మంత్ర ప్రభావం

ఒక ఆధ్యాత్మిక గురువు సభికులను ఉద్దేశించి ఉపన్యసిస్తున్నాడు. భగవంతుని నామస్మరణ, మంత్రాల ప్రభావాన్ని వివరిస్తూ ‘నిరంతరం మంత్రజపం చేస్తే మనిషి ఒకనాటికి.. పారమార్థికోన్నతిని పొందుతాడు.

Updated : 14 Dec 2023 04:01 IST

ప్రబోధ

ఒక ఆధ్యాత్మిక గురువు సభికులను ఉద్దేశించి ఉపన్యసిస్తున్నాడు. భగవంతుని నామస్మరణ, మంత్రాల ప్రభావాన్ని వివరిస్తూ ‘నిరంతరం మంత్రజపం చేస్తే మనిషి ఒకనాటికి.. పారమార్థికోన్నతిని పొందుతాడు. మనసు పరిశుద్ధమవుతుంది. భగవంతుడి దర్శనం కూడా సాధ్యమవుతుంది’ అంటూ వివరిస్తున్నాడు. అది విని సభలోని ఓ వ్యక్తి ‘స్వామీ! మంత్రజపం, నామస్మరణలను ఎలా విశ్వసించాలి? అవి కేవలం కొన్ని అక్షరాలతో కూడిన శబ్దాలే కదా! వాటి వల్ల చిత్తశుద్ధి ఎలా కలుగుతుంది? భగవంతుడి దర్శనం సాధ్యమవుతుందా?’ అంటూ అనుమానం వ్యక్తం చేశాడు. వెంటనే ఆ ఆచార్యుడు.. ‘ఏంటీ, నీకు మంత్రజపం, నామస్మరణలపై నమ్మకం లేదా! నీవంటి మూర్ఖుణ్ణి ఎన్నడూ చూడలేదు’ అన్నాడు. నిండుసభలో తనను మూర్ఖుడనడంతో అతడు సిగ్గుపడ్డాడు. అవమానభారంతో ముఖం ఎర్రబడింది. మనసు కోపంతో రగులుతూ, శరీరం కంపిస్తోంది. అది చూసిన ప్రబోధకుడు- ‘నీకు శబ్దశక్తి మీద నమ్మకం లేదు కదా! మరి ‘మూర్ఖుడు’ అన్న మూడు అక్షరాల పదం వినగానే ఎందుకిలా ప్రతిస్పందిస్తున్నావు? ఒక మాట ప్రభావం నీ మీద ఎలా ప్రసరించిందో గమనించావా? అతి సాధారణమైన పదాలకే ఇంత ప్రభావం ఉంటే.. మంత్రాలకు, నామస్మరణకు ఇంకెంత ప్రభావం ఉంటుందో ఆలోచించు! మన సనాతన ధర్మం ప్రకారం మంత్రం అంటే ఒక విశేషమైన శబ్దం. అది భగవత్‌ పరమైంది, శుభప్రదమైంది. అలాంటి మంత్రాన్ని నిత్యం శ్రద్ధాభక్తులతో జపిస్తే ఆత్మవికాసం కలుగుతుంది’ అంటూ వివరించాడు.                                 - ప్రహ్లాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని