స్వర్గమా.. నరకమా..

పర్యటనలో ఉన్న గురుశిష్యులు- ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నారు. యజమాని వారిని లోనికి ఆహ్వానించి మర్యాదలు చేస్తున్నాడు. అంతలో ఆ వీధి గుండా శవాన్ని తీసుకెళ్తున్నారు.

Updated : 21 Dec 2023 04:05 IST

ర్యటనలో ఉన్న గురుశిష్యులు- ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నారు. యజమాని వారిని లోనికి ఆహ్వానించి మర్యాదలు చేస్తున్నాడు. అంతలో ఆ వీధి గుండా శవాన్ని తీసుకెళ్తున్నారు. అది చూసిన గురువు- ‘శిష్యా! ఆ శవం స్వర్గానికెళ్తుందా, నరకానికా.. అనే విషయాన్ని పరిశీలించి రా’ అని పురమాయించాడు. వెంటనే శిష్యుడు శవం వెంట పరిగెత్తాడు.

ఈ మాటలు విన్న యజమానికి ఆశ్చర్యం కలిగింది. ఒక వ్యక్తి స్వర్గం లేదా నరకానికి వెళ్లడాన్ని ఆ శిష్యుడెలా తెలుసుకుంటాడు? అనిపించింది. కానీ ఆ విషయాన్ని గురువును అడిగితే బాగుండదని ఆగిపోయాడు. కొద్ది నిమిషాలకే శిష్యుడు తిరిగొచ్చి.. ‘గురువర్యా! చనిపోయిన వ్యక్తి స్వర్గానికే వెళ్తున్నాడు’ అన్నాడు.

‘ధన్యజీవి’ అన్నాడు గురువు నమస్కరిస్తున్నట్లు చేతులు జోడించి.

ఈసారి యజమాని నిగ్రహించుకోలేక మనసులోని సందేహాన్ని బయట పెట్టాడు. ఆ మాటకు చిద్విలాసంగా నవ్వి ‘ఇదేం బ్రహ్మవిద్య కాదు నాయనా. కాస్త పరిశీలిస్తే తేలిగ్గానే అర్థమౌతుంది. ఎలాగో చెప్పనా.. శవం వెంట చాలామంది నడుచుకుంటూ వెళ్తే అతను చాలా మంచివాడని అర్థం. శవయాత్రలో పాల్గొన్న వారు చనిపోయిన వ్యక్తి చేసిన మంచిపనులను నెమరేసుకుని గొప్పగా చెబుతుంటే అతను ఉత్తముడని రూఢి. అలాంటి వ్యక్తి స్వర్గానికే వెళ్తాడు. కొందరే, కొద్దిదూరమే అనుసరిస్తే.. ఆ సమయంలో కూడా అతడి గురించి చెడుగా, నీచంగా తలచుకుంటే నరకానికి వెళ్తాడని తెలిసిపోతుంది’ అంటూ వివరంగా చెప్పాడు గురువు.

ధర్మసూక్ష్మం అర్థమైంది గృహస్థుకు.

రమా శ్రీనివాస్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు