పువ్వంటి క్యాబేజీని చూశారా?! - Sunday Magazine
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పువ్వంటి క్యాబేజీని చూశారా?!

క్యాబేజీ అనగానే చుట్టుకున్నట్లుగా ఉన్న ఆకులతో గుండ్రని బంతిలా ఉన్నదే ఎవరికైనా స్ఫురిస్తుంది. కానీ, ఏ గులాబీనో ముద్దమందారాన్నో తలపించేలా విచ్చుకుంటుందని ఎవరైనా ఊహించగలరా... కానీ అలాంటి క్యాబేజీ రకాలూ ఉన్నాయనేది చాలామందికి తెలియదు మరి. పూలమొక్కల్లానే అందంకోసం పెంచుకునే ఆ క్యాబేజీలపై ఓ లుక్కేద్దామా..!
‘ఎవరైనా అతిశయోక్తిగా చెబుతుంటే, నా చెవిలో క్యాబేజీ పూలేమైనా కనిపిస్తున్నాయ్‌రా నీకు’ అనేస్తుంటారు ఈతరం కుర్రకారు. బహుశా క్యాబేజీ పువ్వులు పూయడం ఎంత అబద్ధమో నువ్వు చెప్పేదీ అంతే అన్న అర్థంతో అలా అంటుంటారు. కానీ పువ్వులా విరిసే క్యాబేజీ రకాలూ ఉన్నాయి. అందంకోసం ఎక్కువగా పెంచే ఈ పూల క్యాబేజీని తింటారు కూడా. ముఖ్యంగా పాశ్చాత్యదేశాల్లో బాల్కనీల్లో చలికాలంలో పెంచే పూలమొక్కల్లో ఈ క్యాబేజీ ఒకటి.
కాస్త పెద్ద సైజులో పూసిన గులాబీల్లా ఉండే ఈ క్యాబేజీల్లో గులాబీ, వంకాయ, ఆకుపచ్చ, తెలుపు, పసుపు... ఇలా చాలా రంగులే ఉన్నాయి. ఈ పూల రంగులూ అవి పెరిగే తీరునీ బట్టి కలర్‌ అప్‌, పీజియన్‌, పీకాక్‌, ఒసాకా, టోక్యో... ఇలా వెరైటీలకు కొదవ లేదు. అన్ని రకాల్లోనూ చుట్టూ ఉన్న ఆకులు ఆకుపచ్చరంగులో ఉండి, మధ్యలో ఉన్నవి మాత్రం పువ్వులా రకరకాల రంగుల్లో విచ్చుకుంటున్నట్లుగా ఉంటాయి. అందుకే ఈ కాలంలో కుండీల్లో విరిసే చామంతులతోపాటు వీటిని నాటితే ఆ అందమే వేరు అంటారు ఫ్లోరిస్టులు.

నిజానికి క్యాబేజీ, కాలీఫ్లవర్‌, కేల్‌, బ్రకోలీ... అన్నీ కూడా బ్రస్సికా ఒలెరేసియా జాతికి చెందినవే. ఈ ఆర్నమెంటల్‌ క్యాబేజీ కూడా ఆ కోవలోకే వస్తుంది. పూల క్యాబేజీలానే కేల్‌ మొక్క ఆకులు కూడా రంగురంగుల్లో విరుస్తాయి. అయితే అవి కాస్త వంకర్లు తిరిగి చామంతి ఆకుల్ని తలపిస్తుంటాయి. అందుకే ఈ రెండింటినీ కూడా అందంకోసం పెంచుతుంటారు. అదేసమయంలో వీటిల్లో ఉన్న పోషక గుణాల కారణంగా సలాడ్లలోనూ సూపుల్లోనూ వాడతారు. కూరల్లో వాడే క్యాబేజీలోలానే వీటిల్లోనూ పీచూ, విటమిన్‌-సి, బీటా కెరోటిన్‌, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం... వంటి పోషకాలన్నీ సమృద్ధిగా ఉంటాయి. అయితే వీటి ఆకులు కాస్త చేదుగా ఉండటంతో కూరల్లో కన్నా సలాడ్లలోనే ఎక్కువగా వాడతారు. ఇవి త్వరగా వాడిపోకుండా ఉంటాయన్న కారణంతో పెళ్లి బొకేల్లోనూ ఇంట్లో వేజ్‌ల్లోనూ అలంకరిస్తుంటారు.
ఉద్యానవనాల్లోనూ పెంచుతారు.
రకరకాల రంగుల్లో విరిసే క్యాబేజీ విత్తనాలని కుండీల్లో చల్లితే అవన్నీ ఒకేసారి పెరిగి గుదిగుచ్చిన పూలబొకేలా ఉంటాయి. అచ్చం గులాబీల్ని తలపించే ఈ అందాల క్యాబేజీని పెంచడానికి ట్రై చేయండి మరి!


పిల్లల కోసం... చాక్లెట్‌ పండ్లు!

‘పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది...’ అని చెబితే పెద్దవాళ్లే పట్టించుకోరు, ఇక పిల్లల సంగతి వేరే చెప్పాలా! చిన్న ముక్క తినమంటే ఇంట్లో ఈ చివరి నుంచి ఆ చివరికి పరిగెడుతూ ముప్పుతిప్పలు పెడుతుంటారు. అదిగో, అలాంటి గడుగ్గాయిల కోసమే ఈ ‘చాక్లెట్‌ ఫ్రూట్‌ బైట్స్‌’ వచ్చేశాయి. పైనంతా తియ్యని చాక్లెట్‌, లోపలేమో పోషకాల పండ్లూ కలిసి... ఆరోగ్యం, ఆనందం రెండూ తెచ్చిపెడతాయి!
అన్నమే ఓ పట్టాన తినని పిల్లలకు... పండ్లూ, డ్రైఫ్రూట్స్‌ తినిపించడం అంటే మామూలు విషయం కాదు. అలా అని అమ్మలు ఊరుకోలేరు కదా, ఏదోలా తినిపించి పోషకాలు అందించాలని ఆరాటపడుతుంటారు. అలాంటి వారికి చక్కగా పనికొస్తాయి ఈ ‘చాక్లెట్‌ ఫ్రూట్‌ బైట్స్‌’. కొన్ని వ్యాపార సంస్థలు పండ్లనూ, ఎండుఫలాలనూ చాక్లెట్‌తో కలిపి ప్రాసెస్‌ చేసి ఇలా అమ్ముతున్నా... ఎప్పటికప్పుడు తాజాగా ఇంట్లోనే చేసుకునేవి ఇంకా రుచిగా ఉంటాయి. ఎక్కువ శ్రమ లేకుండా సులభంగా అయిపోయే ఈ స్నాక్స్‌ సాయంత్రాలు పిల్లలకు ఇవ్వడానికే కాదు, చిన్నచిన్న హౌస్‌పార్టీల్లో చేసిపెట్టడానికీ ఎంతో బావుంటాయి.


అరటి, స్ట్రాబెరీ, కివి, పుచ్చ, ద్రాక్ష, మామిడి, ఆపిల్‌, పైనాపిల్‌, నారింజ వంటి అన్నిరకాల పండ్లనూ ఈ బైట్స్‌ తయారీకి ఉపయోగిస్తున్నారు. చక్కగా మగ్గిన తాజా పండ్లను నచ్చిన ఆకారంలో ముక్కలుగా కోసి పాప్సికల్‌ స్టిక్స్‌ లేదా టూత్‌పిక్‌లకు గుచ్చుతున్నారు. వాటిని ముందే వేడి చేసుకుని ద్రవరూపంలోకి మార్చిన చాక్లెట్‌లో ముంచుతున్నారు. ఆపైన నచ్చిన డ్రైఫ్రూట్‌ ముక్కలూ లేదా పొడిని చల్లి, ఫ్రిజ్‌లో పెడితే ఎంతో రుచికరమైన చాక్లెట్‌ ఫ్రూట్‌ సిద్ధం! రిఫ్రిజిరేట్‌ చేయడం వల్ల చాక్లెట్‌ గట్టిపడటమే కాదు, లోపలి పండు కూడా చల్లగా మారి తినడానికి మరింత బాగుంటుంది. చాక్లెట్‌ పైన చల్లేందుకు కేవలం ఎండుఫలాలే కాదు... కేకులూ కుకీల తయారీలో ఉపయోగించే  రంగురంగుల స్ప్రింకిల్స్‌ కూడా వాడుతున్నారు. చాక్లెట్‌ తియ్యదనానికి వీటి రంగూ రుచీ తోడై పిల్లలను మరింత ఆకర్షిస్తాయంటే నమ్మండి! ఇంకొందరైతే బెల్లంపాకం, కొబ్బరి తురుములను కూడా ఉపయోగిస్తున్నారు. ఎలా చేసినా... చూడగానే నోరూరించేలా ఉన్న ఈ బైట్స్‌ అల్లరి పిడుగులతో పండ్లు తినిపించేందుకు సరైన ఎంపిక. మరి మీ చిన్నారులు కుదురుగా కూర్చుని ఇష్టంగా తినేలా మీరూ వెంటనే చేసిపెట్టేయండి!

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు