విభూతి విశిష్టత

మహాశివుడికి భస్మం మహా ప్రీతికరం. భస్మం జ్ఞానానికి సంకేతమని పురాణాలు చెబుతున్నాయి.

Published : 30 Nov 2023 00:42 IST

హాశివుడికి భస్మం మహా ప్రీతికరం. భస్మం జ్ఞానానికి సంకేతమని పురాణాలు చెబుతున్నాయి.

ఓం త్రయంబకం యజామహే
సుగంధిం పుష్టి వర్థనం
ఉర్వారుకమీవ బంధనాత్‌
మృత్యోర్ముత్యుః యమామృతాత్‌

దోసతీగ నుంచి కాయ సులువుగా వేరుపడినట్లు మృత్యువనే బంధనం నుంచి నన్ను విడిపించ డానికి.. కీర్తి, సౌభాగ్యాలు పొందడానికి త్రినేత్రుణ్ణి పూజిస్తున్నానని భావం. ఈ మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ భస్మధారణ చెయ్యాలి. అలాగే

ఈశ్యాతే తత్పురుష నమో ఘోరాయతే సదా
వామదేవ నమస్తుభ్యం సద్యోజాతాయ వైనమ శ్రీ శివాయనమః

ఈశాన, తత్పురుష, అఘోరా, వామదేవ, సద్యోజాత అనే ఐదు ముఖాలు కలిగిన శివుడికి నమస్కరిస్తున్నానని భావం. ఈ మంత్రంతోనూ భస్మాన్ని ధరించవచ్చని శాస్త్ర వచనం. భస్మధారణ వేదం నుంచి స్వీకరించిన సంప్రదాయమే. విభూతి రేఖల్లో పైది మధ్య వేలితో, కిందిది అనామికతో ఎడమ నుంచి కుడికి, మధ్యరేఖను బొటనవేలితో కుడి నుంచి ఎడమకి పెట్టుకోవాలి. భస్మం శివుడు ఇచ్చిన ఐశ్వర్యంగా, జ్ఞానంగా భావిస్తారు. పూర్వం క్రౌంచారణ్యంలో వామదేవుడనే రుషి ఉండేవాడు. ఆయన సాక్షాత్తూ శివస్వరూపుడు. అది తెలియని ఒక బ్రహ్మరాక్షసుడు ఆయన్ని తినేయాలని దగ్గరికెళ్లాడు. వామదేవుడు నిర్లిప్తంగా చూస్తుండిపోయాడు. రాక్షసుడు వామ దేవుని తాకగా.. ఆయన శరీరం మీది విభూతి అంటి అతడిలో క్రౌర్యం నశించింది. దాంతో కాళ్లమీద పడి, క్షమించమన్నాడు. పూర్వజన్మల జ్ఞానం పొందాడు. మహాత్ముని స్పర్శ వల్ల లభించిన విభూతి అత్యంత శ్రేష్ఠమైంది. దానివల్ల అతడు సద్గతులు పొందాడు. శిరిడీ సాయినాథుడు కూడా ఊదీ (విభూతి) ప్రసాదం ఇచ్చేవాడు. విభూతి విశిష్టత గురించి సాక్షాత్తూ పరమశివుడే సనత్కుమారునికి బోధించాడు.

స్నానానంతరం భస్మధారణతోనే శుద్ధి పూర్తి అవుతుంది. విభూతే వ్రత నియమాలకు అర్హత. తాపసులకు భస్మధారణ తప్పనిసరి నియమం. విభూతి ధరిస్తే మహాపాపాలు కూడా హరిస్తాయి. సర్వజీవులకూ రక్షగా నిలుస్తుంది. విభూతి ధారణ మంగళ ప్రదాయకం. ధరించిన వారికి పవిత్రతను ఇస్తుంది. అందరికీ ఫలదాయకం. ఇవి మచ్చుకి కొన్ని మాత్రమే. నిజానికి భస్మధారణ ఫలం అపారం.

నూతి శివానందం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని