close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వానప్రస్థం... ఇక్కడ భద్రం!

రెక్కలు వచ్చి పిల్లలు ఎవరి దారిన వాళ్లు ఎగిరిపోయాక...రెక్కలు అలసిన పెద్దలు ఒకరికొకరై ఒంటరిగా మిగిలిన వేళ... వారికి నీడనిచ్చి, సేదతీర్చి, శేషజీవితాన్ని భద్రంగా, ప్రశాంతంగా గడపడానికి తోడ్పడుతున్నాయి... రిటైర్మెంట్‌ హోమ్స్‌..!

ప్రొఫెసరు రామారావు ఆర్థిక శాస్త్రంలో నిపుణులు. రిటైరయ్యాక పుస్తకాలు రాస్తూ బిజీగా ఉంటున్నారు. కుమార్తెలిద్దరూ చెరో దేశంలో స్థిరపడ్డారు. ఎనభయ్యోపడిలో తల్లిదండ్రులు ఒంటరిగా ఉండడం వారికి ఆందోళన కలిగించేది. అలాగని చురుగ్గా ఎప్పుడూ ఏదో ఒక పనిచేసే తండ్రిని వృద్ధాశ్రమంలో చేరమనడం వారికిష్టం లేదు. అందుకని ఇద్దరూ కలిసి బెంగళూరులోనే ఓ రిటైర్మెంట్‌ హోమ్‌ కొని అందులో ఉండమన్నారు. ప్రొఫెసరు దంపతులకు ఆ ఇల్లు చాలా నచ్చింది. చుట్టూ అందరూ తమ వయసువారే కావడంతో ఇట్టే కలిసిపోయారు. పుస్తకాలు చదువుకోవడానికి మంచి లైబ్రరీ ఉంది. ప్రశాంతమైన ఆ వాతావరణంలో ఆయన రాతపని మరింత వేగంగా జరుగుతోంది. ఎనభై దాటినా ఎంతో ఉత్సాహంగా కన్పిస్తున్న తండ్రిని రోజూ వీడియోకాల్‌లో చూసి తాము సరైన నిర్ణయమే తీసుకున్నామని సంతోషిస్తున్నారు కూతుళ్లు.

రాఘవ తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. హైదరాబాదులోనే మంచి కంపెనీలో ఉద్యోగం రావడంతో ఇన్నాళ్లూ కలిసే ఉంటున్నారు. తండ్రికి గుండె జబ్బు ఉంది. నెల నెలా చెకప్‌కి తీసుకెళ్లడం, సమయానికి మందులు వేసుకునేలా చూడడం- అన్నీ రాఘవా అతడి భార్యా చూసుకునేవారు. ఈ మధ్యే అతడిని ఆఫీసు పనిమీద అమెరికా వెళ్లమన్నారు. నెలో రెణ్ణెల్లో అయితే ఒక్కడే వెళ్లివచ్చేవాడు కానీ మూడేళ్లు అక్కడ తప్పనిసరిగా పనిచేయాలన్నారు కాబట్టి భార్యనీ తీసుకెళ్లక తప్పదు. దాంతో తండ్రిని చూసుకునే బాధ్యతంతా తల్లి మీద వదిలేసి వెళ్లడానికి మనసొప్పలేదు రాఘవకి. ఆ విషయమే ఆఫీసులో పై అధికారికి చెబితే ఆయన రాఘవకి తన స్నేహితుడి చిరునామా ఇచ్చి అక్కడికి వెళ్లి చూసి రమ్మన్నాడు. ఆదివారం ఆ చిరునామా వెతుక్కుంటూ వెళ్లిన రాఘవ అక్కడి వాతావరణం చూసి ఆశ్చర్యపోయాడు.

చుట్టూ పచ్చని చెట్ల మధ్య చిన్న చిన్న పొదరిళ్లలా కట్టిన విల్లాలు. వరండాల్లో పడక కుర్చీల్లో కూర్చుని తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటున్న వృద్ధ దంపతులు.ఆ ఆవరణలో అడుగుపెట్టగానే మనసంతా ఎంతో ప్రశాంతంగా అనిపించింది రాఘవకి. తాను కలుసుకోవాలనుకున్న వ్యక్తిని కలిసి మాట్లాడాక పై అధికారి తనని అక్కడికి ఎందుకు పంపించాడో అతడికి అర్థమైపోయింది.
అదో రిటైర్మెంట్‌ హోమ్‌. నెల తిరిగేసరికల్లా తల్లిదండ్రులకు అక్కడో ఇల్లు ఏర్పాటుచేసి తాను నిశ్చింతగా అమెరికా ప్రయాణమయ్యాడు రాఘవ.
ఇంతకీ... ఏమిటీ ‘రిటైర్మెంట్‌ హోమ్స్‌’?

ఒక్క మాటలో చెప్పాలంటే వృద్ధుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన నివాస సముదాయాలు. పదిహేనేళ్ల క్రితం ఎవరికీ తెలియని ఈ కొత్త రకం ఇళ్లకి ఓ ఐదారేళ్ల నుంచి ఆదరణ పెరుగుతూ వస్తోంది. కొవిడ్‌ పరిస్థితులు ఆ పెరుగుదలని వేగవంతం చేశాయి. వివిధ కారణాల వల్ల పిల్లలు దూరంగా ఉండి, పనిమనుషులు అందుబాటులో లేక ఒంటరిగా అవస్థపడిన పెద్దలు చాలామంది ఇప్పుడు రిటైర్మెంట్‌ హోమ్‌లలోకి మారుతున్నారు.

ఓల్డేజ్‌ హోమ్‌ కాదా?
వృద్ధాశ్రమం వేరు. రిటైర్మెంట్‌ హోమ్‌ వేరు. రెండిటికీ చాలా తేడా ఉంది. వృద్ధాశ్రమాల్లో అతిథుల్లా, కొన్ని పరిమితుల్లో, పూర్తిగా ఇతరుల మీద ఆధారపడి నిస్సహాయంగా ఉండాల్సివస్తుంది. అందుకని అక్కడి వాతావరణం చాలామందికి నచ్చదు. పెద్ద వయసులో చూసుకునేవారు ఎవరూ లేనివాళ్లో, పిల్లల అనాదరణకు గురైనవాళ్లో అక్కడ ఉంటారన్న అభిప్రాయమూ ఉంది సమాజంలో. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప అక్కడ ఉండటానికి ఎవరూ ఇష్టపడరు. రిటైర్మెంట్‌ హోమ్స్‌ అలా కాదు. ఇక్కడ స్వేచ్ఛగా, గౌరవంగా తమ ఇంట్లో తాము ఉంటూనే అన్ని సౌకర్యాలూ పొందవచ్చు. రిటైర్మెంట్‌ హోమ్స్‌ అన్నీ సొంత ఇళ్లే. కావాల్సినవాళ్లు ఎవరైనా కొనుక్కుని ఉండవచ్చు. వయసు ఒక్కటే అక్కడ ఉండటానికి అర్హత.

సొంతిల్లు అయినప్పుడు ఎక్కడైతేనేం?
నగరంలోనే అయినా మామూలు ఇంట్లో ఉండటానికీ రిటైర్మెంట్‌ హోమ్‌లో ఉండటానికీ తేడా ఉంది. ఇండిపెండెంట్‌ హౌస్‌లో అయినా, అపార్ట్‌మెంట్‌లో అయినా వృద్ధులు ఒంటరిగా ఉంటే రకరకాల సమస్యలు ఎదురవుతాయి.

భద్రత: అన్నివేళలా భద్రతకు గ్యారంటీ ఉండదు. పక్కింట్లో ఏం జరుగుతోందో తెలియని, పట్టించుకోవటానికి టైమ్‌ లేని ఈరోజుల్లో పెద్దల భద్రత ప్రశ్నార్థకమే అవుతోంది.

ఒంటరితనం: నగరం నడిబొడ్డున ఉన్నా, పిల్లలతో కలిసి ఉన్నా చాలామంది వృద్ధులు ఒంటరితనంతో బాధ పడుతుంటారు. పిల్లలకు పెద్దలతో గడిపే సమయం ఉండదు. తమ వయసువారూ, కాసేపు కబుర్లు చెప్పుకోడానికి అభిరుచులు కలిసేవారూ చుట్టుపక్కల ఎవరూ లేకపోతే పెద్దవాళ్లకి ఏమీ తోచదు. ఒంటరితనం వారిని మానసికంగా కుంగదీస్తుంది.

ప్రమాదాలు: ఏ కాలో జారి పడినా, వేళ కాని వేళ ఏ గుండెనొప్పో వచ్చినా వెంటనే ఆస్పత్రికి వెళ్లాలంటే చుట్టుపక్కల వారి మీద ఆధారపడాల్సి వస్తుంది. బంధువులూ స్నేహితులూ దగ్గర్లోనే ఉన్నా ఎప్పుడు పడితే అప్పుడు తరచూ వారిని ఇబ్బందిపెట్టడానికి మొహమాటపడతారు.

సహాయకులు: పనిమనుషులు, వంట మనుషులు నమ్మకమైన వారు దొరకాలి. ఒకవేళ దొరికినా అన్నిటికీ వాళ్లమీద ఆధారపడితే అకస్మాత్తుగా వాళ్లు ఓ వారం పదిరోజులు రాకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే బిల్లులు కట్టడమూ సరుకులు తెచ్చుకోవడమూ లాంటి పనులకూ సహాయకులు అవసరమవుతారు. ఆన్‌లైన్లో చేసుకోవడం పెద్దలందరికీ చేతకాకపోవచ్చు. అదే రిటైర్మెంట్‌ హోమ్‌లో ఉంటే ఈ ఇబ్బందులేవీ ఉండవు.

అక్కడెవరు చేసిపెడతారు?
రిటైర్మెంట్‌ హోమ్స్‌ పనితీరు ఎలా ఉంటుందంటే-వీటిని నిర్మించి, అమ్మేయడంతో నిర్మాణ సంస్థల పాత్ర ముగుస్తుంది. ఆ తర్వాత అక్కడ సేవలందించే బాధ్యతను వేరే సంస్థలు తీసుకుంటాయి. వీటిని సర్వీస్‌ ప్రొవైడర్లు అంటారు. ఒక్కో కమ్యూనిటీలో ఉండే ఇళ్ల యజమానులంతా కలిసి సంఘంగా ఏర్పడి సర్వీస్‌ ప్రొవైడర్ల ద్వారా తమకు కావలసిన సౌకర్యాలూ సేవలూ పొందుతారు.

సాధారణంగా రిటైర్మెంట్‌ హోమ్స్‌ అన్నీ నగర రణగొణ ధ్వనులకు దూరంగా పచ్చని పరిసరాల మధ్య ప్రశాంత వాతావరణంలో, విశాలమైన ఆవరణలో గేటెడ్‌ కమ్యూనిటీల్లా నిర్మిస్తున్నారు కాబట్టి భద్రతకు సంబంధించిన భయం ఉండదు. నలభై లక్షలతో మొదలుపెట్టి కోటి రూపాయల వరకూ ఖరీదు చేసే విల్లాలు, ఫ్లాట్లు(సింగిల్‌, డబుల్‌ బెడ్‌రూమ్‌) వీటిల్లో ఉంటున్నాయి. ఎవరి తాహతుకి తగినది వాళ్లు ఎంచుకోవచ్చు. గేటెడ్‌ కమ్యూనిటీలే అయినా ఇవి పెద్దల కోసం ప్రత్యేకంగా కట్టినవి. అన్ని ఇళ్లూ ఒకేలాగా ఉన్నా లోపల ఎవరి అవసరాలకూ ఇష్టాలకూ తగినట్లు వాళ్లు మార్పులు చేసుకోవచ్చు. ఇళ్ల నిర్మాణంతో మొదలుపెట్టి వసతులూ సేవల వరకూ అన్నీ భిన్నంగా, పెద్దవాళ్లకు అనువుగా ఉంటాయి.

ఏ విధంగా..?
మెట్లు లేకుండా చక్రాల కుర్చీలో కూడా లోనికి వెళ్లడానికి వీలుగా ద్వారాలూ, కాళ్లు జారకుండా ఉండేలాంటి ఫ్లోరింగ్‌, కారిడార్లూ బాత్‌రూముల్లో పడిపోకుండా పట్టుకుని నడవడానికి సైడ్‌ బార్స్‌, ప్రతి ఇంటికీ ఇంటర్‌కమ్‌ సదుపాయం, అన్ని రూముల్లోనూ ప్యానిక్‌ బటన్స్‌(అత్యవసర పరిస్థితుల్లో అది నొక్కితే క్షణాల్లో సిబ్బంది వస్తారు), విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా జనరేటర్‌ బ్యాకప్‌ ఉంటాయి. వైఫై, లైబ్రరీ సదుపాయాలుంటాయి. ఏం కావాలన్నా కొనుక్కోడానికి సూపర్‌మార్కెట్‌ ఉంటుంది. కాలక్షేపానికి సంగీత కచేరీలూ నృత్యప్రదర్శనలూ భక్తి సంబంధ ప్రసంగాలూ తదితర కార్యక్రమాల నిర్వహణకు వీలుగా క్లబ్‌హౌస్‌ ఉంటుంది. ఇన్‌డోర్‌, అవుట్‌డోర్‌ ఆటలు ఆడుకునే వీలుంటుంది. ఏ పనిమీదైనా బయటకు వెళ్లి రావాలనుకుంటే రవాణా సదుపాయం ఉంటుంది.

ఇక ఆరోగ్యమూ వ్యాయామానికి సంబంధించి- నలుగురు కలిసి కబుర్లు చెప్పుకుంటూ నడవడానికి వీలుగా వాకింగ్‌ ట్రాక్‌, యోగా, మెడిటేషన్‌ లాంటివి చేసుకునే ఏర్పాటు, పెద్దవాళ్లు వ్యాయామం చేసుకోవడానికి పనికొచ్చే ప్రత్యేక పరికరాలతో నెలకొల్పిన జిమ్‌, ఈతకొలను లాంటివి ఉంటాయి. తోటపనిలో ఆసక్తి ఉన్నవారు అదీ చేయొచ్చు. సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు పండించుకోవచ్చు.

వంటపనీ ఇంటిపనీ చేసుకునే అవసరమూ ఇక్కడ ఉండదు. ఎవరింట్లో వారున్నా ఇళ్ల నిర్వహణనీ, ఇంట్లోని వారి బాగోగుల్నీ చూసుకోవడానికి ప్రత్యేకంగా సిబ్బంది ఉంటారు. వంట, ఇల్లు శుభ్రం చేయడం, బట్టలుతికి ఇస్త్రీచేయడం లాంటి పనులన్నీ నిర్వాహకులే చూసుకుంటారు. ఆసక్తి ఉన్న వాళ్లు వంట చేసుకోవచ్చు. లేదంటే కమ్యూనిటీ డైనింగ్‌ హాల్లో అందరితో కలిసి తినవచ్చు. దానికీ ఓపిక లేకపోతే గదికే పంపిస్తారు. ఆరోగ్య పరంగా ఎవరికి ఎలాంటి ఆహారం ఇవ్వాలో వైద్యుల సలహా మేరకు తయారుచేసిస్తారు. ఇరవైనాలుగ్గంటలూ వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి అత్యవసర పరిస్థితులు ఏమన్నా వచ్చినా ఆందోళన అక్కర్లేదు. అనారోగ్యంగా ఉంటే సిబ్బందే ఇంటికి వచ్చి పరీక్షిస్తారు. మందులూ సరుకులూ లాంటివి ఏమైనా కావాలంటే ఇంటర్‌కమ్‌లో ఫోన్‌ చేసి చెబితే ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. అత్యవసరంగా ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చినా అంబులెన్స్‌ సిద్ధంగా ఉంటుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే- ఇక్కడ జీవితం రిసార్టులో లాగా ఉంటుంది. ఏ పనులూ బాధ్యతలూ లేకుండా ప్రశాంతంగా విశ్రాంతిగా గడపొచ్చు. కుటుంబసభ్యులు మాత్రమే కలిసి ఉండేందుకు ప్రైవసీ, అదే సమయంలో పదిమందితో కలిసి సరదాగా గడిపే సామాజిక జీవనమూ సాధ్యమయ్యే వెసులుబాటు ఈ రిటైర్మెంట్‌ హోమ్‌లలో ఉంటాయి కాబట్టి వృద్ధుల భౌతిక, మానసిక ఆరోగ్యానికి ఇవి ఎంతగానో తోడ్పడుతున్నాయి.

ఎలా..?
రంగారావు వయసు ఎనభైకి చేరువలోనే. భార్య చనిపోయాక అమెరికాలో ఉన్న కొడుకు దగ్గరకు వెళ్లి రెండేళ్లున్నాడు. కొడుకూ కోడలూ మనవలూ ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉండటంతో ఆయనకు కాలక్షేపం అయ్యేది కాదు. దాంతో ఒంటరితనంతో విసిగిపోయి ఇండియా వచ్చేస్తానంటే అక్కడ ఒక్కడివే ఎలా ఉంటావనేవాడు కొడుకు. ఓసారి ఇంటర్నెట్‌లో రిటైర్మెంట్‌ హోమ్‌ల ప్రకటన చూసిన కొడుకు దాని గురించి వివరాలు తెలుసుకున్నాడు. నగరంలో ఉన్న ఫ్లాట్‌ అమ్మేసి రిటైర్మెంట్‌ హోమ్‌ కొని ధైర్యంగా తండ్రిని పంపించాడు. ‘ఇక్కడైతే ఏ భయమూ లేకుండా ఒంటరిగా ఉండవచ్చు. చక్కగా అందరితో కలిసి మార్నింగ్‌ వాక్‌, వ్యాయామం చేస్తాను. మధ్యాహ్నం పుస్తకాలు చదువుకుంటాను. సాయంత్రం స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ గడిపేస్తా. అమెరికాలో రోజు గడవడం కష్టమయ్యేది. ఇక్కడికొచ్చాక రోజులు ఎలా గడిచిపోతున్నాయో తెలియడం లేదు’ అంటాడాయన సంతోషంగా.

ఈ రిటైర్మెంట్‌ హోమ్స్‌లో ఉండడం వల్ల ప్రధానంగా ఒంటరితనం ఉండదు. చుట్టూ ఉన్నవారంతా తమ వయసువారే కనుక తేలిగ్గా అందరితో కలిసిపోయి ఆనందంగా గడపొచ్చు. అందరూ చదువుకుని ఉద్యోగాలు చేసి రిటైరైనవారే కాబట్టి వేర్వేరు రంగాల్లో తలపండిన వారై ఉంటారు. దాంతో కాలక్షేపానికి కొదవే ఉండదు. ఇది వారిని మానసికంగా ఉత్సాహంగా ఉంచుతుంది. సొంతింట్లో ఉన్నామన్న ధీమాకి తోడు పిల్లల మీదో బంధువుల మీదో ఆధారపడాల్సిన అవసరం లేకపోవడమూ, భద్రతనిచ్చే పరిసరాలూ, ఆరోగ్యపరంగా ఏ అవసరం వచ్చినా నిమిషాల్లో అందే సహాయమూ... ఇవన్నీ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతాయి.

చుట్టాలొస్తే..?
చుట్టాలూ, ఇంటి యజమానుల పిల్లలూ ఎవరొచ్చినా ఈ ఇళ్లలో ఉండవచ్చు. ఇల్లు సరిపోదనుకుంటే ప్రత్యేకంగా గెస్ట్‌ రూములు ఉంటాయి. వాటినీ వినియోగించుకోవచ్చు. అపార్ట్‌మెంట్లలో నివసించేవారు నెలనెలా మెయింటెనెన్స్‌ ఫీజు చెల్లించినట్లు ఇక్కడ కూడా తీసుకుంటున్న సేవలను బట్టి నెలకింతని డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

అద్దెకు తీసుకోవచ్చా?
కొనుక్కునే స్తోమత లేనివారికీ, పిల్లలంతా విదేశాల్లో స్థిరపడడం వల్ల తమ తర్వాత ఆ ఇల్లు అవసరం ఉండదు కాబట్టి కొనడం వ్యర్థమనుకునేవారికీ రిటైర్మెంట్‌ హోమ్‌ని లీజుకు తీసుకునే అవకాశం ఉంది. కోవై కేర్‌ సంస్థ రిటైర్మెంట్‌ హోమ్‌లను ఐదు, పది, పదిహేనేళ్లకు లీజుకు ఇస్తోంది. కొంతమంది రిటైర్‌ అవకముందే భవిష్యత్తు అవసరాలకోసం కొనుక్కుని అప్పటివరకూ వాటిని అద్దెకిస్తున్నారు. కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే అద్దెకు కూడా తీసుకోవచ్చు. కొన్నిచోట్ల ఆల్జీమర్స్‌ లాంటి వ్యాధులతో బాధపడేవారికోసం, శారీరక వైకల్యం ఉన్నవారికోసం ప్రత్యేకంగా నిర్మించిన ఇళ్లూ ఉంటున్నాయి.

ఒకవేళ పనిచేయాలనుకుంటే..?
విశ్రాంతి తీసుకునేవారే కాదు, పనిచేసేవారూ ఇక్కడ ఉండవచ్చు. ఈ మధ్య కొందరు రిటైర్మెంట్‌ తర్వాత తమకిష్టమైన రంగంలో సెకండ్‌ కెరీర్‌ వెతుక్కుంటున్నారు. ఉద్యోగమే కాదు, రిటైర్మెంట్‌ హోమ్‌లలో ఉంటూ సంఘసేవ చేస్తున్నవాళ్లూ ఉన్నారు.

భాగీరథి పెళ్లి చేసుకోలేదు. బ్యాంకు ఉద్యోగం చేసేది. రిటైర్‌ అవగానే చెన్నైలోని రిటైర్మెంట్‌ హోమ్‌కి మారిపోయింది. రోజూ కొద్ది గంటలు స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ చేస్తుంది. ఆ సంపాదనతో కొంతమంది అనాథ పిల్లలను చదివిస్తోంది. వారాంతాల్లో కమ్యూనిటీలో ఉన్న మహిళలతో సరదాగా సాంస్కృతిక కార్యక్రమాలు రూపొందించి నిర్వహిస్తుంది. ‘రిటైరయ్యాక నా పరిస్థితి ఏమిటని దుబాయ్‌లో ఉన్న మా చెల్లెలు చాలా ఆందోళన చెందేది. ఇప్పుడు తనకి ఎంతో రిలీఫ్‌గా ఉంది’ అంటుంది భాగీరథి.

తిరువనంతపురంలోని రెయిన్‌బో ప్రాజెక్టు మరొకడుగు ముందుకేసి పొరుగున ఉన్న రెండు గ్రామాలను దత్తత తీసుకుంది. దాంతో కమ్యూనిటీలో ఉన్న ఆసక్తి కలిగిన వారంతా స్వచ్ఛంద కార్యకర్తలుగా మారి తమ శక్తిసామర్థ్యాలను ఆ గ్రామాల అభివృద్ధికి ఉపయోగిస్తున్నారు.

కొచ్చికి చెందిన డాక్టర్లు శోభనా లక్ష్మి, జీజీ పాలొకరెన్‌లు ఎర్నాకులంలో విశ్రాంత డాక్టర్ల కోసమే ఒక రిటైర్మెంట్‌ హోమ్‌ సముదాయాన్ని నిర్మిస్తున్నారు. దానికి అనుబంధంగా పేదల కోసం ఉచితంగా అవుట్‌పేషెంట్‌ క్లినిక్‌ పెట్టి డాక్టర్లంతా అక్కడ సేవలు అందించాలన్నది వారి లక్ష్యం.

ఎక్కడెక్కడ ఉన్నాయి..?
దేశవ్యాప్తంగా బెంగళూరు, చెన్నై, కోయింబత్తూరు, పుదుచ్చేరి, ఎర్నాకులం, గురువాయూర్‌, పుణె, హైదరాబాద్‌, దిల్లీ, నొయిడా, గురుగ్రామ్‌, అహ్మదాబాద్‌, కోల్‌కతా... దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోనూ రిటైర్మెంట్‌ హోమ్స్‌ ఉన్నాయి. సాకేత్‌, అద్వైత్‌, వేదాంత, మ్యాక్స్‌ ఇండియా, అనన్య, ఆశియానా హౌసింగ్‌, బహరీ లాంటి ప్రముఖ సంస్థల ఆధ్వర్యంలో ఎన్నో ప్రాజెక్టులు పూర్తై పనిచేస్తున్నాయి. మరికొన్ని నిర్మాణంలోనూ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే వీటికి డిమాండ్‌ బాగా పెరుగుతోందంటోంది హైదరాబాదుకి రిటైర్మెంట్‌ హోమ్స్‌ని పరిచయం చేసిన సాకేత్‌ సంస్థ. ఈ సంస్థ ఇప్పుడు కొంపల్లి దగ్గర రెండో ప్రాజెక్టుని నిర్మిస్తోంది. దేశంలో ప్రస్తుతం రిటైర్మెంట్‌ హోమ్స్‌ కొన్ని వేలు మాత్రమే అందుబాటులో ఉండగా డిమాండ్‌ మాత్రం రెండున్నర లక్షలు ఉందనీ, వచ్చే పదేళ్లలో ఈ రంగం ఇరవై రెట్లు పెరుగుతుందనీ నిర్మాణ సంస్థలు అంచనా వేస్తున్నాయి.

ఇదంతా చూస్తుంటే... విశ్రాంత జీవితానికి నిజమైన అర్థాన్నిచ్చే ఈ కొత్తరకం వానప్రస్థ ఆశ్రమాలను భవిష్యత్తులో ప్రతి ఊళ్లోనూ చూడొచ్చని పిస్తోంది కదూ..!


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు