close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ సినిమా వదిలి తప్పుచేశా!

ఆ సినిమా వదిలి తప్పుచేశా!

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌... ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’లో వేగంగా దూసుకొచ్చింది. ‘లౌక్యం’గా సినిమాలను ఎంచుకుంది. ‘కరెంటు తీగ’ లాంటి అందంతో ప్రేక్షకులకు ‘కిక్‌’ ఇస్తోంది. ఇప్పుడు ‘పండగ చేస్కో’ అంటూ మన ముందుకొచ్చింది. ‘మిస్‌ ఇండియా’ పోటీల్లో ఐదు విభాగాల్లో అవార్డులు అందుకున్న ఈ పంజాబీ అమ్మడు ఒకప్పుడు పూరీ జగన్నాథ్‌ పిలిచి అవకాశం ఇచ్చినా వద్దని పక్కకు తప్పుకుందట. అలాంటి సంగతులు తన జీవితంలో చాలా ఉన్నాయంటూ ఇలా చెబుతోంది...
రెండేళ్లు... నేను మొట్టమొదట కెమెరా ముందు నటించినప్పుడు నా వయసు. చిన్నప్పుడు నేను చాలా ముద్దుగా ఉండేదాన్ని. మా అమ్మకు నన్ను టీవీలో చూడాలనిపించి ఓ చిన్న ఫొటో షూట్‌ చేయించి చిన్న పిల్లల మోడలింగ్‌ ఏజెన్సీలకు పంపించింది. అలా ‘ఒనిడా’ టీవీ లాంటి రెండు మూడు ప్రకటనల్లో కనిపించా. నిజానికి నాకు అప్పుడు ఆ విషయాలేవీ గుర్తులేవు కానీ, తరవాత నా ఫొటోలూ, వీడియోలూ చూశాక నేనేనా అక్కడ నటించింది అనిపించింది. ఇదంతా జరిగింది బెంగళూరులో. అక్కడ మోడలింగ్‌ ఏజెన్సీలు చాలా ఉండేవి కాబట్టి ప్రకటనల్లో అవకాశాలు దొరికాయి. తరవాత మా తమ్ముడు పుట్టాక అమ్మ వాడితో బిజీ అయిపోయి ఆ యాడ్స్‌ పని పక్కన పెట్టింది. నాన్న ఆర్మీలో పనిచేసేవారు. ఆయనకు కూడా బెంగళూరు నుంచి ట్రాన్స్‌ఫర్‌ అవడంతో మళ్లీ మోడలింగ్‌ జోలికి వెళ్లలేదు.

తొమ్మిదేళ్లలో పది స్కూళ్లు
నాకు చిన్నప్పట్నుంచీ ఫొటోలు దిగడం చాలా ఇష్టం. ఇంట్లో ఎప్పుడూ నా ఒక్కదాని ఫొటోలే తీయమని గొడవ చేసేదాన్ని. అమ్మ కూడా, ‘పెద్దయ్యాక మోడల్‌ అవుదువులే, ఇప్పుడు చదువుకో’ అని చెప్పేది. నేను నాలుగో తరగతికి వచ్చేవరకూ నాకు ఏ స్నేహితుల మొహం గుర్తులేదు. నాన్న ట్రాన్స్‌ఫర్ల వల్ల దాదాపు ప్రతి ఏడాదీ ఒక్కో వూరూ, స్కూలూ మారాల్సి వచ్చేది. నాలుగో తరగతి చదివేప్పుడు జలంధర్‌లో ఉన్నాం. అక్కడ ఒకమ్మాయి నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌ అయింది. కానీ షరా మామూలుగా నాన్నకు బదిలీ అయింది. నేను అక్కడే ఉండి చదువుకుంటానని బాగా ఏడ్చా. ‘మనం ఇప్పుడు నాసిక్‌ వెళ్తున్నాం. అక్కడ ప్యారా సెయిలింగ్‌, స్కై జంపింగ్‌ లాంటి బోలెడు ఆటలుంటాయి. ఇండియాలో ఇంకెక్కడా అవి ఉండవు’ అని నచ్చ జెప్పడంతో అక్కడికెళ్లడానికి ఒప్పుకున్నా. అలా తొమ్మిదో తరగతికి వచ్చేసరికి పది స్కూళ్లు మారా.

రోజంతా బిజీబిజీ
నాన్న ఆర్మీలో ఉన్నారు కాబట్టి సహజంగానే ఇంట్లో వాతావరణం కాస్త గంభీరంగా ఉండేది. కానీ జీవితంలో అన్నీ సమానంగా ఉండాలని అమ్మ తరచూ చెబుతుండేది. క్లాసులో తొంభై ఐదు శాతం రాకపోయినా ఫర్వాలేదు, కానీ అన్ని విషయాల్లో ఎంతో కొంత ప్రవేశం ఉండాలనేది. దానికి తగ్గట్లే చిన్నప్పుడు నా రోజువారీ షెడ్యూల్‌ ఉండేది. స్కూల్లో క్లాసులతో పాటూ స్కూలైపోగానే లైబ్రరీకి వెళ్లేదాన్ని. సాయంత్రం స్విమ్మింగ్‌, కరాటే క్లాసులకు వెళ్లేదాన్ని. కొన్నాళ్లు సింగింగ్‌, భరత నాట్యం, లాన్‌ టెన్నిస్‌లో శిక్షణ తీసుకున్నా. ఏడాదిన్నర పాటు హార్స్‌ రైడింగ్‌ నేర్చుకున్నా. హైస్కూల్‌కి వచ్చాక భవిష్యత్తులో మోడలింగ్‌ని ఎంచుకోమని అమ్మే సలహా ఇచ్చింది. ఆమె మాటల్ని బట్టి బహుశా ఒకప్పుడు తాను ఆ రంగంలోకి వెళ్లాలనుకుని వెళ్లలేకపోయిందేమో అనిపించేది. నాకూ మోడలింగ్‌లో ఆసక్తితో పాటూ కొద్దిగా భయం కూడా ఉండేది.

జాతీయస్థాయిలో గోల్‌ü్ఫ
ఆర్మీ వాతావరణంలో పెరగడంతో చిన్నప్పుడే గన్స్‌, రైఫిల్స్‌ లాంటి ఆయుధాలను దగ్గరగా చూశా. ఇంట్లో కూడా ఎయిర్‌ రైఫిల్‌ ఉండేది. ఇండియా-పాకిస్థాన్‌ యుద్ధం తరవాత నాన్నకు రాజస్థాన్‌లోని ‘ఇండోపాక్‌’ బోర్డర్‌ దగ్గర పోస్టింగ్‌ వచ్చింది. అక్కడ యుద్ధం తరవాత సైనికుల పహారా, ఆయుధాల వినియోగం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూశా. ఇంత భయంకర వాతావరణంలోనా నాన్న పనిచేసేదని భయమేసేది. నాన్నకు మిజోరామ్‌లో పోస్టింగ్‌ పడినప్పుడు మా కుటుంబమంతా చాలా ఇబ్బంది పడ్డాం. అక్కడ నాన్నతో మాట్లాడాలంటే ఫోన్‌ సదుపాయం ఉండదు. ఆయన ఫోన్‌ చేస్తే మాకు కనెక్ట్‌ చేసేవారు. సెక్యూరిటీ సమస్య వల్ల మేము చెప్పిన విషయాలను మధ్యలో మరో వ్యక్తి నాన్నకు చెప్పేవారు. అలా మూడేళ్ల పాటు చాలా ఒత్తిడి అనుభవించాం. తరవాత దిల్లీకి ట్రాన్స్‌ఫర్‌ అయ్యాక ఆ ఇబ్బంది రాలేదు. ఆర్మీ క్వార్టర్స్‌లో గోల్ఫ్‌ మైదానాలు చాలా ఉండేవి. పెద్దపెద్ద వాళ్లు ఆ ఆట ఆడతారనీ, నన్ను కూడా ఆడమనీ నాన్న చెప్పేవారు. మొదట్లో పెద్దగా ఆసక్తిలేకపోయినా, క్రమంగా అదో వ్యసనంలా మారిపోయింది. ఖాళీ ఉన్నప్పుడల్లా గోల్ఫ్‌ కోర్సులోనే ఉండేదాన్ని. స్కూల్‌ స్థాయితో మొదలుపెట్టి జాతీయ స్థాయి టోర్నమెంట్లలో కూడా ఆడా.

బంక్‌కొట్టి దొరికిపోయా
పన్నెండో తరగతిలో నేను స్కూల్‌ స్పోర్ట్స్‌ కెప్టెన్‌గా ఉండేదాన్ని. ఓసారి క్లాస్‌ జరుగుతున్నప్పుడు కిటికీలో నుంచి బ్యాగ్‌ను బయటకు విసిరేసి దూకేశా. అప్పుడే ఎదురుగా మా క్లాస్‌ టీచర్‌ వచ్చింది. విషయం తెలిసి ప్రిన్సిపల్‌ నన్ను పదిహేను రోజుల పాటు స్పోర్ట్స్‌ కెప్టెన్‌గా సస్పెండ్‌ చేశారు. నా టై, బ్యాడ్జీ తీసేసుకున్నారు. ఇంట్లో విషయం తెలియకూడదని నేను ఫ్రెండ్‌ టై, బ్యాడ్జ్‌ తీసుకొని వెళ్లేదాన్ని. మూడు రోజుల తరవాత తమ్ముడి గురించి మాట్లాడటానికి అమ్మ స్కూలుకొచ్చింది. అప్పుడే ప్రిన్సిపల్‌ నా గురించి చెప్పారు. ఇంటికొచ్చాక నా టై ఎక్కడని అమ్మ అడిగింది. విషయం అర్థమైందని తెలిసి సారీ చెప్పా. ‘నీకు స్కూల్‌కి వెళ్లాలని లేకపోతే ఇంట్లోనే ఉండూ, కానీ బయటి వాళ్లతో ఇలా చెప్పించకు’ అన్నారు. అప్పట్నుంచీ అలాంటి పనులు మానేశా. పన్నెండో తరగతిలో ఉన్నప్పుడే పోర్ట్‌ఫోలియో తయారు చేయించుకుని మోడలింగ్‌లోకి అడుగుపెట్టా.

పూరీ సినిమాకు నో!
నేను చాలా ప్రాక్టికల్‌గా, మరీ చెప్పాలంటే నెగెటివ్‌గా ఆలోచిస్తా. సినిమాల్లోకి వెళ్లాలని ఉన్నా, అక్కడ క్లిక్‌ అవకపోతే ఏంటీ పరిస్థితి అనీ ఆలోచించేదాన్ని. ఏదైనా ప్రమాదం జరిగితే నా కాళ్ల మీద నేను నిలబడటానికి ఏం చేయాలా అనుకున్నా. అందుకే డిగ్రీలో మ్యాథ్స్‌ గ్రూప్‌ ఎంచుకున్నా. సినిమాల్లో రాణించలేకపోతే ఎంబీయే చేయాలన్నది నా ఆలోచన. డిగ్రీ ఫస్టియర్‌లో ఉన్నప్పుడు మోడలింగ్‌ ఏజెన్సీ ద్వారా కన్నడలో ‘గిల్లీ’ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. ‘7జి బృందావన్‌ కాలనీ’ సినిమాకు రీమేక్‌ అది. నెలరోజులు నటిస్తే సరిపోతుందని చెప్పారు. అప్పటికి నాకు దక్షిణాది సినిమాల గురించి ఏమాత్రం తెలీదు. పాకెట్‌మనీకి బోలెడు డబ్బులొస్తాయి, సినిమా రంగంలో అనుభవం కూడా వస్తుందని ఒప్పుకున్నా. నెల రోజులు పనిచేశాక, డిగ్రీ పూర్తయ్యాక కూడా అదే రంగంలో కొనసాగాలని గట్టిగా నిర్ణయించుకున్నా. ఆ సినిమా విడుదలయ్యాక నటిగా గుర్తింపుతో పాటూ అవకాశాలూ వచ్చాయి. మొట్టమొదట నాకు ఫోన్‌ చేసింది పూరీ జగన్నాథ్‌. ఓ సినిమాలో అవకాశం ఇవ్వడానికి పిలిచారు. కాకపోతే శిక్షణ ఉంటుందనీ, ఓ వంద రోజులు డేట్లు కావాలని అడిగారు. అన్ని రోజులు కుదరదనీ డిగ్రీ పూర్తిచేయాలనీ చెప్పా. ‘డిగ్రీ మెడలో వేసుకుని తిరగం కదా, మంచి అవకాశాలు మళ్లీ రావు’ అని ఆయన నాన్నకు నచ్చజెప్పారు. నాన్న కూడా నన్ను కరస్పాండెన్స్‌లో చదవుకోమని అన్నారు. నేను మాత్రం దానికి ఒప్పుకోలేదు.

కొద్దిలో ‘మిస్‌ఇండియా’ మిస్‌...
‘గిల్లీ’ సినిమా వల్ల ఫస్టియర్‌లో అటెండన్సు చాలా తగ్గింది. దాంతో సినిమా ఆలోచన కొన్నాళ్లు పక్కనపెట్టా. ఈలోగా తెలుగులో మళ్లీ ‘కెరటం’ అనే సినిమాలో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. 60 రోజులు పడుతుందన్నారు. అన్ని రోజులు కుదరదనీ, ఏదైనా వేరే పాత్ర ఉంటే ఇవ్వమనీ అడిగా. బహుశా హీరోయిన్‌ కావాలనుకునే వాళ్లెవరూ అలా అడగరు. నేను మాత్రం ఆ సినిమాలో ఓ చిన్న పాత్ర కోసం ఆర్రోజులు షూటింగ్‌లో పాల్గొన్నా. సాధారణ కుటుంబాలకు చెందిన వాళ్లు సినిమాల్లోకి రావాలంటే బ్యూటీ కాంటెస్టులే సరైన వేదికలు. నేను కూడా అదే ఉద్దేశంతో డిగ్రీ చివర్లో ఉన్నప్పుడు మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొన్నా. ఒక్కోమెట్టూ ఎక్కుతూ ‘ఫైనల్‌ ఫైవ్‌’ దశకు చేరుకున్నా. కానీ కొద్దిగా తేడాతో ‘మిస్‌ ఇండియా’ కిరీటం మిస్సయింది. కానీ ఆ పోటీల్లో ‘మిస్‌ ఇండియా బ్యూటిఫుల్‌ స్మైల్‌, ఐస్‌, ఫేస్‌, టాలెంటెడ్‌’ విభాగాలతో పాటూ ప్రేక్షకుల ఓట్ల ద్వారా ‘మిస్‌ ఇండియా పీపుల్స్‌ ఛాయిస్‌’ అవార్డునూ అందుకున్నా. ఆ తరవాతే ప్రకటనలతో పాటూ నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు రావడం మొదలయ్యాయి. దక్షిణాది నుంచి ఎక్కువ అవకాశాలు వచ్చాయి. అందుకే ఆ సినిమాల గురించి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా గతంలో నాకొచ్చిన ఆఫర్ల గురించి స్టడీ చేశా. పూరీ జగన్నాథ్‌ ఎంత పెద్ద దర్శకుడో, ఆయన సినిమాను వదిలేసి ఎంత తప్పు చేశానో అప్పుడే అర్థమైంది.

ఇంకొంత...
సినిమాల్లో నిద్రా, సమయంతో పనిలేదు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు, ఎంత సేపంటే అంత సేపు పనిచేయాలి. కానీ నేను త్వరగా అలసిపోను. ఈ విషయంలో నా స్పోర్ట్స్‌, నాన్న నేర్పిన క్రమశిక్షణ చాలా ఉపయోగపడుతున్నాయి.
* ఎంత బిజీగా ఉన్నా జిమ్‌కు బ్రేక్‌ ఇవ్వను. వారంలో ఓ మూడ్రోజులు యోగా చేస్తా. వారానికోసారి గోల్ఫ్‌ ఆడతా.
* చిన్నప్పట్నుంచీ చాలా రాష్ట్రాల్లో పెరగడం వల్ల అందరితో సర్దుకుపోయే తత్వం పెరిగింది. సినీ రంగంలో అది చాలా అవసరం.
* తెలుగు చాలా బాగా మాట్లాడతా. సుమారు పది భాషలు అర్థమవుతాయి.
* హీరోయిన్‌గా రాణించకపోతే ఏం చేయాలని ముందే నిర్ణయించుకున్నా. ఎంబీయే ‘బ్రాండ్‌ మేనేజ్‌మెంట్‌’ చేసి ఆ రంగంలో స్థిరపడేదాన్ని.
* గాడ్జెట్స్‌ పైన మరీ అంత ఆసక్తి లేదు. కాకపోతే మాటిమాటికీ ఫోన్‌ చూసుకునే అలవాటుంది. తోటి నటులు ఆ విషయంలో నన్ను ఆటపట్టిస్తారు.
* అమితాబ్‌ నాకు ఇష్టమైన నటుడు. ఆయన పక్కన కూతురిగా ఒక్క నిమిషం నటించే పాత్ర వచ్చినా చేస్తా.

అవకాశాలు వాలిపోలేదు!
సినిమాల్లో తొలి అవకాశం రావాలంటే అదృష్టం ఉండాలి. నేను అనుకున్నట్లు ‘మిస్‌ ఇండియా’ పోటీల తరవాత అవకాశాలు వాలిపోలేదు. చాలా నెమ్మదిగా కెరీర్‌ మొదలైంది. మొదట తమిళంలో ‘పుత్తగన్‌’ అనే సినిమా చేశా. ఆ తరవాత హిందీలో ‘యారియా’ చేశా. ఆ రెండూ విజయం సాధించాయి. తరవాత తెలుగులో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’లో అవకాశం వచ్చింది. నిజానికి మొదట ఒప్పుకున్న సినిమా ‘రఫ్‌’. ముప్ఫయి రోజులు షూటింగ్‌ జరిగాక అది వాయిదా పడుతూ వచ్చింది. ఈలోగా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ విడుదలై హిట్టయింది. ఆ తరవాత గోపీచంద్‌తో చేసిన ‘లౌక్యం’, మనోజ్‌తో ‘కరెంట్‌ తీగ’ కూడా విజయాన్ని అందుకున్నాయి. ఓవైపు తమిళం నుంచి ఆఫర్లు మొదలయ్యాయి. ప్రస్తుతం రామ్‌తో ‘పండగ చేస్కో’, రవితేజతో ‘కిక్‌ 2’ విడుదలవుతున్నాయి. బాలీవుడ్‌లో ‘సిమ్లా మిర్చి’ కూడా షూటింగ్‌ పూర్తయింది. ‘జూ.ఎన్టీఆర్‌-సుకుమార్‌’, ‘రామ్‌చరణ్‌-శ్రీనువైట్ల’ సినిమాలు కూడా ఓకే అయ్యాయి.

నేను గోల్ఫ్‌ ఆడేటప్పుడు ఒక మాట చెప్పేవారు... ‘థింక్‌ ఎబౌట్‌ ది షాట్‌ ఇన్‌ యువర్‌ హ్యాండ్‌’. అంటే... నీ చేతిలో ప్రస్తుతం ఉన్న బంతి మీదే దృష్టి పెట్టు. ఇంతకుముందు కొట్టింది మళ్లీ సరిచేయలేవు. తరవాత కొట్టబోయేది నీ చేతిలో లేదు. ఇదే నియమం నా జీవితానికీ పెట్టుకున్నా. చేసిన సినిమాలూ, భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి అస్సలు ఆలోచించను. ప్రస్తుతం చేసేదే నా ఆఖరి సినిమా అన్నట్లు పనిచేస్తా.

- శరత్‌ బెహరా

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.