Amitabh Bachchan: అందుకే ‘‘బచ్చన్‌’’ అని పేరు పెట్టారు
close

Published : 21/10/2021 01:31 IST

Amitabh Bachchan: అందుకే ‘‘బచ్చన్‌’’ అని పేరు పెట్టారు

 కేబీసీ-13 క్విజ్‌ షోలో అమితాబ్‌ బచ్చన్‌ వెల్లడి
విడిపోయిన తండ్రీకూతుళ్లను ఒకటి చేసిన బిగ్‌బి

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ ప్రముఖ నటుడు, బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వహిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి-13’ తాజా ఎపిసోడ్‌ ఉద్వేగభరితంగా సాగింది. కుటుంబం, ప్రేమ, పెళ్లి.. ఇలా మనిషి జీవితంలోని సున్నితమైన అంశాల చుట్టూ ఈ ఎపిసోడ్ కొనసాగింది. కాగా ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. మహారాష్ర్టలోని జల్‌గావ్‌కి చెందిన భాగ్యశ్రీ ఈ క్విజ్‌లో పాల్గొనేందుకు రాగా..  బిగ్‌బి ప్రశ్నలు అడగటానికి ముందు ఆమె వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ‘‘నేను ప్రేమ వివాహం చేసుకున్నా. అప్పటి నుంచి మా నాన్న నన్ను దూరం పెట్టారు. ఈమధ్యనే నాకో అమ్మాయి జన్మించింది. అయినా సరే.. నన్ను కానీ, నా కుమార్తెను కానీ చూసేందుకు మా నాన్న రాలేదు’’ అని భావోద్వేగానికి లోనయ్యారు. వెంటనే అమితాబ్‌ ఆమెను ఓదార్చారు. ‘‘ భాగ్యశ్రీ తండ్రి గారు మీరు కనుక షో చూస్తున్నట్లైతే..  దయచేసి మీ ఆగ్రహాన్ని పక్కన పెట్టండి, మళ్లీ కుమార్తెతో సంబంధాలు కొనసాగించండి ’’ అని కోరారు. 

ఈ విషయాన్ని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా: అమితాబ్
కంటెస్టెంట్‌ భాగ్యశ్రీ మాటలు విన్నాక అమితాబ్...‘‘ ఇప్పటి వరకూ మన మధ్య జరిగిన సంభాషణనను వ్యక్తిగతంగా భావిస్తున్నా. మీకు తెలిసో తెలియదో కానీ మా అమ్మానాన్నది (హరివంశ్‌ రాయ్‌ బచ్చన్‌, తేజీ బచ్చన్‌) కులాంతర వివాహమే. మా అమ్మ సిక్కు కుటుంబానికి చెందినవారు, నాన్నేమో ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాయస్థ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. వారిద్దరు వివాహబంధంతో ఒకటవుతామంటే.. ఇరువురి కుటుంబసభ్యులు కొద్ది రోజులు నిరాకరించారు. తరువాత ఒప్పుకున్నారు. అలా వారు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు నేను మీతో చెప్పింది 80 ఏళ్ల క్రితం నాటి మాట’’ అని ఆనాటి రోజులను గుర్తుచేసుకున్నారు.

బచ్చన్‌.. వెనుక బడా కథే ఉంది..
మీకు తెలుసు నా పేరు చివర ఉండే ‘బచ్చన్‌’ అనేది ప్రత్యేకమైనది అని. అయితే దాని వెనుక ఒక పెద్ద కథే ఉంది. అదేంటంటే.. నా తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ ఉద్దేశపూర్వకంగానే ‘బచ్చన్’ అనే ఇంటి పేరును ఎంచుకున్నారు.  నేను పాఠశాలలోకి చేరడానికి ముందు.. పాఠశాల యాజమాన్యం నా ఇంటిపేరు గురించి అడిగింది. అప్పుడే మా అమ్మానాన్న ఒకే కులానికి సంబంధించిన ఇంటిపేరును పెట్టకూడదని నిర్ణయించుకున్నారు. అలా సిక్కులది కానీ కాయస్థ నేపథ్యాలను వెల్లడించకుండా.. మా నాన్న పద్యాలు రాసేటప్పుడు వాడే కలంపేరు ‘‘బచ్చన్‌’’నే నా ఇంటిపేరుగా మార్చేశారు. ’ అని ఆయన జీవిత అనుభవాలను పంచుకున్నారు అనంతరం భాగ్యశ్రీ తండ్రితో ఫొన్‌లో మాట్లాడిన అమితాబ్‌.. సర్దిచెప్పారు. దీంతో ఆనందానికి లోనైన భాగ్యశ్రీ.. దూరమైన తండ్రిని మళ్లీ ఒక్కటి చేసినందుకు కేబీసీ షోకు, అమితాబ్‌కు రుణపడి ఉంటానని పేర్కొంది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న