ఆరోగ్యానికి ఐసుతో స్నానం..! - Sunday Magazine
close

ఆరోగ్యానికి ఐసుతో స్నానం..!

రెండు ఐసు ముక్కల్ని చేతిలో పెట్టుకుని నాలుగు నిమిషాలు ఉండాలంటేనే ‘బాబోయ్‌’ అనేస్తాం. కానీ ఈమధ్య యూఏఈ వాసులు అక్కడి ఎండలను తట్టుకోవడానికి ఐస్‌ క్యూబులు నింపిన బాత్‌టబ్బుల్లో కూర్చుంటున్నారట. అదీ ఎడారిలో ఆరుబయట. ఐస్‌ బాత్‌ థెరపీగా పిలిచే దీనివల్ల శరీరం చల్లబడటంతో పాటు, మెదడు కూడా చురుకవుతుందట. అంతేకాదు, ఒకేసారి బాగా వేడి, బాగా చల్లదనం శరీరానికి తగలడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందన్నది ఈ ఐస్‌బాత్‌ నిర్వాహకుల మాట. ‘ఐసు టబ్బులో కూర్చున్న వెంటనే ఊపిరి ఆడనట్లుండి, బయటికి వచ్చేయాలని పిస్తుంది కానీ తర్వాత హాయిగా ఉంటుంది’ అంటున్నారు జనం. ఎడారిలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, కూర్చోగలుగుతున్నారేమో కానీ మన దగ్గరైతే గడ్డకట్టేయడం ఖాయం... ఏమంటారు..?


ఆ ఊళ్లో పోర్చుగీసే మాట్లాడతారు..!

తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడినట్లే మహారాష్ట్రలోని ప్రజలు మరాఠా మాట్లాడతారు. ఎక్కడైనా అంతేననుకోండీ. మహా అయితే, కొందరు మన దేశానికే చెందిన హిందీనో మరో ప్రాంతీయ భాషలోనో సంభాషిస్తారు. కానీ విచిత్రం ఏంటంటే... మహారాష్ట్రలోని ‘కొర్లయి’ అనే గ్రామ ప్రజలు మాత్రం పోర్చు గీసులో మాట్లాడుకుంటారు. ఎలా అంటారా... వాస్కోడిగామా ద్వారా మనదేశంలోకి వచ్చిన పోర్చుగీసు దేశస్థులు ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ 1594లో నిజాముల పరిపాలనలో ఉన్న కొర్లయి కోటను కూడా స్వాధీనం చేసుకున్నారు. తర్వాత స్థానికుల్ని బానిసలుగా చేసుకున్న పోర్చుగీసు అధికారులు తమ అవసరాలకోసం వారికి తమ భాషను నేర్పించారు. అలా పోర్చుగీసు, మరాఠీల కలయికతో ‘క్రియొల్‌’ అనే ఓ కొత్త భాష పుట్టుకొచ్చింది. తర్వాత వాళ్లు మన దేశం విడిచి వెళ్లిపోయినా పోర్చుగీసు భాష మాత్రం అలాగే ఉండిపోయింది. ఇప్పటికీ స్థానికులు ఆ భాషలోనే మాట్లాడు కోవడం విశేషం.


లండన్‌ వెళ్లిన మన ఏనుగులు!

అరవైకి పైగా ఉన్న చిన్నా పెద్దా ఏనుగుల గుంపులు కొన్ని గత కొద్ది నెలలుగా లండన్‌లోని పికడిలీ నుంచి బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌ వరకూ ఉన్న పార్కులను సందర్శిస్తున్నాయట. అదేంటీ... ఏనుగులు నగరంలోని పార్కులకు రావడమేంటీ అనిపిస్తోంది కదూ... నిజానికి ఇవి నిజమైన ఏనుగులు కాదు. మనుషులు, జంతువులతో కలసి కూడా బాగా జీవించొచ్చు... అనే విషయాన్ని తెలిపేలా ‘కో ఎగ్జిస్టెన్స్‌, ఎలిఫెంట్‌ ఫ్యామిలీ’ అనే రెండు స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన ఆర్ట్‌ ప్రాజెక్టు ఇది. తమిళనాడులోని గిరిజనులతో కలసి తలంబ్రాల మొక్కల తీగలతో ఈ భారీ సైజు ఏనుగుల్ని తయారు చేశారట. ఈ మొక్కలు అడవుల్లో తెగ పెరిగిపోతూ పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తున్నాయనే కారణంతో వీటిని ఎంచుకున్నారట. అంతేకాదు, చూడచక్కని ఈ ఏనుగుల అయిదువందల ప్రతిమలను రాబోయే సంవత్సరాలలో ప్రపంచ వ్యాప్తంగా వేరు వేరు దేశాల్లో ఏర్పాటుచేస్తారట. ఇక, ఈ ప్రాజెక్టుతో వచ్చిన విరాళాలను భారత్‌లోని గిరిజనుల కోసం ఖర్చుచేస్తారట.


కెమెరామెన్‌ ముందు పరుగెత్తేశాడు..!

చైనాలోని షాంగ్జి ప్రావిన్స్‌లోని డాటంగ్‌ యూనివర్సిటీలో ఈమధ్య 100 మీటర్ల పరుగు పందెం నిర్వహించారు. మామూలుగా అయితే, స్టేడియంలో కూర్చున్నవారెవరైనా ఆ సమయంలో క్రీడాకారుల వైపే చూస్తారు. కానీ ఈసారి మాత్రం అలా జరగలేదు. అందరూ ఓ కెమేరామెన్‌ వైపే చూస్తూ ఉండిపోయారట. అతడు వీడియో తీసేందుకు ఆటగాళ్లకన్నా వేగంగా పరిగెట్టాడట మరి. అదే కాలేజీలో చదువుతున్న అతడు వీడియోగ్రాఫర్‌గానూ పనిచేస్తున్నాడట. అలా ఈ క్రీడాపోటీల వీడియోని తీసే పని పడింది. మామూలుగా అయితే ఎక్కడో దూరం నుంచి మొత్తం దృశ్యం కనిపించేలా వీడియో తీస్తారు. కానీ ఇతగాడు ఏకంగా నాలుగు కిలోల కెమేరాను పట్టుకుని మరీ ఆటగాళ్ల పక్క లైనులో వాళ్ల కంటే వేగంగా పరుగు తీస్తూ పోటీ దృశ్యాలను వీడియో తీశాడట.  పోటీలో పాల్గొనలేదు కానీ మొదట గమ్యాన్ని చేరిందీ ఈ వీడియోగ్రాఫరే. అందుకే, ఇప్పుడు అతడి వీడియో వైరల్‌ అవుతోంది.

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న