పాపఫలం

మహాభారత యుద్ధం జోరుగా సాగుతోంది. పాండవ మధ్యముడైన అర్జునుడు ప్రచండ భానుడిలా పరాక్రమం చూపిస్తూ ముందుకెళ్తున్నాడు. ఈలోపు కర్ణుడు ఓ బాణం వదిలాడు.

Published : 10 Nov 2022 00:36 IST

మహాభారత యుద్ధం జోరుగా సాగుతోంది. పాండవ మధ్యముడైన అర్జునుడు ప్రచండ భానుడిలా పరాక్రమం చూపిస్తూ ముందుకెళ్తున్నాడు. ఈలోపు కర్ణుడు ఓ బాణం వదిలాడు. అది గురి కుదరలేదని రథసారథిగా ఉన్న శల్యుడు సూచించాడు. ప్రళయాగ్నిలా దూసుకెళ్తున్న ఆ దివ్య బాణాన్ని గుర్తించిన అర్జున రథసారథి శ్రీకృష్ణుడు తన బలాన్నంతా ఉపయోగించి రథాన్ని అంగుష్ట ప్రమాణం నేలలోకి తొక్కిపట్టాడు. అయినా ఆ బాణం అర్జునుడి కిరీటాన్ని తాకి దూరంగా పడేసింది.
యుద్ధానంతరం అర్జునుడు ‘వరప్రసాదితం, మహాశక్తివంతం అయిన నా కిరీటాన్ని పడగొట్టే శక్తి ఆ బాణానికెలా వచ్చింది?’ అనడిగాడు. ‘అర్జునా! వనాన్ని దహించేటప్పుడు అనేక అమాయక ప్రాణులు, కీటకాలు ఆ అగ్నిలోపడి దగ్ధమయ్యాయి. అప్పుడు అశ్వసేనుడనే నాగు ఎలాగో తప్పించుకుని బయటపడింది. దాని తండ్రి ఆ పసినాగును అస్త్రరూపంలో కర్ణుడికి దానంగా ఇచ్చాడు. నీపై పగతీర్చుకోవడానికి అతడా బాణంలో దాగి ఉన్నాడు. అశ్వసేనుడి శక్తికన్నా నీ వల్ల జరిగిన దారుణమే నీ కిరీటాన్ని పడగొట్టింది. తెలిసి చేసినా, తెలియక చేసినా పాపఫలం అనుభవించక తప్పదు’ అన్నాడు పరమాత్మ. శల్యుడు సలహా ఇవ్వకపోయినా, కృష్ణుడు రథాన్ని భూమిలోకి అణగదొక్కక పోయినా ఆ బాణం నిస్సందేహంగా అర్జునుడి కంఠాన్ని ఛేదించేదనడంలో సందేహం లేదు.

- శ్రీమయి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని