భక్తి బీజాలు నాటేదెన్నడు?

చండామార్క, ప్రహ్లాదులు గురుకులంలో చదువుకుంటున్నారు. గురువులు లేని సమయంలో.. ఐదారేళ్ల ప్రహ్లాదుడు తోటి పిల్లలకు తనకు తోచిన హితవు చెప్పేవాడు. ఒకరోజు ‘మిత్రులారా! మీకో రహస్యం చెబుతాను.. అన్ని జీవాల్లోకీ మనిషి జన్మ దుర్లభం.

Published : 04 Jan 2024 00:08 IST

చండామార్క, ప్రహ్లాదులు గురుకులంలో చదువుకుంటున్నారు. గురువులు లేని సమయంలో.. ఐదారేళ్ల ప్రహ్లాదుడు తోటి పిల్లలకు తనకు తోచిన హితవు చెప్పేవాడు. ఒకరోజు ‘మిత్రులారా! మీకో రహస్యం చెబుతాను.. అన్ని జీవాల్లోకీ మనిషి జన్మ దుర్లభం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే శ్రీహరిని సేవించాలి. అప్పుడే సార్థకత’ అంటూ చెప్పాడు. ‘ఈ విషయాలన్నీ నువ్వెప్పుడు నేర్చుకున్నావు?’ అని ఒకరడిగితే.. ‘నిజం చెబితే మీరు ఆశ్చర్యపోతారు. యాదృచ్ఛికమో, దైవసంకల్పమో కానీ.. అమ్మ గర్భంలో ఉన్నప్పుడే ఇవన్నీ నేర్చుకున్నాను. మా తండ్రి హిరణ్యకశిపుడు దేవతలను చంపాలనే కోరికతో తపస్సు చేసేందుకు వెళ్లాడు. ఆయన మరణించాడని భావించిన దేవతలు అసురులపై విరుచుకుపడ్డారు. ఇంద్రుడు మా అమ్మని బందీగా తీసుకెళ్లి, ‘ఆమె గర్భంలో ఉన్న శిశువు మీకు ఎన్నటికీ శత్రువుగా పరిణమించడు. అతడు శ్రీహరి భక్తుడు’ అంటూ నా గురించి చెప్పాడు. ఇంద్రుడు మా అమ్మకి ప్రదక్షిణ చేసి వెళ్లిపోయాడు. తర్వాత అమ్మ నారదమహర్షిని సేవిస్తూ వారి ఆశ్రమంలో తలదాచుకుంది. నన్ను కూడా దృష్టిలో ఉంచుకుని కావచ్చు.. జ్ఞాన ధర్మాలు మా అమ్మకి, ఆమెతో పాటు నాకు ఉపదేశించాడు నారదుడు. అలా గురుకృప, శ్రీహరి కటాక్షాలతో నా స్మృతిలో ఆ ఉపదేశాలు మనసులో ముద్రితమయ్యాయి. కనుకనే ఆ అంశాలు మీకు తెలియజేస్తున్నాను. మీరెవరూ కూడా కోరికలతో కూడిన మొక్కులు, క్రతువులు, యజ్ఞాల పట్ల ఆసక్తి చూపవద్దు. ఆ పరమాత్ముని పట్ల ఏకాగ్రత, భక్తి కలిగి ఉండటం, అన్నిటిలో, అంతటా ఆయన్ను దర్శించడమే జీవిత పరమార్థం. కౌమార దశ నుంచి ఈ భక్తి భావన అలవరచుకోవాలి’ అంటూ వివరించాడు.

గోవిందం ఉమామహేశ్వర రావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని