వరం శాపమైతే?!

కృతయుగంలో ఉష్ణగ్రీవుడు అనే ఒంటె ఉండేది. దానికి పూర్వజన్మ జ్ఞానం ఉండటంతో.. అది నియమనిష్ఠలతో తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. తానున్న చోటు నుంచి కదలకుండా ఆహారం సంపాదించటానికి వీలుగా ఉంటుందని.. తన మెడ సుదూరంగా సాగేట్టు వరం అడిగింది. బ్రహ్మ వరం ఇచ్చాడు.

Updated : 07 Apr 2022 00:57 IST

కృతయుగంలో ఉష్ణగ్రీవుడు అనే ఒంటె ఉండేది. దానికి పూర్వజన్మ జ్ఞానం ఉండటంతో.. అది నియమనిష్ఠలతో తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. తానున్న చోటు నుంచి కదలకుండా ఆహారం సంపాదించటానికి వీలుగా ఉంటుందని.. తన మెడ సుదూరంగా సాగేట్టు వరం అడిగింది. బ్రహ్మ వరం ఇచ్చాడు. ఇక దానికి గర్వం పెరిగిపోయింది. మేత కోసం అడవికి వెళ్లటం మానేసింది. సోమరితనంతో విశ్రాంతి తీసుకుంటూ ఆకలి వేసినప్పుడు మెడని పొడుగ్గా సాగదీసి అడ్డూ ఆపూ లేకుండా మేస్తూ హాయిగా ఉండసాగింది. కావలసినంత తిండి. కదలనక్కరలేదు. దాంతో అది బాగా లావైపోయి నిగనిగలాడుతూ తయారైంది.
ఒకరోజు పెద్దగా గాలి వీచి దుమ్ము బాగా పైకి లేచింది. ఒంటె తాను లేవటానికి బద్ధకించి తన మెడని మాత్రం ఒక గుహలో దాచింది. ఇంతలో వాన మొదలైంది. వానకు తడిసిపోతున్న నక్కల జంట ఆ గుహలో తలదాచుకోవటానికి వచ్చింది. కదలకుండా ఉన్న ఒంటె మెడని చూసి నకనక లాడుతున్న నక్కలు కొరికి తినబోయాయి. ఒంటెకి విషయం అర్థమై సాగదీసిన మెడను గబుక్కున ముడిచేందుకు ప్రయత్నించింది. కానీ కదిలే అలవాటు పోయిన ఒంటె లేవలేక నిస్సహాయంగా ఉండిపోయింది. సాగి, ముడుచుకునే మెడ భాగాన్ని కొరికి తిన్న నక్కలు వాన తగ్గటంతో గుహలోంచి వెళ్లిపోయాయి.
ఒంటె ప్రాణం గాల్లో కలిసిపోయింది.
నాశనకారకమైన వాటిలో ప్రధానమైనది బద్ధకం. గర్వం దానికి తోడు. బుద్ధి హీనతతో వరాలే శాపాలవుతాయని నిరూపించింది మహాభారతంలోని ఈ కథ.

- రాహుల్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని