గరుత్మంతుడి సందేహం

ఒకసారి గరుత్మంతుడు విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి ‘స్వామీ! నాకు అర్హత ఉందనుకుంటే, నీ దయకు పాత్రుణ్ణి అనుకుంటే..

Published : 06 Apr 2023 00:42 IST

ఒకసారి గరుత్మంతుడు విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి ‘స్వామీ! నాకు అర్హత ఉందనుకుంటే, నీ దయకు పాత్రుణ్ణి అనుకుంటే.. తపస్సుతో సాధ్యంకాని నీ మహా తత్వాన్ని నాకు బోధించు’ అని ప్రార్థించాడు.
విష్ణుమూర్తికి దయ కలిగింది. ‘నా విశ్వరూపం దేవతలకు కూడా తెలియదు. సమస్తం నాలో పుట్టి, జీవించి, మరణించినా నేను సంసారచక్రంలో బంధితుణ్ణి కాను. కానీ వాటికి లోబడి అంతర్లీనుడనై ఉంటాను. జడులు కానివారు, అహింసా ప్రవృత్తి కలవారు, కోరికలు లేనివారు, అహంకారం లేనివారు, దానం స్వీకరించనివారు, కోపం లేనివారు, స్వచ్ఛమైన జ్ఞానం కలవారు, నిత్యతృప్తులు, శాంతీ భక్తీ కలవారు నా తత్వాన్ని అర్థంచేసుకుని నన్ను పొందగలరు. యోగులైనా చంచలతత్వం ఉంటే నా యథార్థ స్వభావాన్ని తెలుసుకోలేరు. వ్యామోహమనే బురదలో కూరుకుపోయి వ్రతాలు, ఉపవాసాలు, నియమాలు పాటించి నంత మాత్రాన నా తత్వాన్ని గ్రహించలేరు. రజస్తమో గుణాలతో మలినం కాకుండా కేవలం సత్త్వగుణాన్నే స్థిరంగా నిలుపుకోగలిగిన జ్ఞానంతో నన్ను ధ్యానించడమే ముక్తి మార్గం. నేను సర్వజీవుల్లోనూ ఆత్మ (వాసుదేవుడు), బుద్ధి (సంకర్షణుడు), అహంకారం (ప్రద్యుమ్నుడు), మనసు (అనిరుద్ధుడు) అనే నాలుగు రూపాలుగా వ్యాపించి ఉంటాను. ఇది నా స్థూల రూపం’ అంటూ వివరించాడు. ఆ మాటలు శ్రద్ధగా విని భక్తితో నమస్కరించాడు గరుత్మంతుడు.

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు