ఏలినాటి శని గురించి భయం వద్దు!

ఈ పేరు వింటేనే చాలామందికి భయం. కానీ భీతి చెందాల్సిందే లేదంటారు జ్యోతిష నిపుణులు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ముప్పై ఏళ్లకోసారి తప్పనిసరిగా వచ్చి ఏడున్నరేళ్లు ఉంటుంది. సగటున 19 ఏళ్లు శని ప్రభావముంటుంది.

Updated : 29 Sep 2022 04:42 IST

పేరు వింటేనే చాలామందికి భయం. కానీ భీతి చెందాల్సిందే లేదంటారు జ్యోతిష నిపుణులు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ముప్పై ఏళ్లకోసారి తప్పనిసరిగా వచ్చి ఏడున్నరేళ్లు ఉంటుంది. సగటున 19 ఏళ్లు శని ప్రభావముంటుంది. నిజానికి శనిని తిట్టుకో నవసరం లేదు. శని ఆయుఃకారకుడు. మందగమనుడు కనుక తలపెట్టిన పనులను కాస్త ఆలస్యం చేస్తాడే కానీ అసలు చేయకుండా ఉండడు. పెళ్లిళ్లు, పదోన్నతులు లాంటి ఏ శుభ కార్యాలైనా కేవలం శని మూలంగా ఆగవు. అవి కావటంలేదంటే శనే కాకుండా జాతకంలో ఇతర గ్రహ ప్రభావాలూ ఉంటాయని గుర్తించాలి. శని ప్రభావాన్ని శుభప్రదంగా ఎదుర్కోవాలంటే శనివారంనాడు అరచేతి వెడల్పున్న నల్లవస్త్రంలో నల్ల నువ్వులు మూటలా కట్టి శనీశ్వరుడికి దానితో దీపారాధన చేసి, 19 ప్రదక్షిణలు చేయాలి. లేదా నవగ్రహాలకు తొమ్మిదిసార్లు ప్రదక్షిణచేసి, శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించినా ఫలితం ఉంటుంది. ఇలా తొమ్మిది వారాలు చేస్తే దోషాలు, కష్టనష్టాలు దూరమవుతాయన్నది శాస్త్రవచనం. అలాగే ఏలినాటిశని దోష నివారణకు ఇనుముతో శని విగ్రహాన్ని చేయించి, దాన్ని మట్టికుండ లేదా ఇనుపపాత్రలో ఉంచాలి. దానిపై నల్లటి వస్త్రం కప్పి, పూలూ గంధంతో పూజించి నువ్వులు, పులగం తోపాటు శక్తికొద్దీ దానం చేస్తే ఏలినాటి శని నివృత్తి అవుతుందని పండితులు సూచించారు. శని ప్రభావం రెండున్నర సంవత్సరాల చొప్పున మూడుసార్లు మొత్తం ఏడున్నరేళ్ల కాలం ఉంటుంది. దానాలు, ధర్మాలు, నవగ్రహ ప్రదక్షిణలు చేస్తే శనివల్ల ఆ వ్యక్తికి మేలే తప్ప కీడు జరగదు.

- డాక్టర్‌ టేకుమళ్ల వెంకటప్పయ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని