది. నీకు అటువంటి పరిస్థితి రావద్దని ముందే చెపుతున్నా. కాలం బాగాలేదు. అందరూ పక్కవాడిని ఎలా మోసం చేద్దామా అని కాచుక్కూర్చున్నారు. జాగ్రత్తగా లేకపోతే మనల్నే ముంచేస్తారు.’’

రాంబాబు ఆలోచనలో పడటం చూసి...

‘‘ఇందుకు తల్లిదండ్రులు కూడా మినహాయింపు కాదు రాంబాబూ. మా మధ్య అంత గొడవ జరిగినా కనీసం మా అమ్మ ఒక్క మాట కూడా నా తరపున మాట్లాడలేదు. నన్నూ, నా కష్టాన్నీ చిన్నప్పటినుండీ చూసింది. అయినా నావైపు మాట్లాడటానికి కూడా మా అమ్మకు మనసు రాలేదు. మా అమ్మకూడా తమ్ముళ్లతో కలిసి నన్ను మోసం చేసింది’’ గొంతు గాద్గదికమైంది.

వాతావరణం బరువుగా ఉంది. గాలి నెమ్మదిగా కదులుతోంది. కొంచెంసేపు మౌనం రాజ్యమేలింది ఇద్దరి మధ్యలో... పక్కనే ఉన్న లోటాలో నీళ్లు తాగి ముత్యాలరావు...

‘‘ఒక్కటే రాంబాబూ... తల్లిగానీ, తండ్రిగానీ తమ్ముళ్లుగానీ... అందరూ వాళ్ల వాళ్ల స్వార్థం చూసుకునేవారే! వాళ్ల ప్రేమ ఎప్పుడూ అవసరార్థమే! భార్య మాత్రమే మన జీవితపర్యంతం తోడు నిలిచేది. తీరా జరిగిపోయిన తరువాత బాధపడటం కంటే ముందే జాగ్రత్త పడటం మంచిది. నిజానికి ఇప్పుడు నీకు ఇవన్నీ చెప్పడం కరెక్టో కాదో తెలియదు కానీ... ఇప్పుడు నువ్వు మా కుటుంబ సభ్యుడివి. అందుకే నీ బాగు కోరి చెపుతున్నా...’’

రాంబాబు సాలోచనగా తల పంకించాడు...

‘‘నన్ను పొరపాటుగా అనుకోకు అల్లుడూ... ఏదో నా అనుభవం నేర్పిన పాఠాన్ని నీతో పంచుకుంటున్నా... అంతే!’’

‘‘మామయ్యా... ఇప్పుడు మీ వయసెంత?’’

‘‘యాభై ఆరు...’’ ఎందుకడిగాడో అర్థంకాక బదులిచ్చాడు.

‘‘మీ అన్నదమ్ముల మధ్య ఈ పొరపొచ్చాలు వచ్చి ఎంతకాలం అయింది?’’

‘‘ఓ అయిదేళ్లయి ఉంటుంది. అలాని కొట్టుకోలేదు... తిట్టుకోలేదు... కానీ మనసుల మధ్య దూరమే పెరిగింది.

‘‘ఆఁ... ఆఁ... చూశాను. మేము కూడా వాళ్లిళ్లకు వెళ్లాంకదా. చిన్న మామయ్యవాళ్లు ఆర్థికంగా కాస్త తక్కువలో ఉన్నట్టున్నారు.’’

‘‘అవును... ఇద్దరు మగపిల్లలు... వాళ్ల చదువులూ... అవీ ఉంటాయి కదా!’’

‘‘బహుశా మీరన్న ఆ మాటలే మీవాళ్ల చేతలకి సమాధానాలు అయి ఉండొచ్చు...’’

అర్థమయ్యీ కానట్టు చూశాడు ముత్యాలరావు.

‘‘అసలు రోజులు ఎలా ఉన్నాయో నీకేం తెలుసు రాంబాబూ... ఎన్ని పంచాయితీలు... రోజూ చూస్తున్నాకదా! జాగ్రత్తగా ఉండకపోతే మనలనే మోసం చేస్తారు. నేను కూడా మా తమ్ముళ్లను వాళ్ల మానాన వాళ్లని వదిలేసి నా దారి నేను చూసుకుంటే ఆ ఆరెకరాలు నాదే అయ్యుండేది. చేతిలో సొమ్ము కూడా బాగానే ఉండేది.’’

‘‘మీరు ఏం చూస్తున్నారో... నాకు తెలియదు. మా తమ్ముళ్లైతే మోసం చేసే రకంకాదు.’’

‘‘నేనూ... అలాగే అనుకున్నాను. చివరికి ఏం జరిగింది? అయినా మోసం చేసేవాడిదికాదు మోసపోయినోడిదే తప్పు. మన తెలివి తక్కువ తనాన్నీ, అమాయకత్వాన్నీ అదునుగా తీసుకొని మోసగిస్తారు. అవి కలిగి ఉండటమే మన తప్పు. ఎప్పుడూ ఏమరుపాటుగా లేకుండా... జాగ్రత్తగా ఉంటే మనం మోసపోము’’ చెప్పాలనుకున్నది చెప్పినట్టు దీర్ఘంగా గాలి పీల్చి వదిలాడు.

‘‘ఎప్పుడో మోసం చేస్తారని అయినవాళ్లని నిరంతరం సందేహిస్తూ... బతకడం నాకు ఇష్టంలేదు. మామయ్యా ఒకవేళ మీరన్నదే నిజం అనుకున్నా... మోసపోతే ఏం పోతుంది... మహా అయితే కొంత ఆస్తో డబ్బో నష్టపోతాం. కానీ అనుమానించడం మొదలుపెడితే... బంగారంలాంటి బంధాలు నష్టపోతాం. ఆప్యాయంగా కమ్ముకునే ప్రేమలు నష్టపోతాం. నావాళ్లున్నారనే ధైర్యం నష్టపోతాం. మొత్తంమీద కుటుంబమనేదాన్నే నష్టపోతాం.’’

‘‘ఇంత చెప్పినా అర్థం చేసుకోలేకపోతున్నావు. మోసం చేశాక తెలుస్తుంది నా మాటల విలువ’’ ముత్యాలరావు నిష్టూరంగా అన్నాడు.

మీ అన్నదమ్ములు ఈ ఐదేళ్లనుండి కాస్త ఇబ్బంది పడుతున్నారు. కానీ నలభై ఏళ్లకుపైగా ఆనందంగా ఉన్నారు... కానీయండి... మేమూ అలాగే ఉంటాం. ఒకవేళ వాళ్ల చేతుల్లో నేను మోసపోవాల్సొస్తే పోనీండి... కనీసం అప్పటివరకూనైనా ఆనందంగా ఉంటాం.’’

‘‘అన్నేళ్లపాటు నమ్మబట్టే వాళ్లు నన్ను మోసం చేశారు. అదే నేను కాస్త జాగ్రత్తగా ఉండి ఉంటే...?’’

‘‘మోసపోవడం తప్పేమీకాదు. నమ్మి మోసపోయిన వాడు... ‘నమ్మడమ’నే మనిషి లక్షణాన్ని కలిగి ఉన్నట్లు లెక్క. మోసగించినవాడికి తెలుసు తను చేసిన తప్పు. అది గుర్తొచ్చిన ప్రతీసారీ... కొద్దికొద్దిగా... అగాధంలోకి జారిపోతుంటాడు. అది జీవితాంతం మనసులో మెర మెర లాడుతుంది. బయటికి బింకంగా ఉన్నా... అతన్ని అపరాధభావన వదిలిపెట్టదు...

మీ విషయంలో... మీ తమ్ముళ్లు మిమ్మల్ని మోసం చేశారా... లేదూ మీరు అలా అనుకుంటున్నారా అనేది నాకు అప్రస్తుతం. కానీ...’’ అని కొద్దిసేపు ఆగి... పిట్టగోడ మీదినుండి అందుతున్న సంపెంగ పువ్వుని తుంచి వాసన చూస్తూ...

‘‘ఇప్పుడు అందుతున్న మంచి సువాసనను వదిలేసి, రేపెప్పుడో ఈ పువ్వు కుళ్లిపోతుందని బాధపడటం లాంటిదే మీరిచ్చిన సలహా... అన్యధా భావించవద్దు మామయ్యా’’ రాంబాబు నవ్వుతూ లేచి, చేతిలో ఉన్న పువ్వు మెత్తదనాన్ని చెంపలతో పరీక్షిస్తూ... రమణీ... అంటూ... కిందకు వెళ్లడానికి మెట్లవైపు అడుగేశాడు.

ముత్యాలరావు రాంబాబు మాటల లోపలి తట్టును తడమడానికి ప్రయత్నిస్తున్నాడు... సంపెంగ పూల పరిమళం అతని మనసు వైపు పాకుతోంది.

పైన చంద్రుడు చల్లని ముర్రుపాల వర్షం కురిపిస్తున్నాడు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.