close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘గౌతమిపుత్ర’ కోసం 18 గంటలు...

‘గౌతమిపుత్ర’ కోసం 18 గంటలు...

గమ్యం, కృష్ణం వందే జగద్గురుమ్‌, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి... ఈ సినిమాల వెనుక దర్శకుడు క్రిష్‌తోపాటు వినిపించే మరో పేరు వాటి నిర్మాతల్లో ఒకరైన రాజీవ్‌ రెడ్డి ఎడుగూరు. వీరిద్దరి మధ్య దర్శకుడు-నిర్మాత బంధమే కాదు, స్నేహబంధం కూడా ఉంది. ‘నేను సినిమాల్లోకి రావడానికి కారణం క్రిష్‌. అతడు సినిమాల్లోకి రాకపోయుంటే నేనూ ఇటువైపు వచ్చేవాణ్ని కాదు’ అంటున్న రాజీవ్‌, తన సినిమా ప్రస్థానం గురించి చెబుతున్నారిలా...
క్రిష్‌, నేనూ అమెరికాలో ఒకే యూనివర్సిటీలో ఎం.ఎస్‌. కంప్యూటర్స్‌ చేయడానికి వెళ్లాం. మా పరిచయం అక్కడే. మేం క్లాస్‌మేట్స్‌ కూడా. ఆర్నెల్లకు రూమ్మేట్స్‌గానూ మారిపోయాం. చదువుకుంటూనే బయట పెట్రోలు బంకులో, రెస్టారెంట్‌లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేసేవాళ్లం. అర్ధరాత్రి తర్వాత ఖాళీ దొరికితే ఫోన్లో అసైన్‌మెంట్‌ల గురించి చర్చించుకునేవాళ్లం. తెల్లారాక రూమ్‌కి వచ్చి మూడు నాలుగు గంటలు నిద్రపోయి క్లాసులకి వెళ్లేవాళ్లం. క్లాసులు మధ్యాహ్నం రెండు నుంచి ఉండేవి. సోమవారం నుంచి శుక్రవారం వరకూ చదువూ, పార్ట్‌టైమ్‌ జాబ్‌లతో ఖాళీ ఉండేది కాదు. వారాంతాల్లో మాత్రం బైక్‌ ట్రిప్స్‌, పార్టీలతో సరదాగా గడిపేవాళ్లం. మా అపార్ట్‌మెంట్‌లో నలుగురం ఉండేవాళ్లం. వీకెండ్‌ వచ్చిందంటే ఆ సంఖ్య అయిదారు రెట్లు పెరిగేది.

వ్యాపార భాగస్వామ్యం
ఎం.ఎస్‌. పూర్తయ్యాక క్రిష్‌ ఇండియా వచ్చేశాడు. నేనక్కడే ఉండి ఆర్నెల్లు ఉద్యోగం చేశాను. తర్వాత ఇక్కడే ఏదైనా చేద్దామని నేనూ వచ్చేశాను. క్రిష్‌ అమెరికా నుంచి వచ్చాక ‘ఫస్ట్‌ కౌన్సిల్‌’ పేరుతో ఓ కంపెనీ పెట్టాడు. పైచదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు గైడెన్స్‌ ఇచ్చే కన్సల్టెన్సీ సంస్థ అది. క్రిష్‌తో ఉన్న స్నేహం కారణంగా ఇక్కడికి వచ్చాక అతడితోపాటు ఫస్ట్‌ కౌన్సిల్‌ నిర్వహణను చూసేవాణ్ని. తర్వాత ఆర్నెల్లకు ఓ ఐటీ కంపెనీలో ఉన్నత స్థాయి ఉద్యోగం వస్తే చేరాను. ఏడాదిపాటు అక్కడ పనిచేశాక ‘ఫస్ట్‌ కౌన్సిల్‌’ని ఇద్దరమూ నిర్వహిద్దామని చెప్పి క్రిష్‌ నన్ను తిరిగి పిలిచాడు. కాకపోతే రోజువారీ పర్యవేక్షణ నన్ను చూడమన్నాడు. అందుకు కారణం, క్రిష్‌ సినిమాల్లోకి వెళ్లదలుచుకోవడమే. ఉద్యోగంలో చేరాక నాకు పెళ్లి కుదిరింది. తర్వాత నెల గడువులోనే క్రిష్‌ నుంచి పిలుపు. అమ్మానాన్నలకి విషయం చెబితే నిర్ణయాన్ని నాకే వదిలేశారు. కానీ కాబోయే అత్తమామల్ని ఎలా ఒప్పించాలా అని సందేహించాను. పరిస్థితిని వివరించాక వాళ్లూ అభ్యంతరం చెప్పలేదు. దాంతో ఉద్యోగం విడిచిపెట్టి భాగస్వామిగా ‘ఫస్ట్‌ కౌన్సిల్‌’కి తిరిగి వచ్చాను. ఆ తర్వాత క్రిష్‌ సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అతడు సినిమా ప్రయత్నాలు చేస్తుంటే దాదాపు నాలుగైదేళ్లు కంపెనీని ముందుకు నడిపాను. మేమిద్దరం ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సాయపడిందా సంస్థ.

‘గమ్యం’తో తొలి అడుగు
2008లో ‘ఫస్ట్‌ కౌన్సిల్‌’ ద్వారా మేం సంపాదించిన మొత్తానికితోడు క్రిష్‌ వాళ్ల నాన్నగారు సాయిబాబు కొంత మొత్తం ఇవ్వడంతో ‘ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టెయిన్మెంట్స్‌’ బ్యానర్‌ స్థాపించి సినిమా నిర్మాణం మొదలుపెట్టాం. అప్పటికి క్రిష్‌ ఒక సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గానూ పనిచేశాడు. సినిమా నిర్మాణం రిస్కు అన్న భయం ఓ పక్క ఉండేది. ‘నాకు ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి. డైరెక్టర్‌గా గుర్తింపు వస్తే సరే లేదంటే నేనూ వెనక్కి వచ్చేస్తాను. అప్పుడు ఇద్దరం కలిసి కంపెనీని ముందుకు నడిపిద్దాం’ అని చెప్పాడు క్రిష్‌. ఆ సినిమానే ‘గమ్యం’. గమ్యంతో క్రిష్‌ తనను తాను దర్శకుడిగా నిరూపించుకున్నాడు. ఆ సినిమా నిర్మాణ పనుల్లో నేను పూర్తిగా భాగం కాలేదు. అప్పటికి ఫస్ట్‌ కౌన్సిల్‌నే చూసేవాణ్ని. మాకు ఆదాయం వస్తున్నది అక్కణ్నుంచే కదా, దాన్ని నిర్లక్ష్యం చేయదల్చుకోలేదు. ఆ సమయంలో సాయిబాబు గారు రోజువారీ నిర్మాణ బాధ్యతలు చూసేవారు. నేను డబ్బు సర్దుబాటు చేయడం, ఖర్చుల లెక్కలు చూసుకోవడం లాంటివి చేసేవాణ్ని. ‘గమ్యం’ హిట్‌ కావడంతో మాకు ధైర్యం వచ్చింది. ఆ సినిమాతో దర్శకుడిగా క్రిష్‌కీ, బ్యానర్‌గా ‘ఫస్ట్‌ ఫ్రేమ్‌...’కీ మంచి పేరు వచ్చింది. ఆ సినిమాతో మాకు ఫిల్మ్‌ఫేర్‌, నంది అవార్డులూ వచ్చాయి. అప్పుడే సీరియల్‌ చేయమని ‘ఈటీవీ’ నుంచి మాకు పిలుపు వచ్చింది. నిర్మాణ విభాగంలోకి నేను పూర్తిగా అడుగుపెట్టింది అప్పుడే. ఈటీవీ ప్రోత్సాహంతో మేం తీసిన సీరియల్‌... ‘పుత్తడి బొమ్మ’. ఆ సీరియల్‌ నాలుగేళ్లు ప్రసారమైంది. ఆ సీరియల్‌కు మాకు నంది అవార్డు కూడా వచ్చింది.

ఉషాకిరణ్‌ మూవీస్‌తో...
మా బ్యానర్‌లో వచ్చిన రెండో సినిమా ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’. ఈసారి నిర్మాణ బాధ్యతలు నేను చూసుకున్నాను. ఆ సినిమాకి అనుకున్నదానికంటే చాలా ఎక్కువ ఖర్చయింది. నా అనుభవలేమి కూడా అందుకో కారణమని చెప్పాలి. నేను ఖర్చుల్ని సరిగ్గా అంచనా వేయలేకపోయాను. ఆ సినిమాతో మేం ఆర్థికంగా నష్టపోలేదు కానీ, కొన్ని పొరపాట్లు చేయకుంటే, లాభాల్ని సంపాదించేవాళ్లం. కానీ మంచి సినిమా తీశామన్న సంతృప్తి మాత్రం ఉంది. ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’ తర్వాత క్రిష్‌ బాలీవుడ్‌లో ‘గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌’ చేయడానికి వెళ్లాడు. ఆ సమయంలో ఉషాకిరణ్‌ మూవీస్‌ భాగస్వామ్యంతో ‘దాగుడుమూత దండాకోర్‌’ చేశాం. అప్పుడు సినిమా నిర్మాణం గురించి చాలా విషయాలు నేర్చుకునే అవకాశం వచ్చింది నాకు. అనుకున్న బడ్జెట్‌లో, అనుకున్న సమయంలో సినిమా పూర్తిచేయడమెలాగో అర్థమైంది. ఆ సినిమా ఒకే షెడ్యూల్‌లో 28 రోజుల్లో పూర్తిచేశాం. ఆ అనుభవంతోనే మా బ్యానర్‌లో తర్వాత వచ్చిన ‘కంచె’ని అనుకున్న బడ్జెట్‌లో, సకాలంలో పూర్తిచేశాం. దీన్లో ఎక్కువ భాగం విదేశాల్లో షూటింగ్‌ చేసినా కూడా అనుకున్న బడ్జెట్‌కంటే అయిదు శాతం తక్కువకే చేశాం. చాలా సంతోషంగా పూర్తిచేసిన ప్రాజెక్టు. దీనికి జాతీయ అవార్డు కూడా అందుకున్నాం. ‘ఫస్ట్‌ కౌన్సిల్‌’ అనుభవంతో, విదేశాల్లో షూటింగ్‌ ఏర్పాట్లని మధ్యవర్తులు లేకుండా మేమే చూసుకుంటాం. దానివల్ల కొంత డబ్బు మిగులుతుంది కూడా.

గౌతమిపుత్ర...
మేం పరిశ్రమలోకి వచ్చి ఇన్నేళ్లవుతున్నా నేటికీ ఆర్థికంగా వెనకేసుకున్నది పెద్దగా లేదు. నిజానికి ఆర్థికంగాకంటే విలువలున్న బ్యానర్‌గా ఎదగాలనేది మొదట్నుంచీ మా లక్ష్యం. ఇప్పటివరకూ మేం అలాంటి సినిమాలనే తీశాం. ఇక ముందూ అలాంటివే తీస్తాం. రూపాయి పోయినా ఫర్వాలేదు. కానీ చెడ్డ పేరు రాకూడదనుకుంటాం. బాలకృష్ణ గారి వందో సినిమా కోసం ఎన్నో నిర్మాణ సంస్థలు పోటీపడ్డాయి. వారందరినీ కాదనుకొని కథ వినగానే మాకు డేట్స్‌ ఇచ్చారాయన. కథతోపాటు పరిశ్రమలో మాకున్న మంచి పేరు కూడా ఇందుకు కారణమని బలంగా నమ్ముతాను. దాదాపు పన్నెండేళ్ల కిందట కొత్త వ్యాపారం మొదలు పెడతామంటే మాకెవరూ డబ్బు ఇచ్చేవారు కాదు. మా వయసు కూడా అందుకో కారణం కావొచ్చు. కానీ ఈరోజు ఏదైనా ప్రాజెక్టు ప్రారంభిస్తున్నామని తెలిస్తే మేం అడగకుండానే డబ్బు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మా బ్యానర్‌లో వస్తోన్న అయిదో సినిమా. ఈ కథ ఆలోచన మొదలు స్క్రిప్టు రాస్తున్న దశ వరకూ క్రిష్‌ నాకు కొద్దికొద్దిగా చెప్పేవాడు. ఇలాంటి సినిమా నిర్మాణం నిజంగా సవాలే. బాలకృష్ణ గారిని కలిసే సమయానికి పూర్తిస్థాయిలో కథ సిద్ధం చేశాడు. కథ విన్న అరగంటకి బాలయ్య ఓకే చేశారు. బాలయ్యగారితో పనిచేయడం పూర్తిగా భిన్నమైన అనుభవం. యువ నటులు ఆయన నుంచి చాలా నేర్చుకోవాలి. సినిమాపైన ఆయనకున్న అంకితభావం, నిర్మాతలకు సహకరించే గుణం చాలా గొప్పవి. విదేశాల్లో షూటింగ్‌కి వెళ్లినపుడు బిజినెస్‌ క్లాసు వద్దేవద్దని ఎకానమీలో మాతోపాటు వచ్చారు. హోటల్‌ రూమ్‌లు కూడా అందరిలాంటివే తీసుకోమన్నారు. ఇప్పుడు కొత్తగా వస్తున్నవాళ్లే చాలా డిమాండ్లు చేస్తున్నారు. గౌతమిపుత్ర షూటింగ్‌ పూర్తయిపోయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. మధ్యలో క్రిష్‌ పెళ్లయింది. దాంతో కొంత గ్యాప్‌ వచ్చింది. అయినా ప్రాజెక్టు ఆలస్యం కాకూడదని రోజుకు 16-18 గంటలు పనిచేస్తున్నాం. అంత పెద్ద ఉత్సవ రథాన్ని ఒక్కరే లాగినట్టు క్రిష్‌ ఒక్కడే సినిమాని ముందుకు తీసుకువెళ్తున్నాడు. మేమంతా ఆయనకు చేయూతనిస్తున్నామంతే, ఒక్కోసారి వారం పదిరోజులు ఇంటికి కూడా వెళ్లడంలేదు. ఈ విషయంలో క్రిష్‌ శ్రీమతి రమ్యని అభినందించాలి.

ముందు స్నేహితులం
క్రిష్‌, నేనూ భిన్నమైన వ్యక్తులం. అన్నిసార్లూ నాకు నచ్చింది తనకి నచ్చదు. అలాగే తనకి నచ్చిన ప్రతీదీ నాకు నచ్చాలని లేదు. క్రిష్‌ తాను అనుకుంటున్న కథ గురించి చెప్పినపుడు నాకు కొన్నిసార్లు నచ్చకపోవచ్చు. నేను చూసిన ఓ సినిమా గురించి చెప్పి ‘బాగుంది మనం అలాంటి కథతో తీస్తే’ అన్నపుడు తనకది నచ్చకపోవచ్చు. కాకపోతే నాకు క్రిష్‌ సృజనాత్మకతపైనా, నైపుణ్యంపైనా గురి ఉంది. అలాగే నా సామర్థ్యం మీద క్రిష్‌కి నమ్మకం. అందుకే కలిసి పనిచేయగలుగుతున్నాం. తను కథ చెప్పినపుడు ఖర్చులు లెక్కలు వేసుకుంటాను. నటీనటులూ, టెక్నీషియన్ల ఎంపిక బాధ్యత క్రిష్‌ది. వారితో మాట్లాడి డేట్లు తీసుకొని షెడ్యూల్‌ రూపకల్పన, బడ్జెట్‌ సిద్ధం చేయడం, సినిమా మార్కెటింగ్‌కు సంబంధించిన బాధ్యతల్ని చూసుకోవడం నా విధులు. రోజూ ఇద్దరం షూటింగ్‌ స్పాట్‌కి కలిసే వెళ్తాం. ఆ సమయంలో ఆరోజు ఏమేం చేయాలో మాట్లాడుకుంటాం. సాయంత్రం తిరిగి వెళ్లేటపుడు కలిసే వెళ్తాం. పనులన్నీ అనుకున్నట్టు పూర్తయ్యాయా లేదా అని చర్చించుకుంటాం. ఆరోజు ఖర్చు పెరిగితే, మర్నాడు తగ్గించడం గురించి మాట్లాడుకుంటాం. చిన్నదీ, పెద్దదీ అని కాకుండా ప్రతి విషయాన్నీ చర్చిస్తాం. ఏ విషయంలోనైనా ఒకరికొకరం ఉన్నామన్న ధీమా, ధైర్యం. మా బ్యానర్‌లో మిగతా దర్శకులతో పనిచేయకపోవడానికి కారణం కూడా అదే. మిగతా దర్శకులు ఇలాంటి వివరాలన్నీ చర్చిస్తారా లేదా అని నా సందేహం. మేం భాగస్వాములమే కాదు స్నేహితులం కూడా కాబట్టి ఒకవేళ పొరపాట్లు జరిగినా వాటి గురించి ఎక్కువగా ఆలోచించం. ‘దాగుడుమూత దండాకోర్‌’ దర్శకుడు ఆర్‌.కె.మలినేని మాతో సీరియల్‌ చేశాడు. కాబట్టి సినిమా చేయడానికి ఇబ్బంది కాలేదు. ప్రస్తుతానికి క్రిష్‌తోనే సినిమాలు చేస్తున్నాం. క్రిష్‌ వేరే బ్యానర్‌లో చేస్తూ మాకు టైమ్‌ దొరికితే అప్పుడు మిగతా దర్శకుల గురించి ఆలోచిస్తాం.

మా మొదటి కంపెనీ... ‘ఫస్ట్‌ కౌన్సిల్‌’ ఇప్పటికీ ఉంది. కొన్ని కారణాలవల్ల దాని విస్తరణ మీద ఎక్కువ దృష్టిపెట్టడంలేదు. మా బ్యానర్‌లో ఈటీవీలో ‘స్వాతి చినుకులు’, ఈటీవీ ప్లస్‌లో ‘జంతర్‌ మంతర్‌’ సీరియళ్లని చేస్తున్నాం. క్రిష్‌ బావగారు ‘బిబో’ శ్రీనివాసరావు మా సినిమాల్ని సమర్పిస్తుంటారు. ఆయనా, నేనూ కలిసి ఒక భవన నిర్మాణ సంస్థని ప్రారంభించాం. భారీవి కాకుండా ఒక మాదిరి ప్రాజెక్టులు చేపడతాం. నేను సినిమాల్లో బిజీగా ఉంటే శ్రీనివాస్‌ గారు ఆ కంపెనీనీ, సాయి బాబుగారు సీరియళ్లనీ పర్యవేక్షిస్తారు. భవిష్యత్తులో మేం డిజిటిల్‌ మీడియా వైపు అడుగులు వేయాలని చూస్తున్నాం.


ఆమె కాస్ట్యూమ్‌ డిజైనర్‌

నాన్న శ్రీనివాసరెడ్డి, డాక్టర్‌. అమ్మ కమల, గృహిణి. హైదరాబాద్‌లోనే ఉంటారు. నాకో చెల్లి లండన్‌లో ఉంటోంది. మా తాతగారు పిడతల రంగారెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రిగా, స్పీకర్‌గా పనిచేశారు. నా శ్రీమతి ఐశ్వర్య. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసింది. కొన్నాళ్ల కిందట మా సంస్థలో చేరింది. ప్రస్తుతం సీరియళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షిస్తోంది. కంచె సినిమాకి కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేసింది. గౌతమిపుత్ర... సినిమాకి తనూ, క్రిష్‌ సోదరి సుహాసినీ కలిసి కాస్టూమ్స్‌ డిజైన్‌ చేస్తున్నారు. మాకు ఇద్దరు అమ్మాయిలు. సినిమా షూటింగూ, ఆఫీసులో పనీ లేకపోతే... ఇంటిదగ్గరే ఉంటా. భారీ ఆశయాలూ, లక్ష్యాలూ పెట్టుకోను. ఉన్నదాంతోనే నాకు సంతృప్తి. సినిమా పరిశ్రమలో నాకు పరిచయాలు తక్కువే. మా బ్యానర్‌లో చేసిన హీరోలు రానా, వరుణ్‌ తేజ్‌లు మాత్రం క్లోజ్‌. వరుణ్‌, నేనూ మంచి స్నేహితులం కూడా. సోదరుల్లా ఉంటాం. తరచూ ఫోన్లో మాట్లాడుకుంటాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.