గూగుల్‌ ఫొటోస్‌ ఉచిత అప్‌లోడ్‌ పరిమితమే
close

Published : 26/05/2021 00:52 IST
గూగుల్‌ ఫొటోస్‌ ఉచిత అప్‌లోడ్‌ పరిమితమే

గూగుల్‌ ఫొటోస్‌లో ఇకపై అపరిమితంగా హై క్వాలిటీ ఫొటోలను అప్‌లోడ్‌ చేయటం కుదరదు. వచ్చే నెల నుంచి ఈ సదుపాయాన్ని గూగుల్‌ నిలిపేయనుంది. అప్‌లోడ్‌ చేసే ఫొటోలు, వీడియోలు ఏవైనా ఉచిత 15 జీబీ స్టోరేజ్‌ పరిధిలోకే వస్తాయి. ఇది నిండిపోతే, అదనపు స్టోరేజీ కావాలంటే గూగుల్‌ వన్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సిందే. లేదంటే కొన్ని ఫొటోల్ని తొలగించాల్సి ఉంటుంది. ఫోటో సెట్టింగ్స్‌లో ‘ఒరిజినల్‌ క్వాలిటీ’ సెలక్ట్‌ చేసుకున్న వారికి, ఇప్పటికే గూగుల్‌ వన్‌ స్టోరేజ్‌కు రుసుము చెల్లిస్తున్న వారికి మాత్రం ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ‘ఒరిజినల్‌ క్వాలిటీ’ ఫొటోలు చాలావరకు నిర్ణీత ఉచిత జీబీ పరిధిలోనే ఉంటుంటాయి. అయితే, జూన్‌ 1కి ముందు అప్‌లోడ్‌ చేసిన హై క్వాలిటీ ఫొటోలు, వీడియోలు 15 జీబీ స్టోరేజీ కిందికి రావు. వీటిని గూగుల్‌ మినహాయించింది. పిక్సల్‌ ఫోన్‌ వాడేవారికి అపరిమిత ఉచిత స్టోరేజ్‌ సదుపాయం ఎప్పట్లానే కొనసాగుతుంది. అలాగే రెండేళ్లకు పైగా క్రియాశీలకంగా లేని ఖాతాల కంటెంట్‌ని జూన్‌ నుంచి డిలిట్‌ చేయనున్నారు కూడా.
స్టోరేజ్‌ చూసుకోవటమెలా?: గూగుల్‌ ఫొటోస్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి ఫోన్‌ కుడివైపు పైన ఉండే ప్రొఫైల్‌ ఐకాన్‌ మీద ట్యాప్‌ చేసి, సెట్టింగ్‌ సెక్షన్‌లోకి వెళ్లాలి. అకౌంట్‌ స్టోరేజ్‌ సెక్షన్‌లో ఎంత నిల్వను ఉపయోగించుకున్నారో చూడొచ్చు. అకౌంట్‌ స్టోరేజ్‌ మీద మరోసారి ట్యాప్‌ చేస్తే స్క్రీన్‌ కింద అప్‌లోడ్‌ సైజ్‌ సెక్షన్‌ కనిపిస్తుంది. అప్‌లోడింగ్స్‌ని బట్టి ఉచిత స్టోరేజ్‌ ఎంత వరకు వర్తిస్తుందనేదీ చూసుకోవచ్చు.
గూగూల్‌ వన్‌ సబ్‌స్క్రిప్షన్‌ ధరలు: 100 జీబీ స్టోరేజ్‌: నెలకి రూ.130, ఏడాదికి రూ.1,300. 200 జీబీ: నెలకి రూ.210, ఏడాదికి రూ.2,100.
ప్రత్యామ్నాయాలు..
గూగుల్‌ ఫొటోస్‌కి ప్రత్యామ్నాయాలు లేకపోలేదు. భారత్‌కు చెందిన డిజిబాక్స్‌ 20 జీబీ వరకు ఫ్రీ క్లౌడ్‌ స్టోరేజ్‌ అందిస్తోంది. 100 జీబీకి నెలకి రూ.30 చెల్లిస్తే చాలు. డీగో యాప్‌ 100 జీబీ ఫ్రీ క్లౌజ్‌ స్టోరేజ్‌ కల్పిస్తోంది. కాకపోతే వాణిజ్య ప్రకటనలుంటాయి. ఇందులో 500 జీబీ క్లౌడ్‌ స్టోరేజ్‌ ప్లాన్‌ కూడా ఉంది. దీనికి నెలకు రూ.220 చెల్లించాల్సి ఉంటుంది. ప్రకటనల బెడద ఉండదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న