కుంతికి మాటిచ్చిన వ్యాసమహర్షి

వానప్రస్థ జీవితం గడుపుతున్న ధృతరాష్ట్రుని చూసేందుకు వ్యాసమహర్షి వెళ్లాడు.

Published : 19 Oct 2023 00:17 IST

వానప్రస్థ జీవితం గడుపుతున్న ధృతరాష్ట్రుని చూసేందుకు వ్యాసమహర్షి వెళ్లాడు. క్షేమ సమాచారాలు తెలుసుకున్న తర్వాత- మనసులో ఉన్న కోరికేమిటో తెలియజేస్తే.. తీరుస్తానన్నాడు వ్యాసుడు. అక్కడే ఉన్న కుంతితోనూ అదే చెప్పాడు. అందుకు సంతోషించిన కుంతీదేవి ‘నేను కన్యగా ఉన్నప్పుడు ఒకసారి దుర్వాస మహర్షి వచ్చాడు. ఆయనకు అతిథి సేవలు చేసేందుకు మా తండ్రి నన్ను నియమించాడు. అణకువతో మహర్షికి సేవలు చేశాను. సంతోషించిన మహర్షి తిరిగెళ్లేటప్పుడు ఒక వరం కోరుకోమంటే.. నేనేమీ వద్దన్నాను. కానీ మహర్షి గట్టిగా చెప్పడంతో.. భయపడుతూనే కొడుకు కావాలన్నాను. ఆయనో మంత్రం ఉపదేశించాడు. దాన్ని పఠించి, ఏ దేవతను కోరుకుంటే వారు నాకు వశమై కోరిక తీరుస్తారని చెప్పాడు. మర్నాడు అదెంత మహిమాన్వితమో చూడాలన్న బాల్య చాపల్యంతో సూర్యుణ్ణి చూస్తూ మంత్రాన్ని పఠించాను. మరుక్షణం సూర్యుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే.. భయపడి వద్దన్నాను. ఆహ్వానించి, ఇలా అవమానిస్తే శపిస్తానన్నాడు సూర్యుడు. గత్యంతరం లేక కొడుకుని కోరగా.. సూర్యుడు తన తేజస్సును నాలో ప్రవేశపెట్టి, కొడుకు పుడతాడని చెప్పాడు. కన్యత్వానికి భంగం కలగకుండా మరో వరం కూడా ప్రసాదించాడు. అలా జన్మించిన బిడ్డను నదిలో వదిలేశాను. కానీ కన్నకొడుకును పోగొట్టుకున్నందుకు బాధపడుతుంటాను. కర్ణుణ్ణి చూడాలని ఉంది’ అంటూ చెప్పింది కుంతీదేవి.

‘ఇందులో నీ దోషమేమీ లేదు. దేవతలు వింతలు కల్పిస్తుంటారు. విధి అలా ఉంది కనుక నీళ్లలో వదిలేశావు. నీ కన్యత్వానికి భంగం కలగలేదు. నీకు కళంకం అంటదు.. కర్ణుణ్ణి చూపిస్తాను’ అంటూ ధైర్యం చెప్పాడు వ్యాసమహర్షి.

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని