జనం కోసం కదిలారు! - Sunday Magazine
close

జనం కోసం కదిలారు!

ఎవరో ఒకరు... ఎపుడో అపుడు... ఒక్క అడుగు ముందుకు వేస్తే ఎంత క్లిష్టమైన సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. అందుకు ఉదాహరణే ఇక్కడున్న వ్యక్తులూ, వారు చేపడుతున్న కార్యక్రమాలూ!


జఖార్‌... పోలీసు టీచర్‌!

రాజస్థాన్‌లోని చురు జిల్లాకు చెందిన ధరమ్‌వీర్‌ జఖార్‌ బీఎడ్‌ చేశాడు. టీచర్‌ అయ్యి, పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాలనుకున్నాడు. ఆలోపు పోలీసు కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. ఖాకీ దుస్తులు వేసినా అతనిప్పుడు చేస్తున్నది టీచర్‌ ఉద్యోగమే. జిల్లా కేంద్రంలోని మహిళా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ధరమ్‌వీర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. స్టేషన్‌ పరిధిలోని మురికివాడల్లో ఉండే చాలామంది పిల్లలు రోడ్లమీద బిచ్చమెత్తుకోవడమూ, చెత్తలోని పాలిథిన్‌ కవర్లూ, ఇనుప వ్యర్థాలూ, కాగితాలూ ఏరుకోవడమూ చేస్తూ కనిపించేవారు. వారి సంబంధికులకు అధికారులు ఎన్నిసార్లు చెప్పినా పరిస్థితిలో మార్పు రాలేదు. కానీ వారి బాల్యం అలా రోడ్లవెంటా, చెత్త కుప్పల వెంటా కరిగిపోతుండటాన్ని చూస్తూ ఉండలేకపోయాడు జఖార్‌. అందుకని పోలీసు స్టేషన్‌ దగ్గరే 2016లో వారికోసం ‘అప్నీ పాఠశాల’ పేరుతో బడిని మొదలుపెట్టాడు. స్టేషన్‌ పక్కనే ఉన్న ఖాళీ భవనంలో ఈ పాఠశాలను నిర్వహిస్తున్నారు. పిల్లల వయసునుబట్టి ఒకటి నుంచీ ఏడు వరకూ తరగతులుగా విభజించి పాఠాలు చెబుతారక్కడ. ఆ స్కూల్లో ప్రస్తుతం 450 మంది విద్యార్థులు ఉన్నారు. జఖార్‌తోపాటు ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు వీరికి పాఠాలు చెబుతారు. పిల్లలకు టిఫిన్‌, మధ్యాహ్న భోజనం, యూనిఫాం, పుస్తకాలూ, బ్యాగులూ... ఇలా అన్నీ ఇస్తారు. అందుకు అవసరమైన మొత్తాన్ని విరాళాల రూపంలో సేకరిస్తున్నారు. ఈ పాఠశాలను ప్రభుత్వ పాఠశాలగా మార్చే ప్రయత్నంలోనూ ఉన్నారు.


ఉద్యోగులకు వారాంతాలంటే ఆటవిడుపు, కుటుంబంతో సమయం గడపడానికి దొరికే సమయం... కానీ హైదరాబాద్‌కు చెందిన ఆ దంపతులు మాత్రం శనివారాల్ని రోగులూ, వారి కుటుంబ సభ్యుల ఆకలి తీర్చేందుకు కేటాయిస్తున్నారు. నగరానికి చెందిన శామ్యూల్‌ జాన్సన్‌, ప్రియ దంపతులు నగరంలోని అత్యంత రద్దీ ఉండే గాంధీ, నీలోఫర్‌ ఆసుపత్రుల దగ్గర ప్రతి శనివారం ఉచితంగా భోజనం పెడతారు. చికెన్‌ కూర, గుడ్లు, ఉప్మా, మీల్‌ మేకర్‌ ఫ్రైడ్‌ రైస్‌లను అందిస్తారు. ఆ ఒక్కరోజు దాదాపు 1500 మంది ఆకలి తీర్చుతారు. ‘ప్రతి ఒక్కరికీ నాణ్యమైన పోషకాహారం అందాలి. అందుకే పోషక విలువలు ఉండే ఆహారాన్నే అందిస్తున్నాం’ అని చెబుతారు శామ్యూల్‌. ‘2009లో ప్రియ గర్భిణిగా ఉన్నపుడు ప్రాణాపాయ స్థితిలో ప్రభుత్వ హాస్పిటల్‌కి తీసుకువెళ్లాను. తిండి, నిద్ర ఆలోచనలేవీ లేకుండా ఏ క్షణం ఏ వార్త వినాల్సి వస్తుందోనన్న ఆందోళనతో హాస్పిటల్‌ కారిడార్‌లో తిరిగాను. అప్పుడే అక్కడికి సుదూరాలనుంచి పేదలు రావడాన్ని గమనించాను. హోటళ్లలో భోజనంచేసే ఆర్థిక పరిస్థితి లేక అర్ధాకలితో రోజులు గడుపుతుండటం చూశాను. హాస్పిటల్‌ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పేదలకు ఆహారం అందించాలని నిర్ణయించుకున్నాం. మొదట్లో 20-25 మందికి భోజనం పెట్టేవాళ్లం. 2018లో మరోసారి ప్రియ మృత శిశువుకి జన్మనిచ్చింది. ఆ బాధని మర్చిపోవడానికి మరింతమందికి అన్నదానం చేయాలనుకున్నాం. ఇప్పుడు 1500 మందికి ఆహారాన్ని అందిస్తున్నాం’ అంటారు శామ్యూల్‌. ఇతడు ఓ ఐటీ కంపెనీలో మేనేజర్‌ కాగా, ప్రియ ఇటీవల స్కూల్లో టీచర్‌గా చేరింది. ఇద్దరి ఆదాయంలో అధిక మొత్తాన్ని ఆహార తయారీకే కేటాయిస్తున్నారు.


కూలీల పిల్లలకో క్రెష్‌

దిల్లీ... దేశంలోని అతిపెద్ద నగరం. ఇక్కడికి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఎన్నో కుటుంబాలు ఉపాధి కోసం వలస వస్తుంటాయి. తల్లిదండ్రులు పనికి పోతే పిల్లల సంగతి పట్టించుకునేవారే ఉండరు. అలాంటి పిల్లలు వేలల్లో ఉంటారు. సంరక్షకులు లేకపోవడంతో కొన్నిసార్లు వాళ్లు పక్కదారి పట్టే ప్రమాదమూ ఉంది. వారి రక్షణకూ ముప్పు ఉంటుంది. హ్యూలెట్‌-ప్యాకర్డ్‌ సంస్థలో ఉన్నతస్థాయి ఉద్యోగం వదిలి పదేళ్ల నుంచీ ఇలాంటి పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు రిచా ప్రశాంత్‌. ఆమె స్థాపించిన ‘సునాయ్‌ ఫౌండేషన్‌’ వందల మంది పిల్లలకి తోడూనీడగా ఉంటోంది. దాదాపు వంద మంది వాలంటీర్ల సాయంతో చిన్నారులకి క్రెష్‌, ప్లేస్కూల్‌ సదుపాయంతోపాటు, బడి ఈడు పిల్లలకు పాఠాలు చెప్పించడమూ చేస్తుందీ సంస్థ. వాళ్లందరికీ ఒక పూట భోజనమూ పెడతారు. పిల్లల్లో ఎవరైనా బడికి వెళ్లదల్చుకుంటే దగ్గర్లోని పాఠశాలల్లో చేర్పిస్తారు. ఇప్పటివరకూ అలా 500 మందిని చేర్పించారు. దాదాపు నాలుగు గంటలపాటు పిల్లల్ని ఫౌండేషన్‌ ఆధ్వర్వంలోని కేంద్రాల్లో ఉంచుతారు. వాళ్లకి పుస్తకాలూ, యూనిఫామ్‌లూ ఇస్తారు. వసంత్‌ కుంజ్‌ ప్రాంతంలో మూడుచోట్ల ఈ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఒక్కో కేంద్రంలో దాదాపు 100 మంది పిల్లలు ఉంటారు. ‘పిల్లలకు పాఠాలు చెప్పడం ద్వారా వాళ్ల జీవితంలో మార్పు తీసుకురాగలుగుతున్నాం. వాళ్ల రూపంలో మా జీవితానికి ఒక అర్థం దొరికింది’ అని చెబుతారు రిచా.

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న