అరుంధతీ దర్శనం ఎందుకు?

పెళ్లిలో నూతన దంపతులకు అరుంధతీ నక్షత్రం చూపిస్తారు. ‘ఈ ఆచారం ప్రాముఖ్యత ఏమిటి?’ అనిపిస్తుంది. శౌనకాది మునులకూ అలాగే సందేహం కలిగి, తీర్చుకునేందుకు సూత మహాముని దగ్గరకు వెళ్లారు. ఆయన ‘అరుంధతి, అనసూయ, సావిత్రి, సీత, ద్రౌపది- వీరు సదా వందనీయులు.

Updated : 11 Jan 2024 07:07 IST

పెళ్లిలో నూతన దంపతులకు అరుంధతీ నక్షత్రం చూపిస్తారు. ‘ఈ ఆచారం ప్రాముఖ్యత ఏమిటి?’ అనిపిస్తుంది. శౌనకాది మునులకూ అలాగే సందేహం కలిగి, తీర్చుకునేందుకు సూత మహాముని దగ్గరకు వెళ్లారు. ఆయన ‘అరుంధతి, అనసూయ, సావిత్రి, సీత, ద్రౌపది- వీరు సదా వందనీయులు. అరుంధతి అగ్రగామి. ఆమె చరిత్రను స్మరించినంతనే పుణ్యం కలుగుతుంది’ అని ప్రాచీన గ్రంథాల్లో పేర్కొన్నారు. ఒకసారి బ్రహ్మదేవుడు తన మనోసంకల్పంతో మహా సంధ్య అనే కన్యను, ఓ సుందర యువకుడైన మన్మథుణ్ణి సృష్టించాడు. సృష్టికార్యం లో తనకు సాయపడమంటూ పంచ బాణాలను కూడా ఇచ్చాడు. ఆ బాణాల శక్తిని పరీక్షించదలచిన మన్మథుడు- వాటిని బ్రహ్మలోక వాసుల పైనే ప్రయోగించాడు. ఆ ప్రభావం వల్ల బ్రహ్మతో సహా అందరూ అక్కడున్న సంధ్యను చూసి మోహానికి గురయ్యారు. ఒనగూరే ప్రమాదాన్ని పసిగట్టిన సరస్వతి వెంటనే ఈశ్వరుని ప్రార్థించడంతో ఆయన పరిస్థితిని చక్కదిద్దాడు. మన్మథుడి చేష్టకు ఆగ్రహించిన బ్రహ్మదేవుడు ‘ఈశ్వరుడి నేత్రాగ్నిలో భస్మమవుతావు’ అంటూ శపించాడు. తన మూలంగానే ఇంతమంది నిగ్రహం కోల్పోయారనే అపరాధభావంతో సంధ్య తపస్సు పేరిట తనువు చాలించాలని బయల్దేరింది. దాంతో బ్రహ్మ- వశిష్టుని పిలిపించి సంధ్యకు శివ తపోదీక్షను ఇవ్వమని కోరాడు. ఆమె దీక్షతో శివుణ్ణి మెప్పించి, ఆయన అనుగ్రహం పొంది- ‘సమస్త ప్రాణులకూ యవ్వనం వచ్చేదాకా కామవికారం కలగ రాదనే వరాన్ని ప్రసాదించమ’ని కోరింది. సంతోషించిన పరమేశ్వరుడు మరో వరాన్ని కూడా కోరుకోమన్నాడు. తను పుట్టగానే అనేకమందికి కామవికారాన్ని కలిగించింది కాబట్టి తన దేహాన్ని నశింపచేయమంది. శివుడు ‘కణ్వ మహర్షి పుత్రుడైన మేధాతిథి చేస్తున్న యాగకుండంలో దూకి తనువు చాలించు! అందులోనే మళ్లీ జన్మ కలుగుతుంది. శరీరం నశించేటప్పుడు ఎవరిని తలచుకుంటావో అతడే నిన్ను స్వీకరిస్తాడు’ అని వరమిచ్చాడు శివుడు. వశిష్టుడే తన భర్త కావాలని కోరుకున్న సంధ్య మళ్లీ జన్మించింది. అలా అగ్ని నుంచి తిరిగి జన్మించిన అరుంధతికి యుక్త వయసు రాగానే వశిష్టుడితో వివాహం చేశారు. అరుంధతి తన పాతివ్రత్య మహిమతో ముల్లోకాలకూ పూజ్యురాలైంది. ఆదర్శ దంపతులకు ప్రతీక అయిన అరుంధతీ, వశిష్టుల్లా అన్యోన్యంగా ఉండాలని పెళ్లిలో అరుంధతీ నక్షత్రాన్ని చూపడం సంప్రదాయమైంది. ఈ దర్శనం వల్ల దంపతులకు ఆరోగ్యం, ఆయుష్షు, ఐశ్వర్యం కలుగుతాయని విశ్వసిస్తారు.

డా.టేకుమళ్ల వెంకటప్పయ్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని