మనం ఎవరం?

ఒకసారి దేవతలు, రాక్షసులు, మనుషులూ కలిసి విందు ఏర్పాటు చేసుకున్నారు. రుచికరమైన ఆహారపదార్థాలు బంగారు విస్తళ్లలో ఉన్నాయి. తినబోతే చేతులు కదల్లేదు. కొయ్యతెడ్లలాగా మోచేతుల దగ్గర బిగుసుకుపోయి వంగటం లేదు. ఆహారం నోట్లో పెట్టుకోవటం వీలవలేదు

Updated : 10 Mar 2022 05:09 IST

ఒకసారి దేవతలు, రాక్షసులు, మనుషులూ కలిసి విందు ఏర్పాటు చేసుకున్నారు. రుచికరమైన ఆహారపదార్థాలు బంగారు విస్తళ్లలో ఉన్నాయి. తినబోతే చేతులు కదల్లేదు. కొయ్యతెడ్లలాగా మోచేతుల దగ్గర బిగుసుకుపోయి వంగటం లేదు. ఆహారం నోట్లో పెట్టుకోవటం వీలవలేదు. పదార్థాలు నోరూరిస్తోంటే పోనీ ఎడమ చేతితో తిందామనుకుంటే అదీ వంగ లేదు.
రాక్షసులు రకరకాలుగా ప్రయత్నించి, చివరికి జంతువుల్లాగా బోర్లా పడుకుని విస్తరిలోకి వంగి నేరుగా నోటితో తినటం మొదలుపెట్టారు.
మనుషులు తామెలా తినాలా అని ఆలోచించారు. చెయ్యి వంగటం లేదు కానీ కర్ర లాగా ముందుకు చాపవచ్చు. అందుకని ఎదుటివారి నోటికి అందించి చూశారు. కుదిరింది. దానితో ఒకరికొకరు తినిపించుకుంటూ తృప్తిగా తిన్నారు.
ఎదుటివారి నోళ్లలో పెడుతున్న మనుషుల్ని చూసి దేవతలు తమ విస్తళ్లలో ఉన్న పదార్థాలను కూడా తీసుకోమన్నారు. ఆయా జాతుల తత్త్వం ఈ ఒక్క సంఘటనతో అర్థమవుతుంది. ఈ మూడు రకాలవారూ ఇప్పుడు కూడా ఉన్నారు.
స్వార్థంతో అంతా తమకే కావాలనుకుని ఏదో విధంగా అనుభవించాలనుకునే వారిది రాక్షసజాతి. ఒకరికొకరు సహకరించుకునే వారు మనుషులు. తమకి లేకున్నా ఇతరులకి ఇచ్చేవారు దేవతలు. మనం ఏ జాతికి చెందినవాళ్లమో ఆలోచించుకోవాలి! ఇంకో విశేషం ఏమంటే మనుషులు ఒకరికొకరు నిస్వార్థంగా సహాయం చేసుకుంటే బలహీనతలు, అంగవైకల్యాలు కూడా అవరోధాలు కావు. దేవతలు అడగకుండానే సహకారం అందిస్తారు.

- తుషార్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని