ప్రలోభంతో గెలుపు

ఒక సందర్భంలో ‘ప్రజ్ఞ ఉంటే ఏ విద్య అయినా సిద్ధిస్తుంది. ప్రజ్ఞతో ప్రమేయంలేని సిద్ధి లోకకంటకం అవుతుంది’ అన్నాడు గౌతమ బుద్ధుడు.

Published : 10 Nov 2022 00:36 IST

ఒక సందర్భంలో ‘ప్రజ్ఞ ఉంటే ఏ విద్య అయినా సిద్ధిస్తుంది. ప్రజ్ఞతో ప్రమేయంలేని సిద్ధి లోకకంటకం అవుతుంది’ అన్నాడు గౌతమ బుద్ధుడు.
అది విన్న శిష్యులు ‘అదేమిటి? సిద్ధి ఉంటే ఇక ప్రజ్ఞతో పనేమిటి? అది లోకకంటకం ఎలా అవుతుంది?’ అంటూ సందేహం వెలిబుచ్చారు. అప్పుడు బుద్ధుడు తెలివైన మహాకాళేశ్వరుడి వంక చూశాడు. గురువు చూపును అర్థం చేసుకుని- ‘ఇందుకు నా జీవితమే ఉదాహరణ. నేను బౌద్ధంలోకి రాకముందు అతీంద్రియ శక్తుల కోసం తపస్సు మొదలుపెట్టాను. ఇది తెలిసిన బుద్ధులవారు నన్ను వెతుక్కుంటూ వచ్చి, ‘ముందు ప్రజ్ఞ సంపాదించు! దాంతో నీలోని చెడు నశిస్తుంది. నేరుగా సిద్ధిని సంపాదిస్తే మోహద్వేషాలు నశించవు. అప్పుడు సిద్ధులను దుర్వినియోగం చేయగలవు. వాటితో లోకోపకారం కన్నా స్వార్థం అధికమవుతుంది. అలా కాకుండా ప్రజ్ఞ సంపాదిస్తే నీ వల్ల చుట్టూ ఉన్నవారు కూడా బాగుపడతారు. ప్రజ్ఞ ఎత్తైన భవనం లాంటిది. నీటిముంపులో చిక్కుకున్న వారిని ఆదుకున్నట్టుగా.. ప్రజ్ఞా వంతులు సంసార సాగరంలో కొట్టుకు పోతున్నవారిని ప్రబోధాలతో రక్షించగలరు. ఈ సంగతి ఇంకా సులువుగా అర్థం కావాలంటే... ప్రలోభంతో గెలవడం అనేది సిద్ధి. నిజాయితీగా గెలుపొందడం ప్రజ్ఞ.. అని బోధించి నా జీవితాన్ని మార్చారు’ అంటూ చెప్పాడు. శిష్యుల సందేహాలు తీరిపోయాయి.            

- లక్ష్మి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని