ధర్మసందేహాలను తీర్చే రుద్రగీత

పూర్వం నారదుడు చెప్పిన ఉమామహేశ్వర సంహితలోని విషయాలనే అంపశయ్య మీదున్న భీష్ముడు ధర్మరాజుకు వివరించాడు.

Updated : 27 Oct 2022 01:24 IST

గీతలెన్ని...18

పూర్వం నారదుడు చెప్పిన ఉమామహేశ్వర సంహితలోని విషయాలనే అంపశయ్య మీదున్న భీష్ముడు ధర్మరాజుకు వివరించాడు. అదే రుద్రగీత.  పార్వతీదేవి సందేహాలకు సమాధానంగా... ‘సాంఖ్య యోగ శాస్త్రాలకు కర్తని, సర్వానికి అధిపతిని నేనే. నాతో సరిసమానమైంది లింగరూపం. శివలింగ స్థాపన పుణ్యప్రదమైంది. ముల్లోకాలకూ మేలు చేయాలని స్వయంగా శివలింగాలను స్థాపించాను. ఆ పవిత్ర లింగాలను నా స్వరూపంగా భావించి పూజించి, జలంతో లేదా క్షీరంతో అభిషేకం చేసి గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తే ముక్తి లభిస్తుంది. లింగార్చన యోగ్యత సిద్ధించేందుకు విభూతిని ధరించి, భిక్షాటన చేస్తూ బ్రహ్మచర్యాన్ని గడిపే భక్తులకు సులభంగా వశుడినౌతాను. నాపై మనసు లగ్నం చేసేవారు బ్రహ్మానందభరితులౌతారు’ అంటూ వివరించాడు పరమశివుడు. తర్వాత రుద్రుడు పార్వతిని పతివ్రతా ధర్మాల గురించి అడగటం అర్ధనారీశ్వర తత్త్వంలో స్త్రీ పురుషుల సమానతను ప్రకటిస్తుంది. పంచయజ్ఞ నిర్వహణలో, గృహస్థాశ్రమ ధర్మపరిపాలనలో భర్తకు చేదోడువాదోడుగా ఉండాలి- లాంటి ప్రబోధలున్నాయి. అలాగే భార్యపట్ల భర్త ఎంత ప్రేమను ప్రకటించాలనే ప్రస్తావనా ఉంది. ఒకసారి పార్వతీదేవి సరసంగా పరమేశ్వరుడి కళ్లు మూసింది. శివయ్య కళ్లు సూర్య చంద్రులు కావడం వల్ల ఆ కాసేపూ కాంతి లోపించి ముల్లోకాల్లో కారుచీకటి వ్యాపించింది. వెంటనే మహేశ్వరుడు మూడోకన్ను తెరిచి వెలుగును ప్రసాదించాడు. అలాచెయ్యటానికి కారణమేమిటని పార్వతి అడిగింది. ‘నీ చేతులు తొలగించకుండా నీ ముచ్చటను గౌరవిస్తూ చీకటి వ్యాపించిన లోకాలకు వెలుగును ప్రసాదించేందుకు మూడోకన్ను తెరవాల్సి వచ్చింది’ అన్నాడు శివుడు. ఇలా శివతత్త్వ రహస్యాలూ, మరెన్నో ధర్మసందేహాలకు సమాధానాలిచ్చే జీవన మార్గదర్శి రుద్రగీత.

 - మల్లు, గుంటూరు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని