close
కొబ్బరిబోండానికి కళ్యాణవైభోగం..!

ఈ రోజుల్లో పెళ్లంటే... హీరోహీరోయిన్లను మరిపించే వధూవరులూ  సినిమాసెట్టింగుల్ని తలపించే  కళ్యాణమండపాలూ మొత్తంగా చూస్తే మూడు ఫొటోషూట్‌లూ ఏడు వీడియో రికార్డింగులూ అందుకే వధువు చేతిలోని కొబ్బరిబోండాం సైతం తళుకుబెళుకులతో అందంగా మెరిసిపోతూ పెళ్లికూతురి అలంకారంతో పోటీపడుతోంది.

కొబ్బరిబోండాం పెళ్లికూతురి అలంకారంతో పోటీపడటం అనేది కాస్త అతిశయోక్తిగా అనిపించినప్పటికీ ఇది నూటికి నూరుపాళ్లూ నిజమే. పెళ్లిని ఓ సంప్రదాయ వేడుకలానే కాకుండా ఆడంబరంగా సాగే సంబురంగా జరుపుకుంటోంది నేటి తరం. పెళ్లిలో భాగంగా జరుపుకునే ప్రతి తంతునీ వీడియోల్లో ఫొటోల్లో బంధించి తీరాలనుకుంటోంది. ఇంకా చెప్పాలంటే తమ జీవితంలో అత్యంత ముఖ్యమైన వివాహ ఘట్టాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా కమనీయ కావ్యంలా చిత్రీకరించాలనుకుంటోంది. అందులో భాగంగానే ఆ పెళ్లితంతులో వాడే సామగ్రిని అద్భుతంగా అలంకరించేస్తున్నారు. దాంతో స్వాగత తోరణం నుంచి వధువు చేతిలోని కొబ్బరిబోండాం వరకూ అన్నీ చమ్కీల మెరుపులూ రాళ్ల అందాలూ అద్దుకుని తళుకులీనుతున్నాయి.

వధువు చేతిలో...
పెళ్లిలో వాడే పీటలు, సన్నికల్లు, పెళ్లితెర, గరిగ ముంతలు... వీటన్నింటితో పోలిస్తే, పెళ్లికి పెళ్లికూతురికి అలంకరణ ఎంత ముఖ్యమో, కొబ్బరి బోండానికీ అంతే ప్రాధాన్యం. ‘కళ్యాణ మండపంలోకి వధువు అడుగుపెట్టే క్షణంలో అందరి కళ్లూ అమ్మాయిమీదే. అలాగే ఆమె చేతుల్లోని కొబ్బరిబోండాం మీదా అందరి దృష్టీ తప్పక పడుతుంది. అందుకే కొబ్బరిబోండాన్ని మరీ ప్రత్యేకంగా తయారుచేస్తున్నాం’ అంటున్నారు పెళ్లి వస్తువుల్ని తయారుచేసే డిజైనర్లు. దానిమీద వధూవరుల పేర్లతోబాటు వినాయకుడు, సీతారాములు, రాధాకృష్ణులు, శంఖుచక్రాలు, స్వస్తిక్‌, ఓం, తామరపువ్వు... ఇలా హిందూధర్మంలో శుభసంకేతాలుగా భావించే రకరకాల బొమ్మల్నీ పూసలూ చమ్కీలూ కుందన్లూ ముత్యాలతో అతికిస్తున్నారు. కొందరు రంగులతోనూ చిత్రీకరిస్తున్నారు. చివరికి బోండానికి ఉండే ముచ్చికను సైతం ముఖమల్‌, శాటిన్‌, పట్టు, జరీ వస్త్రాలతో చుట్టి అందంగా అలంకరిస్తున్నారు. మొత్తమ్మీద కొబ్బరిబోండాన్ని ఓ కళాత్మక వస్తువుగా రూపొందిస్తున్నారు. వీటిని ఎలా అలంకరించాలో తెలిపే వీడియోలు యూట్యూబ్‌లో లెక్కలేనన్ని. ఎవరికివారు స్వయంగా చేసుకోవడానికి సమయం లేనివాళ్లకోసం అన్నింటినీ సకాలంలో అందించే దుకాణాలూ, ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లు కూడా చాలానే వచ్చాయి. పెళ్లికూతురి చీర రంగేమిటో చెబితే దానికి చక్కగా మ్యాచయ్యేలా నారీకేళాన్నీ రంగులతోనూ రాళ్లతోనూ అలంకరించి మరీ సమయానికి అందిస్తున్నారు.

కొబ్బరిబోండామే ఎందుకు?
వివాహతంతు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. కానీ అన్నిచోట్లా కొబ్బరిబోండాన్ని ఏదో ఒక రూపంలో వాడటం విశేషం. ప్రాంతం, ఆచారాల్ని బట్టి నిశ్చితార్థ వేడుకలోనూ కొబ్బరికాయల్నీ, బోండాలనీ, ఎండుకొబ్బరినీ ఇచ్చిపుచ్చుకుంటారు. ఎందుకంటే నారీకేళం లేదా శ్రీఫలాన్ని సంతానోత్పత్తికి చిహ్నంగానూ పార్వతీపరమేశ్వరుల స్వరూపంగానూ భావిస్తారు. పండ్లలో ఫలం, విత్తనం రెండూ కలిసి ఉండే ఏకైక ఫలం కొబ్బరిబోండాం. అందుకే దీన్ని పూర్ణ ఫలం అంటారు. మిగిలిన పండ్లలో పండులోపల విత్తనాలు వేరుగా ఉంటాయి. అందుకే హోమం చేసేటప్పుడు పూర్ణాహుతిలోనూ ఈ ఫలాన్నే వేస్తారు. దక్షిణాది పెళ్ళిళ్లలో పెళ్లికూతురి చేతిలో కొబ్బరిబోండాం తప్పనిసరి. అది ఎందుకూ అంటే- హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ వేడుకలో సాలంకృత కన్యాదానం చేయాలి- అంటే కన్యని అలంకరించి ఆ అలంకారాలతో సహా దానం చేయాలన్నమాట. అందుకే చేతులకి గాజులు, చెవులకి కమ్మలు, ముక్కుకి ముక్కెర, నడుముకి వడ్డాణం, మెడలో కంఠహారాలు, భుజాలకు అరవంకీలు... ఇలా అన్నీ అలంకరించిన వధువుని పెళ్లికుమారుడికి కన్యాదాత దానంగా ఇస్తాడు. అలా ఇచ్చేటప్పుడు వధువుతోబాటు ఆమె ఒంటిమీద ఉన్న అలంకారాలన్నీ కూడా వరుడికి ఇచ్చినట్లే. వాటిని వెనక్కి తీసుకోకూడదనీ ఆ అలంకారాలన్నీ బంగారంతో చేసినవై ఉండాలనీ అంటారు. అయితే అవన్నీ చేయించే స్తోమత అందరికీ ఉండదు. అదీగాక కన్యాదానం చేసే ముందు దశ దానాలు చేయాలి అనీ చెబుతారు. అప్పుడే కన్యాదాన ఫలం కన్యాదాతకు దక్కుతుందట. మధ్య తరగతి కుటుంబీకులకి ఇవన్నీ కష్టం కాబట్టి ప్రత్యామ్నాయంగా కన్యాదాత కన్య చేతిలో మంచి గంధపుచెక్క, గుమ్మడిముక్క, కొబ్బరిబోండాం పెట్టి దానం ఇస్తే సాలంకృత కన్యాదానం చేసినట్లే అంటారు. అవన్నీ బంగారానికన్నా ఎంతో గొప్పవని పురాణాలూ పేర్కొంటున్నాయి.

అలాగే వధువు చేతిలో కొబ్బరిబోండాం పెట్టడం వెనక మరో విశిష్టత కూడా ఉంది. కన్యాదాత దానం ఇస్తూ నీళ్లు ధారగా పోసే సమయంలో కొబ్బరిబోండాం కూడా తడుస్తుంది. అది తిరిగి ఉత్పన్నం కావడానికి అంటే మొలకెత్తడానికి సిద్ధంగా ఉండే స్వరూపం అని అర్థం. వాళ్ల దాంపత్య జీవితం వల్ల చక్కని సంతానం కలిగి వాళ్లు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అమ్మాయి చేతిలో కొబ్బరిబోండాన్ని పెడతారు. పెళ్లిలో తాళిబొట్టుని సైతం ముందు కొబ్బరిబోండాం మీదే ఉంచుతారంటే దాని పవిత్రతని అర్థం చేసుకోవచ్చు.
అంతేకాదు, భార్యాభర్తల దాంపత్యజీవితం ఎలా ఉండాలో తెలియజెప్పేదే కొబ్బరిబోండాం. బయటకి చూడ్డానికి బోండాం ఎంతో గట్టిగా ఉన్నా దాని లోపల అమృతం లాంటి తియ్యని నీళ్లు ఉంటాయి. దాని మాదిరిగానే ఆలూమగలు కూడా జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వాటిని దృఢమైన వివాహబంధంతో తట్టుకుని, అన్యోన్యతతో జీవిస్తే అమృతంలాంటి సంసార జీవితాన్ని ఆస్వాదించగలరన్నది అంతరార్థం. అందుకే అంత పవిత్రమైన కొబ్బరిబోండాన్ని మరింత అందంగా కనిపించేలా చేయాలని తాపత్రయపడుతోంది ఈతరం. పైగా
ఈ స్మార్ట్‌ యుగంలో వేడుక ఏదైనా అందంగా ఆడంబరంగా కలకాలం వీడియోల్లో ఫొటోల్లో నిక్షిప్తమైపోవాలి. అందుకే కొబ్బరిబోండాన్ని సైతం తమదైన ప్రత్యేకతతో అద్భుతంగా అలంకరించేస్తున్నారు. ఎవరి ఆనందం వాళ్లది. ఎవరి పెళ్లి కొబ్బరిబోండాం కూడా వాళ్లదే మరి!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.